Fighter Movie Review హృతిక్ యాక్షన్, దీపిక గ్లామర్, విజ్‌వల్ ఎఫెక్ట్స్ హైలెట్స్‌గా.. ఫైటర్ మూవీ సమీక్ష
నటీనటులు: హృతిక్ రోషన్, దీపిక పదుకోన్, అనిల్ కపూర్, వినయ్ వర్మ, రిషబ్ సాహ్నీ, అశుతోష్ రాణా, తలత్ అజీజ్ తదితరులు
దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్
నిర్మాతలు: సిద్దార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ తదితరులు
సినిమాటోగ్రఫి: సత్‌చిత్ పౌలోజ్
ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
పాటలు: విశాల్ శేఖర్
బ్యానర్: వయాకామ్ స్టూడియోస్, మ్యాట్రిక్స్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-01-25
షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీ (హృతిక్ రోషన్) ఎయిర్‌ఫోర్స్ పైలెట్. భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఎయిర్ డ్రాగన్ అనే జట్టులో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. పాకిస్థాన్‌తో జరిగిన దాడుల్లో తన కాబోయే భార్యను కోల్పోతాడు. దాంతో పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. పుల్వామా దాడుల తర్వాత పాక్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసే క్రమంలో అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి పాక్ గగనతలంలోకి ప్రవేశిస్తాడు. దాంతో ఎయిర్ డ్రాగన్ టీమ్ నుంచి తొలగించి హైదరాబాద్‌లోని ఎయిర్ బేస్‌లో శిక్షకుడిగా నియమిస్తారు.

దేశభక్తి, ముక్కు సూటితనం, దూకుడు స్వభావం వల్ల ప్యాటీకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయాయి. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే పాక్ ఐఎస్ఐ టెర్రిరిస్ట్ అజర్ అఖ్తర్‌ను ప్యాటీ ఎలా ఎదుర్కొన్నాడు? పాక్ చెరలో ఉన్న తన తోటి పైలెట్లను రక్షించే క్రమంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాడు? ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్‌గా పనిచేసే మిన్నల్ రాథోడ్‌ను ఆమె కుటుంబం ఎందుకు బహిష్కరించింది? మిన్నల్ రాథోడ్, ప్యాటీ మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది? అజర్ అఖ్తర్‌ను ఎదురించి తన కొలీగ్‌ను ప్రాణాలతో ఇండియాకు తీసుకొచ్చాడా? అనేది సినిమా కథ.
సిద్దార్థ్ ఆనంద్ రాసుకొన్న కథ రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్‌గానే కనిపిస్తుంది. కాకపోతే యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే కథకు ఎమోషన్స్ జోడించి నడిపిన డ్రామా ఆకట్టుకొంటుంది. కథలో ఊహించని ట్విస్టులు గానీ లేకపోవడం వల్ల రొటీన్ టెర్రరిస్ట్ బేస్‌గా జరిగే థ్రిల్లర్‌గా అనిపిస్తుంటుంది. అయితే ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా క్వాలిటీగా ఉండటమే కాకుండా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగే సర్జికల్ స్ట్రైక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
ఇక యాక్షన్, థ్రిల్లింగ్ విజ్‌వల్ ఎపిసోడ్స్ పక్కన పెడితే.. వినోదం, రొమాన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల సినిమా మొత్తం సీరియస్‌గా సాగిపోతుంటుంది. దీపిక, హృతిక్ ఉన్నారంటే ఏదో గ్లామర్ ఉంటుందని ఆశిస్తే.. నిరాశపడొచ్చు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుల మరణాలు చాలా ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా హృదయాన్ని భారంగా మార్చుతాయి.

హృతిక్ రోషన్ యాంగ్రీ పైలెట్‌గా లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఇరగదీశాడనే చెప్పాలి. తాను పైలెట్ కాదు.. ఫైటర్‌ను అని చెప్పుకొనే యాటిట్యూబ్ ప్యాటీ క్యారెక్టర్‌కు బలంగా మారింది. ఇక క్లైమాక్స్‌లో అధికారులు ఆదేశాలను ఉల్లంఘించి.. కోర్టు మార్షల్‌కు సిద్దపడిన సీన్లు బాగున్నాయి. అనిల్ కపూర్, తెలుగు నటుడు వినయ్ వర్మ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లలో తమదైన శైలిలో నటించారు.
దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. గ్లామర్‌కు ఎలాంటి స్కోప్ లేని హుందాగా ఉండే పాత్రలో నటించారు. మహిళలు సైన్యంలో పనిచేయడానికి పనికిరారు అనే అపోహాలను, అలాగే తండ్రికి ఇష్టం లేకుండా ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన యువతిగా తన పాత్రకు స్కోప్ ఉన్నంత వరకు మెప్పించే ప్రయత్నం చేశారు. రిషబ్ సాహ్నీ పాక్ టెర్రిరిస్టుగా మెయిన్ విలన్‌గా నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. సంచిత్, అంకిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విశాల్ శేఖర్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేపోయాయి. సత్‌చిత్ పౌలోజ్ ఫోటోగ్రఫి ఎక్ట్రార్డినరీగా ఉంది. ఎడిటింగ్, గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

ఫైటర్ సినిమా విషయానికి వస్తే.. URI, పఠాన్ తరహా సాగే యాక్షన్ థ్రిల్లర్. ఊహించ దగిన సన్నివేశాలు, రెగ్యులర్, రొటీన్ కథనాల ఉన్నప్పటికీ.. యాక్షన్, గ్రాఫిక్ వర్క్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఫ్యామిలీ డ్రామా ప్లస్ పాయింట్. హృతిక్, దీపిక పదుకోన్, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. అలాగే దేశభక్తి, పాక్ టెర్రిరిజాన్ని అణిచి వేసే కథలను ఆస్వాదించే వారికి ఈ సినిమా మంచి ఎమోషన్స్, హై మూమెంట్స్ అందిస్తాయి. ఈ సినిమాను థియేటర్‌లోనే చూస్తే ఓ రకమైన మజా ఉంటుంది. కాబట్టి బిగ్‌స్క్రీన్‌లోనే చూసి ఆనందించాలనే మా సలహ.


Click it and Unblock the Notifications











