twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గేమ్‌' బాగుంది

    By Staff
    |

    Game
    సినిమా: గేమ్‌ - ఆట మొదలైంది
    విడుదల తేదీ: 04-08-2006
    నటీనటులు: మోహన్‌బాబు, విష్ణువర్ధన్‌బాబు, శోభన,
    పార్వతి మెల్టన్‌, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, గిరిబాబు, రఘుబాబు తదితరులు
    కెమెరా: బాలమురుగన్‌
    సంగీతం: జోష్వా శ్రీధర్‌ (ప్రేమిస్తేఫేమ్‌)
    మాటలు: మరుధూరి రాజా
    కథ: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ యూనిట్‌
    నిర్మాణం: మంచు మనోజ్‌కుమార్‌
    దర్శకుడు: జి. రామ్‌ప్రసాద్‌

    రీమేక్‌ సినిమాల మీద తెలుగు సినిమా హీరోలు పెట్టుకున్న నమ్మకం మరోమారు విజయవంతం అయిందని గేమ్‌ చిత్రం రుజువుచేస్తుంది. ఒకరకంగా పెద్దకొడుకు విష్ణువర్ధన్‌బాబు కెరీర్‌ని నిలబెట్టడానికి మోహన్‌బాబు ఈ సినిమా ద్వారా సేఫ్‌గేమ్‌ ఆడారనిపిస్తుంది.

    ఇప్పుడు ఆట మొదలైంది..
    మోహన్‌బాబు పాత్ర 'పండిట్‌ వీరరాఘవ'కు ఒంటినిండా పొగరు ఈ సినిమాలో. అందువల్లనే ఎక్కడా ఇమడలేని అతను 14 సంవత్సరాలలో 28 ఉద్యోగాలు మారి చివరిగా టాక్సీ (నెంబర్‌ 1144) డ్రైవర్‌గా సెటిల్‌ అవుతాడు. అతని భార్య 'జానకి' పాత్రలో శోభన భర్తకు నచ్చచెప్పలేక, సంసార భారంతో సతమతం కాలేక యిబ్బంది పడుతుంటుంది. అయితే మోహన్‌బాబు ఇంట్లో తను ఎల్‌.ఐ.సి. ఏజెంట్‌నని భార్యని నమ్మించి టాక్సీ నడుపుకుంటూంటాడు.

    విజయరాజ్‌ (విష్ణు) ఓ కోటీశ్వరుడి కొడుకు. అన్ని విధాలా భ్రష్టుపట్టి పెడదారిలో నడిచే పాత్ర అతనిది. అతని తండ్రి విష్ణువర్ధన్‌ (కన్నడ నటుడు) మరణిస్తూ 300 కోట్ల రూపాయల తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకు పేర కాకుండా తన అనుచరుడు గిరిబాబుకు విల్లురాసి మరణిస్తాడు. ఇది విష్ణుకు మింగుడుపడదు. ఆస్తికి తనే వారసుడనని కోర్టుకెక్కుతాడు. ఆ రోజు కోర్టులో విచారణ జరగాలి. అది అతని జీవితానికి చాలా కీలకమైన రోజు. పోయిపోయి విష్ణు వెళ్లి మోహన్‌బాబు టాక్సీ ఎక్కుతాడు.

    ఇద్దరికీ ఒకరిని మించి మరొకరికి పొగరు. తను చేరుకోవాల్సిన గమ్యానికి వేగంగా తీసుకువెళితే బోల్డంత డబ్బిస్తానంటూ రెచ్చగొడతాడు విష్ణు. అది నచ్చని మోహన్‌బాబు విష్ణుని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఫైనల్‌గా విష్ణుని కోర్టు దగ్గర డ్రాప్‌ చేస్తాడు. అయితే ఆ హడావుడిలో విష్ణు కీలకమైన డాక్యుమెంట్లు ఉన్న లాకర్‌ తాళాన్ని కార్‌లోనే వదిలేస్తాడు. మోహన్‌బాబుకు ఆ తాళం దొరుకుతుంది కానీ దాన్ని విష్ణుకి ఇవ్వడు. ఆ తాళం లేకపోవడం వల్ల విష్ణు కోర్టులో కేసు ఓడిపోతాడు. అక్కడి నుండి గేమ్‌ మొదలవుతుంది.

    తన తాళం చెవి ఇమ్మని విష్ణు మోహన్‌బాబుని డిమాండ్‌ చేస్తాడు. కానీ ఒక యాక్సిడెంట్‌కి బాధ్యుడని విష్ణు మీద కోపంతో మోహన్‌బాబు ఆ తాళం చెవిని ఇవ్వనంటాడు. అందుకు ప్రతిగా విష్ణు వెళ్లి శోభనకు ఆమె భర్త ఎల్‌.ఐ.సి. ఏజెంట్‌ కాడని, టాక్సీ డ్రైవర్‌ అని నిజం చెప్పేసి వాళ్ల కాపురంలో చిచ్చుపెట్టేస్తాడు. ఫలితంగా శోభన కొడుకుతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. మోహన్‌బాబు ఒంటరివాడైపోతాడు.

    కథ ముందుకు నడుస్తున్న కొద్దీ విష్ణుకు మోహన్‌బాబు కొరకరాని కొయ్యగా మారతాడు. అదే సమయంలో విష్ణు కూడా మోహన్‌బాబుకు అంతే పజిల్‌గా కనిపిస్తుంటాడు. కొంతదూరం వెళ్లాక ఒకళ్ల నొకళ్లు ఎత్తులు, పైఎత్తులు వేసుకోవడం వల్ల ఇద్దరికీ ఒరిగేదేమీ లేదని గ్రహిస్తారు. ఫాల్స్‌ ప్రిస్టేజ్‌, మొండితనం విషయంలో ఇద్దరూ ఒకరకమైన మనస్తత్వం కలవారని గ్రహిస్తారు. ఇద్దరి స్వభావాల్లో పరివర్తన కలుగుతుంది. ఆ క్రమంలో విష్ణు కూడా తన ప్రేయసి పార్వతి మెల్టన్‌కు దూరం అవుతాడు.

    విష్ణుకు ఆస్తి తాలూకు డాక్యుమెంట్లను మోహన్‌బాబు అందించేస్తాడు. దానికి ప్రతిఫలంగా మోహన్‌బాబు భార్య శోభనను, కొడుకును తిరిగి మోహన్‌బాబు దగ్గరకి చేరుస్తాడు విష్ణు.

    నటీనటులు నటన పరంగా చూస్తే మోహన్‌బాబు ఈ చిత్రంలో చాలా బ్యాలెన్స్‌తో పాత్రను పోషించారు. సాధారణంగా మోహన్‌బాబు సినిమాల్లో పట్టినట్లు మాట్లాడే డైలాగులు ఈ సినిమాలో కనిపించవు.. అక్కడక్కడ తప్ప. విష్ణు నటన కొంత మెరుగుపడినట్లు కనిపిస్తుంది. బాధ్యత తెలియని భర్తకు భార్యగా నలిగిపోయే పాత్రలో శోభన అభినయం చాలా చక్కగా ఉంది. హీరోయిన్‌ పార్వతి మెల్టన్‌ అందంతో అభినయం కూడా ప్రదర్శించి అగ్రశ్రేణి హీరోయిన్లకు తానేమీ తీసిపోనని ప్రూవ్‌ చేసింది. ఉయ్యాలో.. ఉయ్యాలో పాటలో అందాలను ఆరబోసి కుర్రకారును హుషారెక్కిస్తుంది.

    హైలెట్స్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే పెద్ద హైలెట్‌. ఆద్యంతం బోర్‌ కొట్టించకుండా ప్రేక్షకులను కూర్చోపెడుతుంది స్క్రీన్‌ప్లే. దర్శకుడు రామ్‌ ప్రసాద్‌ తన మీద మోహన్‌బాబు పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.అలాగే రెండో హైలెట్‌ ఈ సినిమాలో కెమెరా పనితనం. ప్రతి ఫ్రేముని అందంగా మలిచారు ఫోటోగ్రాఫర్‌ బాలమురుగన్‌.

    సంగీతపరంగా చూస్తే జోష్వా శ్రీధర్‌ (ప్రేమిస్తే ఫేమ్‌) సన్నివేశాలకు సరిపడ ట్యూన్స్‌ అందించాడు. ఆ పాటలకి డాన్స్‌ కంపోజింగ్‌ కూడా విష్ణు, పార్వతిలకు చక్కగా నప్పింది. విష్ణు ఇంట్రడక్షన్‌ పాట - కమాన్‌ ఎవ్రీబడీ టు హైదరాబాద్‌, డ్యూయెట్‌ 'ఉయ్యాలో.. ఉయ్యాలో..' ఆకట్టుకుంటాయి.బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కొరియోగ్రఫర్‌ గణేశ్‌ ఆచార్య ఈ చిత్రానికి పనిచేశారు.

    కొసమెరుపు.. క్లయిమాక్స్‌లో నటి శ్రియ మెరుపులా మెరిసి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అలాగే ఈ సినిమాలో సింగిల్‌ సన్నివేశంలో మాజీ హీరోయిన్‌ సుమలత జడ్జి పాత్రలో కనిపిస్తుంది.

    ఓవరాల్‌గా.. ఈ సినిమా బాగుంది. హిందీలో నానా పటేకర్‌తో మోహన్‌బాబు నటనను పోల్చతగినా.. జాన్‌ అబ్రహమ్‌ స్థానంలో విష్ణుని వూహించడం కష్టమే అవుతుంది. అయినా తనకున్న పరిమితుల వరకూ విష్ణు పడ్డ కష్టం కనిపిస్తుంది. విష్ణు గత చిత్రాలతో పోలిస్తే .. గేమ్‌ సినిమాని నిర్భయంగా చూడొచ్చు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X