Gaami Review టెక్నికల్ బ్రిల్లియెన్స్.. విజువల్ వండర్.. గామి సినిమా సమీక్ష
నటీనటులు: విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ, దయానంద్ రెడ్డి, అభినయ, హారిక పెద్ద, శాంతిరావు, మయాంక్ పరాఖ్, జాన్ కొటోలీ, భొమ్మ శ్రీధర్ తదితరులు
దర్శకత్వం: విద్యాధర్ కగిత
నిర్మాత: కార్తీక్ సబరీష్
బ్యానర్: కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్
సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి
మ్యూజిక్:నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
రిలీజ్ డేట్: 2024-03-08
శంకర్ (విశ్వక్ సేన్) అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ వ్యాధి వల్ల ఎవరినైనా ముట్టుకొంటే వారికి, తనకు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి నుంచి బయటపడాలంటే..
త్రివేణి పర్వతంలో 36 ఏళ్లకు ఓసారిలభించే ఔషద మొక్కతో వైద్యం చేయించుకొంటే ఆ సమస్య నుంచి బయటపడుతారని వైద్యులు చెబుతారు. దాంతో హిమాలయ మంచు పర్వతాలకు జాహ్నవి (చాందిని చౌదరీ)తో కలిసి శంకర్ బయలు దేరుతాడు. ఇదిలా ఉండగా దేవదాసి దుర్గ (అభినయ), కూతురు ఉమ (హారిక పెద్దడ)ను దేవదాసిగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఓ అబ్బాయిపైయ వైద్య ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే శంకర్‌కు ఎలాంటి అరుదైన వ్యాధి ఎలా వచ్చింది? ఆ వ్యాధితో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడు? శంకర్‌తో ట్రావెల్ అయిన జాహ్నవి ఎవరు? శంకర్‌తో కలిసి ఆమె ఎందుకు లైఫ్ రిస్క్ తీసుకొన్నది? మెడికల్ ఫెసిలిటీలో అబ్బాయిపై ఎందుకు ప్రయోగాలు చేశారు? దేవదాసి కూతురు ఉమను మరో దేవదాసిగా చేయాలనే ప్రయత్నంలో ఏం జరిగింది? చివరకు శంకర్ ఆ అరుదైన ఔషద మొక్కను సాధించాడా? తనకు ఉన్న అరుదైనవ్యాధి నుంచి బయటపడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానమే గామి సినిమా కథ.
త్రివేణి పర్వత ప్రాంతంలోని అఘోరా క్యాంపులో ఓ ఎమోషనల్ సీన్‌తో శంకర్ లైఫ్‌లో జరిగిన సంఘటనల్లోకి వెళ్లడంతో సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. దానికి తోడు అద్బుతమైన విజువల్స్, హాలీవుడ్ స్థాయిలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కొత్త అనుభూతిని కలిగించేలా చేశారు. కానీ మూడు కోణాల్లో సాగే కథ కొంత మేరకు సాధారణ ప్రేక్షకులకు గందరగోళంగా కనిపిస్తుంది. ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే.. సాధారణంగా, రెగ్యులర్ సినిమాలకు చూపించే అటెన్షన్ సరిపోదు. కాసేపు ఆదమరిచినా.. ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవడానికి కష్టంగా మారే స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బ్యూటీ. టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అని చెప్పవచ్చు.

తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా రాసుకొన్న పాయింట్ దర్శకుడు విద్యాధర్ కగిత ప్రతిభకు అద్దం పట్టింది. తక్కువ బడ్జెట్‌తో సినిమా అద్బుతమైన అవుట్ పుట్ అందించిన తీరు అతడి టాలెంట్ తెరపైన చూపించిందని చెప్పవచ్చు. ఇక పాత్రల డిజైన్, సీన్స్ ఇంటర్ కట్స్ డిఫినెట్‌గా ప్రేక్షకులకు కొత్త లోకంలో తీసుకెళ్లేలా చేశాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. విధ్యాధర్ టేకింగ్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.
విశ్వక్ సేన్‌ను ఇప్పటి వరకు మాస్ హీరోగానే చూశాం. కానీ ఈ సినిమాతో అతడిలో మంచి పెర్ఫార్మెన్స్ చూసే అవకాశం గామి సినిమా అవకాశం కల్పించింది. శంకర్ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా ఒదిగిపోయాడు. తనకు ఉన్న మాస్ ఇమేజ్ భిన్నంగా డిఫరెంట్ లుక్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. దేవదాసిగా అభినయ, ఉమగా హారిక, ఓ ప్రత్యేక పాత్రలో దయానంద్ రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు రాణించడమే కాకుండా మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో తెలుగు సినిమా రంగంలో అద్బుతమైన క్వాలిటీతో సినిమాను రిచ్‌గా మార్చారు. నరేష్ కుమారన్, స్వీకర్ మ్యూజిక్ హై స్టాండర్డ్ ఉంది. విశ్వనాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. ఎడిటింగ్ విషయంలో రాఘవేంద్ర తిరున్ ఇంకా కొన్ని కత్తెర్లు పడాల్సిన అవసరం ఉంది. కార్తీక్ సబరీష్ అనుసరించిన నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
భావోద్వేగమైన కథ, హైలీ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే, ఉన్నత సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కలబోసిన చిత్రం గామి. సాధారణ ప్రేక్షకుడి ఇంటెలిజెన్స్‌కు దూరంగా అనిపిస్తుంది. కానీ మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు, యూత్‌కు, డిఫరెంట్ కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా పండగపూట ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. అయితే చాలా ఓపికగా ఈ సినిమాను భరించాల్సి ఉంటుంది. రెగ్యులర్, రొటీన్ సినిమాలకు అలవాటు పడిన వారికి కషాయం తాగినట్టే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. గామి విజువల్ వండర్, టెక్నికల్ బ్రిల్లియెన్స్ అని చెప్పవచ్చు. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











