twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహసం' మే... (రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    యేలేటి చంద్ర శేఖర్ సినిమాలకు ఓ వర్గం ప్రేక్షకులు ఉన్నారు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం అంటూ ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినంతకాలం హిట్,ప్లాపులకు సంబంధం లేకుండా ఆదరిస్తూ వస్తున్నారు. కానీ మిగతా దర్శకుల దారిలోకి వెళ్లి కమర్షియల్ సినిమాలు చెయ్యాలని ఒక్కడున్నాడు తో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 'సాహసం'తో ఎడ్వంచర్ జనర్ ట్రై చేసినా ఫలితం కనపడేటట్లు లేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో పెద్దగా థ్రిల్స్ లేకపోవటం...క్లైమాక్స్ లో హీరో..తను కష్టపడి కనిపెట్టిన నిథిని పాకిస్ధాన్ కి ఇవ్వటం వంటివి (క్యారెక్టర్ పరంగా ఓకే కానీ)...ఇబ్బందిగా మారాయి. దానికి తోడు హీరో,హీరోయిన్స్ మధ్య రొమాన్స్ లేకపోవటం, ఎంటర్ట్నైమెంట్ మిస్సవటం కూడా మైనస్ లుగా మారాయి . అయితే తెలుగులో ఎప్పుడో కానీ రానీ ఈ తరహా చిత్రం ట్రై చేసినందుకు దర్శకుడుని అభినందించాలి.

    గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు పాకిస్ధాన్ లో ఉన్న ఓ పురాతన దేవాలయం( హింగ్లాజ్ దేవి) సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిథి కోసం..అప్పటికే... పాకిస్దాన్ లో ఓ గ్రూప్ (శక్తి కపూర్) తీవ్రంగా ప్రయత్నిస్తూంటుంది. ఆ దేవాలయం దగ్గరకు వెళ్లిన గౌతమ్.. ఆ నిధిని ఎలా బయిటపెట్టాడు...విలన్స్ నుంచి ఎలా ఆ నిధిని రక్షించాడు.. అతనికి శ్రీనిధి (తాప్సి) ఎలా పరిచయం అయ్యింది...ఆమెతో ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగతా కథ.

    క్లాసిక్ నేరేషన్ లో సాగిన ఈ కథలో... ఎత్తుగడ బాగానే ఉన్నా... మెల్లిమెల్లిగా గ్రిప్ తప్పిపోవటం మొదలైంది. ముఖ్యంగా సెకండాఫ్ లో విలన్ వైపు నుంచి కథనం నడిపటంతో హీరో క్యారెక్టర్ ప్యాసివ్ గా మారిపోయింది. గోపీచంద్ లాంటి యాక్షన్ హీరో ఉన్నప్పుడు అతన్ని నుంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అంతేకానీ విలన్ చెప్పినట్లు హీరో నడుస్తూంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇక పేలుతాయనుకున్న థ్రిల్స్ యావరేజ్ గా ఉండిపోయాయి. కర్రల వంతెన మీద చేసిన సీన్ చూడ్డానికి బాగానే ఉన్నా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. హీరోయిన్ పాత్ర కూడా కేవలం సెట్ ప్రాపర్టీగా మిగిలిపోయింది. తప్ప... కథలో కలవలేదు. దాంతో ఆమె వైపు నుంచి పండవలిసిన రొమాన్స్ రాలేదు. కథకు అడ్డం వస్తుందని కామెడీ బ్లాక్స్ పెట్టలేదు. దాంతో కథలో రిలీఫ్ లేకుండా పోయింది. సంగీతం కూడా సోసో గా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. అయితే ఇన్ని మైనస్ లు ఉన్నా దర్శకుడు కథని ప్రక్కకు వెళ్లకుండా నడిపిన నేరేషన్ మాత్రం బోర్ కొట్టకుండా మనని చివరి వరకూ కూర్చోపెడుతుంది.

    మిగతా రివ్యూ ...స్లైడ్ షో లో...

    గ్లామర్,కామెడీ మైనస్

    ఈ అడ్వంచర్ డ్రామ్ కు కామెడీ,గ్లామర్ మిస్ కలిపితే మరింత నిండుతనం వచ్చేది. అలా చేయకపోవటంతో మల్టిప్లెక్స్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయ్యింది. అయితే మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఇప్పటికే ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో చాలా చూసి ఉంటారు. వారి రేంజికి ఈ సినిమా ఎంతవరకూ ఎక్కుతుంది అనేది చూడాలి.

    గోపీచంద్ నటన...

    సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గోపిచంద్ ఫెరఫార్మెన్స్. గోపీచంద్ గత చిత్రాల కన్నా చాలా ఉన్నతమైన నటన కనపరిచాడు. అందుకు దర్శకుడుని ప్రత్యేకంగా అభినందించాలి. సెక్యూరిటీ గార్డ్ గా...తన కుటుంబ ఆస్థి కోసం పోరాడే సామాన్యుడుగా, ట్రెజర్ హంట్ సమయంలో ఓ సాహసికుడుగా అతని నటన బాగా ఎక్సప్లోర్ అయ్యింది.

    తాప్సీ పాత్ర

    సినిమాలో శ్రీనిధిగా తాప్సీ తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ కనిపించింది. చాలా సింపుల్ గా ..దేముడ్ని విపరీతంగా నమ్ముతూండే ఆమె త్వరలోనే యుంగాంతం వస్తుందని నమ్మే అమాయకురాలు. ఆ పాత్రని సినిమాకు రొమాంటిక్ యాంగిల్ కి దర్శకుడు వాడుకోకపోవటంతో ఇబ్బందిగా మారింది. గోపీచంద్ పాత్రకు కేవలం అడ్డు వచ్చే అమ్మాయిగా మిగిలింది. తాప్సీ కి ఈ సినిమా కూడా పెద్దగా బ్రేక్ ఇవ్వనట్లే...

    విలనిజం అదుర్స్...

    టెర్రరిస్టుగా క్రూరమైన పాత్రలో శక్తి కపూర్ చాలా అద్బుతంగా నటించాడు. తెలుగులో మొదటి సినిమా అయినా ఈ వయస్సులో ఆయన తన దైన శైలి నటనతో అదరకొట్టాడు. అయితే హీరోకి,విలన్ కు మధ్య సరైన డ్రామా చెయ్యకపోవటం ఇబ్బందిగా మారింది. సినిమాలో ఆయన పాత్రగా విడిగా బాగుంది. ఈ పాత్ర స్పూర్తిగా ఆయనకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో...

    టెక్నికల్ గా ...

    టెక్నికల్ గా సినిమా గత యేలేటి చిత్రాలు లాగానే చాలా సౌండ్ గా ఉంది. ముఖ్యంగా సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, లడఖ్ ని చాలా బాగా చూపించారు. శ్యాం దత్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలైట్. పాకిస్థానీ వాతావరణాన్ని క్రియేట్ చేసి చూపించడంలో యేలేటి సక్సెస్ అయ్యారు. నిధిని చేరుకోవడానికి లభించే ఆధారాలు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడుని థ్రిల్ చేస్తాయి. నేషనల్ ట్రెషర్ హంట్, టాంబ్ రైడర్, ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు గుర్తు చేసినా సినిమా ఎంజాయ్ చేసేలా ఉంది.

    యాక్షన్...యాక్షన్

    ఇలాంటి ట్రెజర్ హంట్ సినిమాలకు యాక్షన్ సీన్స్ ప్రాణం. ఆ యాక్షన్ సీన్స్ ని సెల్వా చాలా బ్రిలియెంట్ గా పండించారు. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు ఆ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో యాక్షన్ సన్నివేసాలు చాలా కన్విన్సిబుల్ గా ఉన్నాయి. రివాల్వర్ తో పేల్చుకునే సీన్స్ కూడా కన్ఫూజ్ కాకుండా చాలా బాగా చేసారు.

    స్పెషల్ ఎఫెక్ట్స్

    సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో దర్శకుడు మాయ చేసారు. ఆ సీన్స్ సినిమాకు ప్రాణం గా నిలిచాయి. ముఖ్యంగా పాకిస్ధాని ఏంబియన్స్ క్రియేట్ చేయటంలో ఆర్ట్ డైరక్టర్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రత్యేకంగా పే చేసాయి.

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

    చాలా కాలం తర్వాత శ్రీ అందించిన సంగీతం ఇంప్రెసివ్ గా లేకపోయినప్పటికీ ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అద్బుతంగా చేసారు. ఈ సినిమాకు ఉన్న స్ట్రెంత్ లలో అది ఒకటి. అలాగే ఎడిటింగ్ కూడా చాలా కమెండ్ గా షార్ప్ గా చేయటంతో ఎక్కడా బోర్ ఫీల్ రాలేదు.

    రొమాన్స్


    గోపీచంద్, తాప్సీ ల మధ్య రొమాన్స్ ట్రాక్ అసలు లేదు. కొత్త ఆర్టిస్టులకైతే ఫర్వాలేదు కానీ ఇలా పాపులర్ ఆర్టిస్టులను పెట్టుకుని వారితో రొమాన్స్ చేయించకపోవటంతో ఆ వెలితి బాగా కనిపించింది. అలాగే తాప్సీ పాత్రపై మరింత శ్రధ్ధ తీసుకుని ఉంటే బాగుండేది.

    నటీనటులు-సాంకేతిక వర్గం

    సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
    నటీనటులు: గోపీచంద్‌, తాప్సి, శక్తికపూర్‌, అలీ తదితరులు.
    సంగీతం: శ్రీ
    మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్,
    కెమెరా: శ్యామ్‌దత్ ఎస్.,
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
    కళ: ఎస్.రామకృష్ణ,
    పాటలు: అనంత శ్రీరామ్,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్,
    సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు,
    సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్.
    నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
    దర్శకత్వం: చంద్రశేఖర్‌ యేలేటి
    విడుదల: 12,జూలై 2013 (శుక్రవారం).

    నేషనల్ ట్రెజర్, మెకన్నాస్ గోల్డ్ వంటి ఎడ్వెంచర్ చిత్రాలను ఈ సినిమా గుర్తు చేసినా తెలుగులో వచ్చిన ఇండియా జోన్స్ అనుకుని సరదాగా ఓ లుక్ వేయవచ్చు. అలాగే రెగ్యులర్ తెలుగు కమర్షియల్ తరహాలో ఐటం సాంగ్, హీరో,హీరోయిన్ మధ్య రొమాన్స్, కామెడీ ఆశిస్తే మాత్రం పూర్తిగా నిరాశపడతారు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Sahasam is an unique entertainer in Telugu, which is a right blend of brilliant performances and rich production values. The movie will impress all classes of audiences except glamour and comedy lovers. Watch the movie for its technical brilliance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X