twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గమ్యం సినిమా: యాధృచ్ఛికత నుంచి... ఈ సీన్ గురించి...

    By Pratap
    |

    జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన గమ్యం సినిమా గురించి చాలా మంది మాట్లాడే ఉంటారు. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. ఈ సినిమాలోని అల్లరి నరేష్ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కేవలం హాస్యానికి వాడుకునే అల్లరి నరేష్‌ను ఓ లుంపెన్ క్యారెక్టర్‌లో అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలోని ఒక్క సంఘటన గురించి, లేదా ఒక్క దృశ్యం గురించి చూద్దాం....

    నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగే ఎన్‌కౌంటర్ సీన్ ఉత్పన్నం కావడానికి గల నేపథ్యాన్ని దర్శకుడు రూపుదిద్దిన తీరును చూస్తే సినిమాకు లేదా ఏ కళకైనా అతివ్యాప్తి దోషాన్ని నివారించడం ఎలాగో గమనించవచ్చు. ఎన్‌కౌంటర్‌లో ఏ సంబంధం లేని శ్రీను (అల్లరి నరేష్) బలి కావడం ప్రేక్షకుల హృదయాలను మెలిపెడుతుంది.

    కాగా, తన ప్రేయసి జానకి (కమిలినీ ముఖర్జీ)ని అన్వేషిస్తూ వెళ్లే క్రమంలో అభిరామ్ (శర్వానంద్) శ్రీనును తోడుగా తీసుకుంటాడు. అలా బైక్ మీద వెళ్తున్న సమయంలో వర్షం పడుతుంది. ఆ వర్షంలో తడిసిన ఇద్దరు వేడి వేడి టీ కోసం రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు దగ్గర ఆగుతారు. ఇంత వరకు సినిమా చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది. శ్రీను హావభావాల్లో, మాటల్లో దాన్ని దర్శకుడు అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లాడు.

    Gamyam revisited: A scene that explains

    అలా కొట్టు దగ్గర ఆగిన సమయంలో శ్రీనుకు పరిచయం ఉన్న ఓ ప్రజా సంఘాల నాయకుడు మరో వ్యక్తి కూడా అక్కడికి వస్తారు. వారిద్దరికి ఎలా పరిచయం జరిగిందనే విషయాన్ని ఇక్కడ చెప్పలేదు. ప్రేక్షకులకు ఆ విషయాన్ని దర్శకుడు వదిలేశాడు. మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులకు శ్రీను వంటివారితో పరిచయాలు మామూలే. ఇది పాఠకులకు కూడా సినమాలో పాలు పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

    అదే సమయంలో మహిళా నక్సలైట్ అక్కడికి వస్తుంది. ప్రజా సంఘాల నాయకుడితో ఉన్న మరో వ్యక్తి పోలీసు అనే విషయం ఆ మహిళా నక్సలైట్ గుర్తు పట్టి, ఎలా గుర్తు పట్టిందో ప్రేక్షకుడికి సూచన చేసి దర్శకుడు వదిలేశాడు. అక్కడ డైలాగ్స్ పెట్టి, మరిన్ని దృశ్యాలు పెట్టి పొడగించలేదు. ఆ క్లుప్తతను దర్శకుడు పాటించాడు.

    ప్రజా సంఘాల నాయకుడితో ఓ పోలీసాఫీసర్ ఎందుకు ఉన్నాడనే విషయాన్ని కూడా దర్శకుడు చెప్పలేదు. అలా చెప్పకుండా సస్పెన్షన్‌ను పాటించాడా, తర్వాతి సీన్‌ను పండించడానికి దాన్ని వాడుకున్నాడా అనేది చూస్తే.... తర్వాతి సీన్ పండించడానికి మాత్రమే కాకుండా తాను నమ్మిన జీవిత సిద్ధాంతాన్ని చెప్పడానికి దాన్ని వాడుకున్నాడు. ఆ విషయాన్ని మనం నక్సలైట్ లీడర్‌తో ఆ ప్రజా సంఘాల నాయకుడు జరిపే చర్చ సందర్బంలో తెలుస్తుంది. అటు నక్సలైట్ లీడర్‌ను గానీ ఇటు ప్రజా సంఘాల నాయకుడిని గానీ సామాజిక వ్యతిరేక శక్తులుగా చూపకుండా వాస్తవ పరిస్థితిని అద్దం పట్టి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు.

    మహిళా నక్సలైట్ పోలీసుపైకి కాల్పులు జరుపుతుంది. అది గమనించి పోలీసు తప్పించుకుంటాడు. ప్రజా సంఘాల నాయకుడిని, శ్రీను, అభిరామ్‌లను నక్సలైట్లు పట్టుకుని పోతారు. వారిని కట్టేస్తారు. ఆ సమయంలో శ్రీనులో ఒక విధమైన ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందం ఎందుకు కనిపించిందనే విషయంపై ప్రేక్షకులు తప్పకుండా ఆలోచిస్తారు. అయితే, అందులో తనకు తెలిసినవాడు ఎవరో ఒకతను ఉన్నాడు, తాము బయటపడుతామని శ్రీను అనుకుంటున్నట్లు అర్తం చేసుకుంటారు. కానీ అదేం కాదు, తమ కోసం పోరాడుతున్న వీరుల పట్ల శ్రీనులో కనిపించిన ఆరాధనా భావం కావచ్చు.

    ప్రజా సంఘాల నాయకుడిని ద్రోహిగా నిర్ణయించి, శిక్ష విధించే సమయంలో అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముడుతారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతాయి. అయితే, నక్సలైట్లు అక్కడున్నారనే విషయం పోలీసులు ఎలా తెలిసిందనే సందేహం తప్పకుండా కలుగుతుంది. అయితే, మహిళా నక్సలైట్ కాల్పుల నుంచి తప్పించుకుని పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సలైట్లు ఉన్నారనే విషయాన్ని చేరదీసి ఉండవచ్చు. ఇదంతా ప్రేక్షకులు అలోచించికుని, నెమరేసుకుని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది.

    ఈ సంఘటన పరంపర ఓ యాధృచ్ఛిక సంఘటన నుంచి ప్రారంభమై ఒక ముగింపు దిశగా పయనించే క్రమంలో దర్శకుడు పాటించిన క్లుప్తత, పాఠకులకు కల్పించిన భాగస్వామ్యం ఆస్వాదయోగ్యంగా చేసింది. శ్రీను అభిరామ్‌తో కలిసి టీ కొట్టు దగ్గర ఆగినప్పుడు అక్కడికి ప్రజా సంఘాల నాయకుడు పోలీసుతో కలిసి రావడం, అప్పుడే మహిళా నక్సలైట్ రావడం యాధృచ్ఛికత. అయితే వారు మూడు పక్షాలకు చెందినవారు. ఆ మూడు పక్షాలు కలిసే యాదృచ్ఛికత సమాజంలో తప్పదు. అయితే, ఎవరి గమ్యాల కోసం వారు పయనిస్తున్న సమయంలోని యాదృచ్ఛిక కలయిక అది.

    గమ్యం సినిమాను ఆస్వాదయోగ్యం చేసి ఉత్తమ చిత్రంగా తీర్చిద్దడానికి దర్శకుడు పాటించిన క్లుప్తత, కళాత్మకతతో పాటు కార్యకారణ సంబంధాలు అందరికీ ఆమోదయోగ్యమైనవి.

    రికార్డింగ్ డ్యాన్స్ సంఘటనకు తర్వాతి లింకేమిటి... మరోసారి చూద్దాం..

    - కాసుల ప్రతాపరెడ్డి

    English summary
    Gamyam revisited: A scene that explains
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X