Hi Nanna Review హృదయాన్ని కదిలించే చైల్డ్ సెంటిమెంట్.. హాయ్ నాన్న మూవీ రివ్యూ
Rating: 3.25/5
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ విరాజ్ (నాని)కి కూతురు మహి (కియారా ఖన్నా) అంటే పంచ ప్రాణాలు. అరుదైన వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న కూతురు కోసం ప్రాణాలను పణంగా పెడుతాడు. అయితే తన కూతురుకు కథలు చెబుతూ ఊరట కలిగిస్తుంటాడు. ఈ క్రమంలో తాను చెప్పే కథల్లో అమ్మ లేదని, తనకు అమ్మ కథ చెప్పాలని పట్టుపట్టడమే కాకుండా అలక చెందుతుంది. దాంతో తన అమ్మ కథను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో అలిగిన మహి రోడ్డుపై పరుగులు పెడుతుంటే.. యష్ణ (మృణాల్ థాకూర్) కాపాడుతుంది.
నాని భార్య బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్లింది? మహి ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నది? కొద్ది సంవత్సరాలే మహి బతుకుతుందని చెప్పిన సమయంలో జీవితంలో విరాజ్ ఎలాంటి చాలెంజ్‌ను స్వీకరించాడు? విరాజ్, మహి జీవితంలోకి వచ్చిన యష్ణ ఎవరు? వారం రోజుల్లో పెళ్లి కుదిరిన యష్ణ.. విరాజ్ ఫ్యామిలీకి ఎలా దగ్గరైంది. డాక్టర్ అరవింద్ (అంగద్ బేడీ)తో పెళ్లిని కాదనుకొని మహి కోసం యష్ణ ఎందుకు తాపత్రయ పడింది? అరుదైన వ్యాధిని మహి జయించిందా? మహికి తల్లి కావాలనుకొన్న యష్ణ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే హాయ్ నాన్న సినిమా కథ.

విరాజ్, మహి బాండింగ్‌ను, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే అంశం కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. హోమ్లీ, ఫన్ వాతావరణంతో ఎక్కువ కాలయాపన చేయకుండా దర్శకుడు శౌర్యువ్ నేరుగా కథలోకి తీసుకెళ్లడంతో ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథలో వేగం లేకపోవడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు నడిపించిన డ్రామా, ఎమోషన్స్ వర్కవుట్ కావడంతో ఫస్టాఫ్ కొత్త అనుభూతిని పంచడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది.
తండ్రి, కూతుళ్ల మధ్య కథ కావడం, స్టోరీలో వేరియెషన్స్, ట్విస్టుల కారణంగా దర్శకుడు ఎక్కువగా డిటైల్‌గా చెప్పడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ కారణంగా ప్రతీ సీన్ ఉద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు గుండెను పిండేసే నాటకీయత భావోద్వేగానికి గురిచేస్తుంది. చివర్లలో జయరామ్ క్యారెక్టర్ ట్వీస్టు, అలాగే అంగద్ బేడీ ఎపిసోడ్ సినిమాను మరింత గంభీరంగా, ఎమోషనల్‌గా మారుస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంటాయి.

విరాజ్‌గా నాని మరోసారి అద్బుతమైన పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రిగా, ప్రియుడిగా, భర్తగా, ఓ ప్రొఫెషనల్‌గా పలు రకాల వేరియేషన్స్‌ను పండించిన విధానం అదుర్స్ అనే చెప్పాలి. బరువైన, భావోద్వేగమైన సీన్లలో నాని పలికించిన హావభావాలు ఉద్వేగానికి గురిచేస్తాయి. ఇక టిపికల్ క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించిన తీరు ఫెంటాస్టింగ్‌గా ఉంటుంది. అందం, అభినయం, రొమాన్స్, సెంటిమెంట్ సీన్లలో రెచ్చిపోయింది. సీతారామం తర్వాత మరోసారి ది బెస్ట్ పాత్రతో అభిమానులను ఆకట్టుకొన్నదనే చెప్పాలి. నాని కూతురుగా మహీ పాత్రలో నటించిన కియారా ఖన్నా నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు. తెరపైన చూసి ఆ చిన్నారి నటనను ఆస్వాదించాల్సిందే.
ఇక హాయ్ నాన్న చిత్రంలో మృణాల్ తల్లి పాత్ర, అలాగే కన్నడ నటుడు జయరాం, హిందీ నటుడు అంగద్ బేడీ తమ పాత్రలతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. జయరాం క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్టు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అంగద్ బేడీ క్యారెక్టర్ వ్యవహరించిన తీరు సినిమా ముగింపును ఫీల్‌గుడ్‌గా మార్చింది. ప్రియదర్శి, నాజర్ కథకు సపోర్టుగా మారే పాత్రకు న్యాయం చేశారు.

హాయ్ నాన్న సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ మూవీకి సాను వర్గీస్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించారు. సన్నివేశాల్లో ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ మూడ్ బాగా క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ చాలా రొటీన్‌గా ఉంది. హృదయం, ఖుషీకి వాడిన ట్యూన్లనే వాడటం వల్ల కథలో ఉండే ఎమోషన్స్‌ను పక్కదారి పట్టించిందనే చెప్పాలి. పాటలు కూడా ఆకట్టుకొనేలా లేకపోవడం మైనస్. ఈ సినిమాకు మ్యూజిక్ బెటర్‌గా ఉంటే ఇంకా ఫీల్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యేవనిపించింది. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాగుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన్ చేరుకూరి, విజేందర్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను క్లాస్‌గా మార్చింది.
తండ్రి, కూతుళ్లు, భార్యాభర్త, తల్లి కూతుళ్ల మధ్య భావోద్వేగంతో సాగే చిత్రం హాయ్ నాన్న. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన శౌర్యు రాసుకొన్న కథ, కథనాలు అద్బుతంగా తెరపైన పండాయి. ప్రతీ సన్నివేశంలో జొప్పించిన సెంటిమెంట్ ప్రేక్షకుడి హృదయాలను కుదిపేస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హాయ్ నాన్న చెప్పుకోవచ్చు. నాని, మృణాల్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే చిత్రంగా అనిపిస్తుంది. ఫన్, లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్.


Click it and Unblock the Notifications











