Happy Raj Tamil Movie Review: హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ, జార్జ్ మార్యన్, అబ్బాస్, గీతా కైలాసం, మధురై మధు, దేవీ మహేష్ తదితరులు
దర్శకత్వం: మారియా రాజా ఎలాన్‌ఛెజియన్
నిర్మాత: జైవర్ధ
సహ నిర్మాత: జైకాంత్ సురేష్
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రాఫర్: మాధన్ క్రిస్టోఫర్
ఎడిటర్: సెల్వా ఆర్కే
బ్యానర్: బియాండ్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-03-27
గ్రామీణ ప్రాంత యువకుడైన ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ (జీవీ ప్రకాశ్) తండ్రి ముత్తు (జార్జ్ మారన్) కారణంగా బ్రేకప్ జరుగుతుంది. గ్రామస్థులంతా తన తండ్రిని గుర్రం గుడ్డు అంటూ అవహేళన చేయడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆ క్రమంలో తండ్రి గురించి చెప్పుకోవడానికి మొహమాట పడుతుంటాడు. ఈ క్రమంలో సంపన్న కుటుంబానికి చెందిన కావ్య (శ్రీ గౌరి ప్రియ) అనే సాఫ్ట్‌వేర్ సహా ఉద్యోగితో ప్రేమలో పడుతాడు. అయితే పెళ్లి చేసుకొందామని కావ్య ప్రపోజల్ పెట్టి.. రాజ్ తల్లిదండ్రులతో పరిచయం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా కావ్య తండ్రి రాజేశ్ (అబ్బాస్) ముత్తును అవమానిస్తాడు. దాంతో కావ్య, రాజ్ మధ్య అభిప్రాయబేధాలు వస్తాయి.
ఆనంద్ రాజ్ లైఫ్‌లో తండ్రికి జరిగే అవమానాలు ఏంటి? తన తండ్రిని గుర్రం గుడ్డు అని ఎందుకు పిలుస్తారు? తన తండ్రి అమాయకత్వం, ఫిజికల్ అప్పీయరెన్స్‌ను రాజ్ ఎలా చూశాడు? కావ్యతో ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? గ్రామం నుంచి వచ్చిన రాజ్‌ను నాగరికత పేరుతో కావ్య ఎలా మార్చాలనుకొన్నది? రాజ్ తండ్రిని కావ్య తండ్రి ఎందుకు అవమానించాడు? కావ్య, రాజ్ పెళ్లికి కల్చరల్ వ్యత్యాసాలు ఎలా అడ్డంకిగా మారాయి? తండ్రి మోసిన అవమాన భారాన్ని రాజ్ ఎలా తగ్గించాడు? రాజేష్, ముత్తు మధ్య డబ్బు, హోదాకు సంబంధించిన వ్యత్యాసాలు తగ్గాయా? అనే ప్రశ్నలకు సమాధానమే హ్యాపీ రాజ్ సినిమా కథ.

హ్యాపీ రాజ్ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. పూర్తిగా సెకండాఫ్ కోసం టైంపాస్ చేశారా? అనే కోణంలో కొనసాగుతుంది. లౌడ్ మ్యూజిక్, అర్ధంపర్థం లేని కామెడీ, మాస్, యూత్‌ను టార్గెట్ చేసే కంటెంట్‌తో ఏంటి? జీవీ ప్రకాశ్ ఇలాంటి సినిమా చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత రొటీన్, రెగ్యులర్ సినిమాను చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఏముంది? అనే ఫీలింగ్ కలుగుతుంది.
కానీ సెకండాఫ్ ఈ మూవీకి గేమ్ ఛేంజర్. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్స్ గుండెను పిండేసేలా దర్శకుడు మారియా రాజా తెరకెక్కించారు. సెకండాఫ్‌ను మొత్తం జార్జ్ మార్యన్ తన భుజాలపై మోశాడు. చివరి 30 నిమిషాల్లో ఆడియెన్‌ను భావోద్వేగానికి గురి చేసి కంటతడి పెట్టించేంతగా సెంటిమెంట్ సీన్లను దర్శకుడు మారియా రాజా రాసుకోవడంతో ఈ సినిమా పెద్ద అసెట్‌గా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమా ముగిసిన తర్వాత భారమైన హృదయంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. దర్శకుడు కథను చెప్పిన తీరు, అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలెట్. చివరి వరకు ఈ సినిమాను హైలీ ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా చెప్పిన విధానం బాగుంది.
హ్యాపీ రాజ్ సినిమా విషయానికి వస్తే.. జార్జ్ మార్యన్ యాక్టింగ్, ఫెర్పార్మెన్స్ వన్ మ్యాన్ షో. అబ్బాస్, జీవీ ప్రకాశ్ సపోర్టింగ్ క్యారెక్టర్లు అనేంతగా ఆయన నటించి కంటతడి పెట్టిస్తాడు. జీవీ ప్రకాశ్ మరోసారి మాస్ పాత్రలోనే కాకుండా ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయాడు. అబ్బాస్ రీ ఎంట్రీ బాగుంది. అహంకారపూరితమైన తండ్రి పాత్రలో బాగా నటించాడు. ఇక తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియ మరోసారి తన గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్ పరంగా ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. గత సినిమాల్లో కంటే గౌరిప్రియ మెచ్యురిటీతో కూడిన యాక్టర్‌గా కనిపించింది. ఈ సినిమాలోని మిగితా నటీనటులు తమ పాత్రల్లో గుర్తుండిపోయేలా నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పెద్దగా, గొప్పగా ఏమీ కనిపించవు. కంటెంట్, డైలాగ్స్ ఈ సినిమాకు బలంగా మారాయి. సినిమాటోగ్రఫి బాగుంది. గ్రామీణ ప్రాంత అందాలను తెరపైకి తీసుకొచ్చి ఆహ్లాదకరంగా మార్చారు. ఫస్టాఫ్‌లో జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ గందరగోళంగా, సౌండ్ పొల్యూషన్‌లా ఉంటుంది. సెకండాఫ్‌లో కంటెంట్, సెంటిమెంట్ సీన్లను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
హ్యాపీ రాజ్ సినిమా పేరుకు తగినట్టుగానే ఫస్టాఫ్ హ్యాపీగా, గోలగోలగా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం ఫాదర్, సన్ ఎమోషన్స్‌ను భారీగా దట్టించారు. తండ్రికొడుకుల బంధాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమకు, బంధాలకు డబ్బే ప్రధానం కాదు. అంతకు మించి మానవ సంబంధాలే అనే చిన్న మెసేజ్ ఇచ్చారు. ఈ వారం మంచి ఫ్యామిలీ సినిమా చూడాలనుకొంటే.. హ్యాపీ రాజ్‌ను ఎంచుకోండి. మంచి అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











