Godari Gattupaina Review: గోదారి గట్టుపైన మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు
దర్శకత్వం: సుభాష్ చంద్ర
నిర్మాత: అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధూళిక సంచన లంక
సినిమాటోగ్రఫి: సాయి సంతోష్
ఎడిటర్: అనిల్ కుమార్ పీ
మ్యూజిక్: నాగ వంశీకృష్ణ
సౌండ్ ఇంజినీర్: నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్: ప్రయల్య డీ
రిలీజ్ డేట్: 2026-05-08
గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఆటో డ్రైవర్ వృత్తిని కొనసాగిస్తూ యువకుడు రాజు (ప్రభాస్ సుమంత్) స్నేహితులు (సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్)తో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంజినీరింగ్ చదువుతున్న మాయ (నిధి ప్రతాప్) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. చివరకు రాజు ప్రేమను మాయ అంగీకరిస్తుంది. అయితే మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి.దాంతో వారి ప్రేమ సందిగ్దంలో పడుతుంది.

రాజు ఆటో డ్రైవర్ వృత్తిని ఎందుకు ఎంచుకొన్నాడు? మాయ ప్రేమను పొందడానికి రాజు చేసిన ప్రయత్నాలు ఏంటి? ప్రేమ వివాహం గురించి మాయ కుటుంబానికి ఉన్న అభిప్రాయం ఏమిటి? ప్రేమలో ఉండగానే రాజుకు మాయ దూరంగా ఉండాలని మాయ ఎందుకు నిర్ణయం తీసుకొన్నది? రాజు, మాయ ప్రేమపై శ్యాంబాబుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటి? మాయతో ప్రేమను గెలుచుకోవడానికి శ్యాంబాబుతో రాజు చేసిన ప్రయత్నాలు ఏమిటి? రాజును అల్లుడిగా చేసుకోవడానికి శ్యాంబాబు ఒప్పుకొన్నాడా? ఈ ప్రేమ వ్యవహారంలో రాజు, మాయ ఫ్యామిలీ మధ్య జరిగిన డ్రామా ఏంటి? చివరకు రాజు, మాయ ప్రేమ పెళ్లిగా మారిందా? అనే ప్రశ్నలకు సమాధానమే గోదారి గట్టుపైన సినిమా కథ.
గోదారి గట్టుపైన సినిమా విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ అంశంతో ఎమోషనల్‌గా కథను సుభాష్ చంద్ర ప్రారంభించారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలోకి వెళ్లిన కొద్ది పక్కా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌ను అనుసరించారనే విషయం కామెడీ ట్రాక్ చెప్పకనే చెబుతుంది. సుదర్శన్, కసిరెడ్డి, రాఘవతో కలిసిన కామెడీ ట్రాక్ పేలవంగా సాగుతూ.. నాసిరకమైన హాస్యంతో ముందుకు సాగుతుంది. అయితే రాజు, మాయ ప్రేమ కథ మొదలైనప్పటి నుంచి రిపీట్ సీన్లతో విసుగుపుట్టించేలా చేశారు. కథలో కదలిక ఏదైనా ఉంటుందో.. లవ్ స్టోరీలో ఏదైనా ట్విస్టు ఉంటుందో అని ఎదురు చూసిన వారికి ఫస్టాఫ్‌లో నిరాశే కలుగుతుంది. బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు, ఆడియెన్స్‌కు జోష్ పుట్టించే అంశాలు లేకపోవడంతో మూసగా సాగే సినిమాగా అనిపిస్తుంది.
సెకండాఫ్‌లోనైనా ప్రేమ కథలో ఏదైనా బలమైన సమస్యను జొప్పించి ప్రేక్షకుడిని సినిమాకు కనెక్ట్ చేస్తారేమో అని ఎదురు చూసిన వారికి మళ్లీ అదే నిరాశే మిగిలింది. ఈ లవ్ స్టోరీని సాగదీసి సాగదీసి.. చివరి 20 నిమిషాల్లో ఫ్యామిలీ డ్రామాను హడావిడిగా కొనసాగించారు. ఆ డ్రామాలో కూడా పసలేకపోవడంతో రొటీన్, రెగ్యులర్ సినిమాగానే మిగిలిపోయింది. విభిన్నమైన ప్రేమ కథను ఆశించిన వారికి అసంతృప్తినే ఈ సినిమా మిగులుస్తుంది.
యువ హీరోల్లో సుమంత్ ప్రభాస్ టాలెంటెడ్ యాక్టర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ తన టాలెంట్‌ను ఎలివేట్ చేసే కథలను, పాత్రలను ఎంచుకోకపోవడమే లోపంగా, మైనస్‌గా మారిందనే విషయం ఈ సినిమా ద్వారా స్పష్టమైంది. సుమంత్ ప్రభాస్ తన ప్రతిభను నిరూపించుకొని సినిమాను హిట్ చేసే అంశాలు కథలో లేకపోవడంతో తను ఏమీ చేయలేకపోయాడు. కొన్ని సీన్లలో రాజు క్యారెక్టర్‌ను బాగా పడించాడు. కమర్షియల్ అంశాలు లేకపోవడం వల్ల హీరోగా రావాల్సిన ఎలివేషన్ మిస్ అయిందనిపిస్తుంది. నిధి ప్రతాప్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. యాక్టర్‌గా జగపతి బాబు స్టేచర్‌కు తగిన పాత్ర లభించలేదనిపిస్తుంది. రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయారనే చెప్పాలి. ఈ సినిమాకు సుదర్శన్ ద్వారా నడిపించిన కామెడీ ట్రాక్ ఎక్కడా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. సీనియర్ హీరోయిన్ లైలాను వేస్ట్ చేసేశారు.
కథ, కథనాల్లో పస లేకపోవడం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సిట్యుయేషనల్‌గా పాటలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఎలివేట్ కాలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో లొల్లి తప్పా.. సన్నివేశాలకు తగినట్టుగా మ్యూజిక్ కనిపించదు. ఎడిటింగ్ పరంగా ఈ సినిమా నిడివి మైనస్. కథలో బలం లేనప్పుడు సినిమా రన్‌టైమ్ తగ్గిస్తే ఫీల్ ఏదైనా పెరిగేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అభినవ్ రావు, మధూళిక సంచన లంక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేదనిపిస్తుంది.


Click it and Unblock the Notifications