Hey Sinamika Review : దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ నటించిన 'హే సినామిక' ఎలా ఉందంటే?
నటీనటులు: దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్,
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
దర్శకత్వం: బృందా మాస్టర్
'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ మలయాళ రీమేక్ సినిమా 'కనులు కనులు దోచాయంటే' సినిమాతో వచ్చి కరోనా ముందు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆయన తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక స్ట్రైట్ సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నటించిన తమిళ సినిమాను తెలుగులో హే సినామిక పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో అదితీరావ్ హైదరీ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించడమే కాక ఎన్నో అద్భుతమైన సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బృందా మాస్టర్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న నేపథ్యంలో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది అనేది సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
గాలి వాటాన్ని అంచనా వేసే ఉద్యోగంలో ఉన్న మౌన(అదితి రావు) సాఫ్ట్వేర్ ఉద్యోగులు బోర్ కొట్టి నెలకు ఒక జాబ్ మారుస్తూ ఉండే ఆర్యన్(దుల్కర్ సల్మాన్) మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. నేటి యువత లాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత తన భర్త ప్రవర్తన ఏమాత్రం నచ్చని మౌన అతడి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అనేక అబద్ధాలు చెప్పిన తర్వాత ప్రాజెక్టు పని మీద వేరే ఊరికి మారితే భర్త కూడా అక్కడికి వచ్చి చేరతాడు. తన పొరుగింట్లో ఉండే డాక్టర్ మలర్(కాజల్ అగర్వాల్) అనేకమంది మొగుడు పెళ్లాలను విడదీసిందని తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లి ఎలా అయినా తన భర్తను తనను విడదీయమని కోరుతుంది. అతని వైపు తప్పు లేకుండా తాను ఆ పని చేయలేను అంటే కనీసం ప్రేమలో పడేలా చేయమని అలా చేస్తే అది తప్పే కాబట్టి ఆ వంక చూపించి తను విడాకులు తీసుకుంటా అని చెబుతోంది.. ముందు తటపటాయించినా తర్వాత ఒప్పుకున్న మలర్ ఆర్యన్ ని ప్రేమ లో పడేసిందా? తర్వాత ఏం జరిగింది? ఆర్యన్ నుంచి విడాకులు కావాలని ఎదురుచూస్తున్న మౌన విడాకులు తీసుకున్నదా ? చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు ఏమయ్యాయి అనేదే ఈ సినిమా కథ.

సినిమాలో ట్విస్టులు
సినిమా ప్రారంభం నుంచి కూడా ఎలాంటి ట్విస్ట్ లు లేకుండానే సినిమా కథ సా......గుతూ ఉంటుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత భర్త నుంచి స్వేచ్ఛ కోరుకునే మహిళ పాత్రలో అదితి రావు హైదరి కనిపించింది. సినిమా మొదలు నుంచి చివరి వరకు ఏ మాత్రం ఆకట్టుకోకుండానే సాగింది. సినిమాలో టర్నింగ్ పాయింట్ అని చెప్పడానికి ఏమీ లేదు. భర్త నుంచి విడిపోవడం కోసం మౌన చేసే ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. అనేక సీన్లు ఇంకా సిల్లీగా ఉన్నాయి. కథలో మంచి సందేశం దాగి ఉంది. కానీ, దానిని చెప్పిన విధానం అస్సలు బాలేదు. ప్రీ క్లైమాక్స్ లో సినిమా కాస్త బాగుంటుంది. పర్లేదు అనుకునేలోపు సినిమా ముగుస్తుంది. మొత్తం మీద ఆది నుండి అంతం వరకు సినిమా ఎలాంటి ట్విస్టులు అలాగే ఆసక్తికర సన్నివేశాలు లేకుండా చప్పగా సాగింది. అన్నట్టు ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రం సహనానికి పరీక్ష పెడుతోంది.

దర్శకురాలి టేకింగ్ విషయానికి వస్తే
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బృందా మాస్టర్ అసలు ఈ కథతో దర్శకురాలిగా పరిచయం కావాలని ఎలా అనుకున్నారో అర్థం కాలేదు.. అసలు కథ అనేది ఉంటే కథనం మీద దృష్టి పెట్టి ఉండవచ్చు అని చెప్పవచ్చు. కానీ ఈ కథతో ఆమె ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నారో అనేదానిమీద కనీసం ఆమెకు అయినా అవగాహన ఉందో లేదో అర్థం కాలేదు. దర్శకురాలిగా మారుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద ఆమె మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించిన బృంద మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయ్యారు కానీ ఒక దర్శకురాలిగా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారు.

నటీనటుల విషయానికి వస్తే
దుల్కర్ సల్మాన్, అదితీరావ్ హైదరీ, కాజల్ అగర్వాల్ ఇలా ఎవరికి వారు తమ పరిధిమేర నటించారు. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఎక్కువగా అదితి రావు హైదరి అందరినీ డామినేట్ చేసింది. మిగతా చాలామంది నటీనటులు కనిపింఛారు కానీ అందరూ తమిళ వారే కాబట్టి ఎవరూ గుర్తుండరు. ఇక ఎప్పటిలాగే అదితి రావు హైదరి అందంగా కనిపించింది. కాజల్ సినిమా ఆద్యాంతం పద్దతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

టెక్నికల్ విషయానికి వస్తే
గోవింద్ వసంత సంగీతం డీసెంట్‌గా ఉంది, రెండు పాటలు ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. అలాగే డైలాగ్స్, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే కుదిరాయి. ఎడిటింగ్ మీద ద్రుష్టి పెట్టాల్సింది. చాలా మేర అనవసర సీన్లు కనిపించాయి. ఇక తెలుగు డబ్బింగ్ విషయంలో కొన్ని లాజిక్స్ మిస్ అవకుండా ఉండాల్సింది.
Recommended Video

ఫైనల్ గా:
హే సినామిక - పాసబుల్ లవ్ స్టోరీ.. టైం పాస్ కోసం ఒకసారి చూడచ్చు.. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చచ్చు.


Click it and Unblock the Notifications











