twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలపోటు జెమిని

    By Staff
    |

    Gemini
    -జలపతి
    చిత్రం: జమిని
    నటీనటులు: వెంకటేష్‌, భైరవి, కళాభవన్‌ మణి,
    పోసాని కృష్ణమురళి, మురళి, సుజాత
    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
    మాటలు: పోసాని
    నిర్మాతలు: ఎం.శరణవణన్‌, యం.బాలసుబ్రమణియణ్‌, ఎం.ఎస్‌.గుహన్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శరణ్‌

    వాసు చిత్రంలో వెంకటేష్‌ గెటప్‌, ఆ చిత్రం చూశాక చాలామంది ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చే చిత్రం జెమినిలో వెంకటేష్‌ జాగ్రత్తలు తీసుకుంటాడని భావించడం చాలా సహజం. కానీ ఏ మాత్రం మారలేదని రుజువుచేశాడు. గెటప్‌ లో మార్పు ఉన్నా, ఈ సినిమా చూస్తూ ఉంటే...ఏడెనిమిదేళ్ళ క్రితం వచ్చిన మాస్‌ చిత్రాల మాదిరిగా అన్పిస్తుంది తప్ప కొత్త తరహాలో ఎక్కడా లేదు. తమిళ చిత్రం జెమిని ఆధారంగా తీశారు ఈ చిత్రాన్ని. అందులో విక్రమ్‌ హీరోగా నటించాడు. విక్రమ్‌ లో ఉన్న మాస్‌ అప్పీలు వెంకటేష్‌ లో లేకపోవడం తెలుగులో ఆకట్టుకోలేకపోవడానికి ఓ కారణమైతే, ప్రధాన కారణం కథలో, కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడమే.

    ఇలాంటి రౌడీ పరివర్తన చెందే చిత్రాలు చాలానే చూశాం. హీరో రౌడీ. హీరోయిన్‌ ను చూసి ప్రేమలో పడి ఆమె కోసం మంచివాడు అవుతాడు. ఈ పాయింట్‌ ఎన్ని చిత్రాల్లో చూడలేదు. కాకపోతే, జెమిని చిత్రంలో ఓ కమీషనర్‌ పాత్రను అదనంగా జోడించి..'పోలీసులు- క్రిమినల్స్‌- పరివర్తన' అనే కోణాన్ని కలిపారు. గతంలో అద్భుతం వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు శరణ్‌ ఇంత సాధారణ చిత్రాన్ని రూపొందించడం ఆశ్చర్యమే.

    సినిమా ప్రారంభం నుంచే అరుపులు..గోల..ఛీఫ్‌ కామెడీ..అంతా పాతే. ఎక్కడా కొత్త అనే సీన్‌ లేని చిత్రం ఇది. మలయాళం నటుడు కళాభవన్‌ మణి ఈ చిత్రంలో విలన్‌ గా నటించాడు. ఒరిజినల్‌ చిత్రంలో ఆయన చేసిన చిత్రవిచిత్ర జంతువుల అనుకరుణలకు మంచి పేరు వచ్చింది. కానీ ఈ చిత్రంలో ఆయన నటన కోతి చేష్టలులాగా అనిపిస్తుంది.

    కథ విషయానికొస్తే..జెమిని(వెంకటేష్‌), లడ్డా(కళాభవన్‌ మణి) ఇద్దరూ విజయవాడలో పేరుమోసిన రౌడీలు. జెమిని ఒకసారి ఓ మార్వాడీ అమ్మాయి(భైరవి)ని చూసి ప్రేమలో పడుతాడు. ఆమె చదువుతున్న నైట్‌ కాలేజ్‌ లోనే తను కూడా బి.ఎ.లో చేరుతాడు. రౌడీ అని తెలియని భైరవి జెమినిని ప్రేమిస్తుంది. విజయవాడకు కొత్తగా వచ్చిన కమిషనర్‌(మురళి) జెమిని, లడ్డాలను అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తాడు. రౌడీ అని తెలిసాక, భైరవి జెమినికి దూరం అవుతుంది. అయితే, భైరవి కోసం జెమిని మంచివాడుగా మారుతాడు. మారుతానని కమీషనర్‌ కు ప్రామిస్‌ చేసి విడుదల అవుతాడు. కానీ లడ్డా జెమినిని మారనివ్వకుండా అడ్డుపడుతుంటాడు. చివరికి జెమిని లడ్డాను ఎలా తప్పించుకొని భైరవిని పెళ్ళి చేసుకుంటాడనేది క్లైమాక్స్‌.

    నటుడిగా వెంకటేష్‌ ఫర్వాలేదు. పెద్ద గొప్పగా చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ లేదు. హీరోయిన్‌ భైరవి అందంగా ఉంది. కమీషనర్‌ గా నటించిన ఈ ఏడాది జాతీయ అవార్డు గ్రహీత మురళి నటన ఫర్వాలేదు. సుజాత పాత్ర క్లైమాక్స్‌ లో పేలిపోతుంది. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఓ పోటు..వెయ్యిపోటు అనే టైటిల్‌ సాంగ్‌ హుషారుగా ఉంది.

    కానీ దర్శకుడు శరణ్‌, వెంకటేష్‌ లు వెయ్యిపోటు..అందరికీ వెయ్యి తలపోటు అని అనుకొని ఇలాంటి చిత్రాన్ని అందించారు. పరవశం చిత్రంలో తన ఫోటోగ్రఫీతో అందర్నీ ఆకట్టుకొన్న వెంకటేష్‌ కు పెద్దగా పని దొరకలేదు ఈ చిత్రంలో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X