For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎంతో ప్రేమ: కొంత రౌడీయిజం

  By Staff
  |

  Gouri
  - జోశ్యుల సూర్యప్రకాష్‌
  చిత్రం: గౌరి
  నటీనటులు: సుమంత్‌, చార్మి, నరేష్‌, కౌసల్య,
  తనికెళ్ల భరణి, అతుల్‌ కులకర్ణి, రఘుబాబు, తదితరులు
  సంగీతం: కోటి
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.రమణ

  సుమంత్‌ 'సత్యం' చిత్రం ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా 'మాస్‌'ను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం 'గౌరి'. మరో రీమేక్‌ (తమిళ 'తిరుమలై') మరో ఫ్లాప్‌ అనిపించుకోకుండా తప్పించుకుంది. ప్రభాస్‌ ' ఈశ్వర్‌'లా ఈ కుర్రాడిదీ ధూల్‌పేటే. గౌరి అనబడే బైక్‌ మెకానిక్‌ తన జోలికి వస్తే గాని ఇతర వ్యవహారాలకు వెళ్లడు. ఇంకో అదృష్టం ఏమిటంటే గౌరి కి ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ లేదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన అమ్మాయి శ్వేతతో ప్రేమలో పడతాడు. పడిందే తడవుగా ఆమె వెనకపడతాడు. యోగా క్లాసుకి వెళ్లి అక్కడ క్లాసును డిస్టర్బ్‌ చేసి తన మనసు డిస్టర్బ్‌ అయిన విధానం చెబుతాడు. పొమ్మంటే రాత్రి ' ఇడియట్‌'లా ఆమె ఇంటికే వెళతాడు. ఆమె తండ్రికి కనపడతాడు. ఆమె చదివే ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ వెళ్లి లవ్‌ లెటర్‌ ఇచ్చి అవమానపడతాడు. అదే సమయంలో ఆమె వచ్చి ' ఐ లవ్‌ యూ' అనే చెబితే తప్ప ఆమెకు కనపడనని ఆమెపై ఒట్టు వేస్తాడు.

  ఇలా సిన్సియర్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్న గౌరి తన స్నేహితుడు కృష్ణ ప్రేమించి ఇంటికి తెచ్చిన అమ్మాయిని వెనక్కి తీసికెళ్లి వాళ్ల పెళ్లి పెద్దల సమక్షంలో సెటప్‌ చేయడంతో శ్వేత ఇంత మంచివాడినా మిస్‌ చేసుకున్నది అని మథనపడి, ప్రేమలో పడి, గౌరి ఒడి చేరుతుంది. ఇంటర్వల్‌కే ప్రేమ కథ కొలిక్కి వచ్చేస్తే ఎలా? అలా ప్రేమలో పడినవాళ్లని ఓ కెమెరా బంధిస్తుంది. ఆ కెమెరా ఎవరిది? శ్వేత తండ్రి (వైజాగ్‌ ప్రసాద్‌) ఆఫీసులో పనిచేస్తున్న ఓ కెమెరా మన్‌ది. ఆయన అక్కడికి ఎందుకొచ్చాడయ్యా అంటే.. ఓ పోలీసు ఆఫీసరుని ఓ క్రిమినల్‌ చంపుతున్నాడని తెలిసి ఆ ఫొటో తీద్దామని వచ్చాడు. పొరపాటున గౌరీశ్వేతలు ఆ కెమెరాకు దొరికిపోయారు. ఆ రకంగా శ్వేత తండ్రికి దొరికిపోయారు. దాంతో ఆయన మళ్లీ ఇడియట్‌లా కిరాయి క్రిమినల్‌ను పిలిచి ఆ కేసెట్‌ ఇస్తా తన కూతురుని ప్రేమించిన గౌరిని చంపేయమంటాడు. ఇక ఆ తర్వాత ఆ క్రిమినల్‌ (అతుల్‌ కులకర్ణి)తో రన్‌ ప్రారంభమవుతుంది. ఎత్తుకు పైయెత్తులు చిత్తులతో కథ క్లైమాక్స్‌కు చేరి విలన్స్‌ ఇద్దరూ మారటంతో కథ సుఖాంతమవుతుంది.

  ఇంటర్వల్‌ వరకు కథ మూడు సెపరేట్‌ ట్రాక్‌లలో నడుస్తుంది. గౌరి ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఓ అనాథగా, ప్రాణమిత్రుడిలా, కొత్తగా ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చిన ఓ కుటుంబంలో సభ్యుడిగా కలవటం వంటివి. మరో వైపు వేణుమాధవ్‌, జ్యోతిల కామెడీ ట్రాక్‌, మరో వైపు సర్కార్‌ (అతుల్‌ కులకర్ణి) హత్యలు చేయడంలో కూడా నిజాయితీ ప్రదర్శించే క్రిమినల్‌ ట్రాక్‌.

  ఎవరి ట్రాక్‌ వాళ్లదే కావడంతో మనం కొద్దిగా అయోమయంలో పడతాం. అన్ని సినిమాల్లో లాగా హీరో అనాథగా, అతని ఫ్రెండ్స్‌ బేవార్స్‌గా తిరిగేవాళ్లుగా కనపడి కథను నడుపుతారు. హీరో ఫ్రెండ్స్‌కు వేరే పనేం ఉండదు. హీరో వెనక తిరిగి అతని పెళ్లికి సహాయపడడమే. అలాగే హీరో గౌరి ఒక్కసారి కూడా తన వృత్తి బైక్‌ల మెకానిక్‌ చేయడం కనపడదు. ఫ్రెండ్స్‌, ప్రియురాలు, విలన్‌ వున్న హీరోకు ఇల్లు ఉన్నట్లు కూడా కనిపించదు. చలపతిరావు, ఆహుతి ప్రసాద్‌ గెస్ట్‌లుగా ఎందుకు కనపడతారో, ఆ సీను ఎందుకో అర్థం కాదు. అలాగే పోలీసాఫీసరును చంపినప్పుడు తీసిన కేసెట్‌ ఏమైంది తెలియదు. గౌరి మెడలో చాలాసేపు బ్లేడు, కొంత సేపు మరొకటి వేలాడుతాయి. కంటిన్యుటీ ప్రాబ్లమ్‌ కావచ్చు.

  అలాగే నరేష్‌, సుమంత్‌ మాట్లాడుతుంటే ఆ సెట్‌ కర్టెన్‌ తీసి ఎవరో నడిచి వెళ్లిపోతుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం - విలన్స్‌ ఇద్దరూ హీరో మాటలతో మంచిగా మారిపోవటంతో ప్రేక్షకుల నోట రాదు. దీంట్లో కొన్ని సీనులు హీరో చైన్‌ తెంపటం, గల్లీల్లో పరుగులు, బెల్టుతో రాజకీయ నాయకుడిని చంపడం 'శివ' సినిమాను గుర్తు చేస్తే నరేష్‌ నటన చంద్రమోహన్‌ను తలపిస్తుంది. వరుస ఫ్లాపుల చార్మి ఈ సినిమాతో ఊపిరి పీల్చుకోవచ్చు.

  సినిమాకు అంత మాస్‌ ఓపెనింగ్‌ అవసరమా అనిపిస్తుంది. ప్రారంభంలోని బైక్‌ రైడింగ్‌ ఏ క్లైమాక్స్‌కో ఉపయోగపడుతుందనుకుంటే నిరాశే ఎదురవుతుంది. అలాగే కొత్త వచ్చిన నరేష్‌ను భార్యను ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లు చనువుగా పిలవటం, వాళ్లతో కలిసి పోవటం కలివిడితనం అంటారేమో! హీరో ఆ దంపతులతో చాలా కలుపుగోలుగా ఎన్నటి నుంచో పరిచయం ఉన్నవాడిలా కలిసిపోతే ఏదో ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందనుకుంటాం. కానీ అటువంటిదేమీ లేదు.

  మరుధూరి రాజా మాటలు అక్కడక్కడా పేలితే కోటి సంగీతం జోకొట్టింది. ఏది ఏమైనా ప్రేక్షకులు గౌరికి డై కొట్టవచ్చు. చివరగా ఒక్క మాట- ధూల్‌పేట ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మందికి తెలుసు. ఆ వాతావరణం కొంత చూపిస్తే బాగుండేది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X