Gam Gam Ganesha Review.. సరదాగా సాగే ఫన్, క్రైమ్ డ్రామా.. గం.. గం.. గణేశా మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు
రచన, దర్శకత్వం: ఉదయ్ శెట్టి
నిర్మాతలు: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
కో-ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం: చేతన్ భరద్వాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
లిరిక్స్: సురేష్ బనిశెట్టి
బ్యానర్: హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
రిలీజ్ డేట్: 2024-05-31
అనాథగా పెరిగిన గణేష్ (ఆనంద్ దేవరకొండ) తన స్నేహితుడు శంకర్ (జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్) చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. సూపర్ మార్కెట్‌లో పనిచేసే శృతి (నయన్ సారిక)ను మనసారా ప్రేమిస్తే.. సూపర్ మార్కెట్ ఓనర్ హర్షిత్ (కృష్ణ తేజ)ను పెళ్లి చేసుకోవడానికి సిద్దమౌతుంది. దాంతో చిల్లర దొంగతనాలు మానేసి ఏదైనా భారీ దొంగతనం చేసి బిలియనీర్ కావాలని ప్లాన్ వేస్తాడు. ఆ సమయంలోనే గణేష్‌కు ఏడు కోట్ల విలువైన డైమండ్ దొంగిలించాలనే ఆఫర్ వస్తుంది. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం పదవిపై ఆశ పెంచుకొన్న కిషోర్ రెడ్డి (రాజ్ అర్జున్) ఎన్నికల కోసం భారీగా డబ్బు అత్యవసరంగా కావాల్సి వస్తుంది. దాంతో ముంబై నుంచి హవాలాగా నంద్యాలకు తెప్పించాలని ప్లాన్ వేస్తాడు. కిషోర్ రెడ్డికి 100 కోట్లు, గణేష్ దొంగిలించిన డైమండ్‌ను వినాయకుడి విగ్రహంలో పెడుతారు. కానీ ఊహించని విధంగా అవి మిస్ అవుతుంది.

గణేష్ ప్రేమను శృతి ఎందుకు నిరాకరించింది? కిషోర్ రెడ్డికి హవాలా ద్వారా 100 కోట్లు తెప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? విలువైన డైమండ్‌ను గణేష్ దొంగిలించి వినాయకుడి విగ్రహంలో ఎందుకు పెట్టాడు. 100 కోట్ల డబ్బును ముంబై నుంచి నంద్యాలకు ఎందుకు తరలించాల్సి వచ్చింది? డబ్బు, డైమండ్ దాచిన వినాయకుడి విగ్రహం మరో ఊరికి ఎలా చేరింది? ఆ విగ్రహం నుంచి డబ్బు చేజిక్కించుకోవడానికి కిషోర్ రెడ్డి వర్గం చేసిన ప్రయత్నాలు ఏమిటి? డైమండ్‌ను వినాయకుడి తొండం నుంచి తీసుకోవడానికి గణేష్ ఏం చేశాడు? కిషోర్ రెడ్డికి 100 కోట్లు దక్కయా? గణేష్‌కు డైమండ్ చేతికి చిక్కిందా? అనే ప్రశ్నలకు సమాధానమే గం.. గం.. గణేశా సినిమా కథ.
గం.. గం.. గణేష్ సినిమా కథ విషయానికి వస్తే.. పక్కాగా స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కామెడీ కథ. తమ చేతి నుంచి చేజారిన విలువైన సంపద, వస్తువులను చేజిక్కించుకోవాలనే వ్యక్తుల చుట్టు అలుకొన్న సన్నివేశాలు, పాత్రల ఆధారంగా నడుస్తుంది. కథలో కోత్తదనం లేకపోయినా.. పలు రకాల పాత్రలు సృష్టించి వాటి చేత కథను నడిపించిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే కథ ఓ సర్కిల్‌లో అక్కడక్కడే తిరుగుతూ ఉండటం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు.

ఇక మూవీ సెకండాఫ్‌లో కామెడీ సీన్లు, పాత్రలతో నవ్వించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కానీ కథను ఆరు, ఏడు లేయర్ల మధ్య నడిపించడంతో గందరగోళంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ)తో లవ్ ట్రాక్ కొంత ఊరటనిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌కు ముందు వచ్చిన ఆర్గాన్ డేవిడ్ (వెన్నెల కిషోర్), స్వామి (జగన్), రాజావారు (సత్యం రాజేశ్) పాత్రల ద్వారా కామెడీ వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ రొటిన్‌గానే ముగుస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గణేష్‌గా ఆనంద్ దేవరకొండ రకరకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను పర్‌ఫెక్ట్‌గా చేసి మెప్పించాడు. ఇప్పటి వరకు సీరియస్, ఎమోషనల్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన ఆనంద్.. ఈ సినిమాలో యాక్టింగ్, డాన్స్, కామెడీ పరంగా పూర్తిగా ఓపెన్ అయ్యాడు. మాస్ రోల్స్‌కు తాను సై అంటూ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకొన్నాడు. ఇక నీలవేణిగా కనిపించిన ప్రగతి శ్రీవాస్తవ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. నయన్ సారిక ఫర్వాలేదనిపించింది. రాజ్ అర్జున్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మిగితా నటీనటులు తమదైన శైలిలో మెప్పించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఆదిత్య జవ్వాడి, చేతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. పాటలు పెద్దగా ఆకట్టుకొలేకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విభాగానికి ఇంకా కొంత పని ఉందనిపిస్తుంది. స్టోరీ వేగానికి ప్రిన్స్ యావర్ అడ్డుపడినట్టు.. చికాకుగా అనిపిస్తుంది. నిర్మాతలు కేదార్ , వంశీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను రిచ్‌గా మార్చాయి.

గం.. గం.. గణేశా.. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే లవ్, ఎమోషనల్ సినిమాగా చెప్పుకోవచ్చు. నటీనటుల పెర్మార్మెన్స్, వెన్నెల కిషోర్, జగన్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కామెడీ సినిమాకు రిలీఫ్. కామెడీ తరహా సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. హాస్య ప్రధానమైన సినిమాలను చూడాలనుకొనే వారు ఈ సినిమాను వారాంతంలో ఎంచుకోవచ్చు. అంచనాలు లేకుండా వెళితే.. మంచి ఫీల్‌తో బయటకు రావడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











