Hello Meera Review ఒకే ఒక క్యారెక్టర్‌తో ప్రయోగం.. హలో మీరా మూవీ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటి: గార్గేయి ఎల్లప్రగడ
దర్శకత్వం: శ్రీనివాసు కాకర్ల
నిర్మాతలు: డాక్టర్ లక్ష్మణ్ రావు దిక్కుల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
మ్యూజిక్: చిన్నా
సినిమాటోగ్రఫి: ప్రశాంత కొప్పినీడు
రిలీజ్ డేట్: 2023-04-21
హలో మీరా కథ : హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే మీరా (గార్గేయి ఎల్లా ప్రగడ) సొంత ఊరు విజయవాడలో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్న సమయంలో హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీరా మాజీ బాయ్‌ఫ్రెండ్ సుధీర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో సూసైడ్ నోట్‌లో మీరా పేరు ఉండటంతో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కాల్ చేస్తాడు? కేసు నమోదు చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని పోలీసులు ఆదేశిస్తారు. దాంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరుతుంది.
హలో మీరా కథలో ట్విస్టులు : విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరిన తర్వాత మీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మీరా బాయ్‌ఫ్రెండ్ సుధీర్ ఎందుకు సూసైడ్ ప్రయత్నం చేశారు? హైదరాబాద్ పోలీసులు పిలిచిన నేపథ్యంలో మీరా ఎలాంటి సంఘర్షణకు లోనైంది? మీరా తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పిందా? పెళ్లికి ముందు మీరాకు ఎదురైన పరిస్థితిపై తల్లిదండ్రులు ఎలా స్పందించారు? సూసైడ్ అటెంప్ట్ తర్వాత సుధీర్ పరిస్థితి ఏమిటి? చివరకు మీరా పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే హలో మీరా సినిమా కథ.

దర్శకుడి పనితీరు..: ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ బాపు వద్ద సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాసు కాకర్ల తన తొలి చిత్రంగా రూపొందించిన హల్లో మీరా సినిమా ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమా మొత్తాన్ని నడిపించి భారీ ప్రయోగం చేశారనే చెప్పాలి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాగే ప్రయాణంలో మీరాకు వచ్చిన కాల్స్.. వాటికి సమాధానం చెబుతూ సమస్యలను పరిష్కరించుకొనే మీరా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఒకే ఒక పాత్రతో ఎలాంటి బోర్ లేకుండా మంచి సంభాషణలు, ఎమోషనల్ ఎపిసోడ్స్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా తీర్చిదిద్దారు.
మీరా పాత్రలో గార్గేయి : గార్గేయి పాత్రకు స్టార్ హీరోయిన్‌ను పెట్టుకొని ఉంటే సినిమాకు బజ్, మైలేజ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. కానీ గార్గేయి నటనకు కొత్త అయినప్పటికీ.. మంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకోవడంలో శ్రీనివాసు నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అనుభవం ఉన్న నటిగా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారని చెప్పవచ్చు. మీరా పాత్రలో గార్గేయి ఒదిగిపోయింది. సినిమా భారాన్నంత తన భూజాలపై మోసి.. తన నటనతో ఆకట్టుకొన్నది.

తెర వెనుక నిపుణుల గురించి : సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కారులో సాగే ప్రయాణం, మీరా అనుభవించే ఎమోషనల్ జర్నీకి అనువైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను చిన్నా అందించారు. మీరా పాత్ర పలికించే భావోద్వేగాలను తన మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడు సినిమాటోగ్రఫి బాగున్నది. రోడ్ జర్నీలో మూడ్‌ను ప్రశాంత్ బాగా కాప్చర్ చేశారు. మిగితా సాంకేతిక నిపుణులు తమ పరిధి మేరకు రాణించారు. ఇక ప్రయోగాత్మక చిత్రాన్ని, సింగిల్ క్యారెక్టర్ స్టోరిని నమ్మిన నిర్మాతలను ప్రశంసించాలే. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రిచ్‌గా నిర్మాతలు ప్రజెంట్ చేశారు.

ఫైనల్‌గా ఎలా ఉందంటే? : పెళ్లికి ఒకట్రెండు రోజుల ముందు పోలీస్ కేసులో ఇరుక్కొంటే ఒక అమ్మాయి పరిస్థితి ఏమిటి? పెళ్లి కావాల్సిన సమయంలో కూతురు జీవితం తలకిందులైతే..తల్లిదండ్రులు పడే ఆవేదన, కాబోయే భర్త, అత్త వ్యవహరించే తీరు వల్ల అమ్మాయి పడే సంఘర్షణ నేపథ్యంగా రూపొందిన చిత్రం హలో మీరా. ఒకే ఒక పాత్రతో శ్రీనివాసు కాకర్ల రాసుకొన్న స్క్రిప్టు, సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. మీరాగా గార్గేయి బిహేవ్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది. ప్రయోగాత్మక చిత్రాలను, డిఫరెంట్ కంటెంట్‌తో ఉండే సినిమాలను ఇష్టపడే వారికి హలో మీరా నచ్చడమే కాకుండా మంచి మంచి అనుభూతిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











