Hidimbha Review వెన్నులో చలి పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్.. హిండింబ మూవీ రివ్యూ!
Rating: 2.75/5
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, సిజ్జు, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకత్వం : అనీల్ కన్నెగంటి
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
మాటలు: కళ్యాణ్ చక్రవర్తి
సినిమాటోగ్రఫి: బీ రాజశేఖర్
ఎడిటర్: ఎంఆర్ వర్మ
మ్యూజిక్: వికాస్ బాడిస
సమర్పణ: అనిల్ సుంకర
ఆర్ట్: షర్మిల శెట్టి
బ్యానర్స్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌వీకే సినిమాస్
రిలీజ్ డేట్: 2023-07-20
నగరంలో అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయిలు అదృశ్యం కావడం ప్రభుత్వానికి, పోలీస్ విభాగానికి సవాల్‌గా నిలుస్తుంది. అమ్మాయిల మిస్సింగ్ సంచలనంగా మారడమే కాకుండా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కేరళ నుంచి పోలీస్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేత)ను పిలిపిస్తారు. అప్పటికే మిస్పింగ్ కేసును పరిశీలిస్తున్న అభయ్ (అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య దర్యాప్తు చేపడుతారు.
అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారంలో కాలాబండా అనే ప్రాంతం ఎందుకు అనుమానాస్పదంగా మారింది? కాలబండా అనే ప్రాంతంపై అధిపత్యం కొనసాగిస్తున్న బోయా (రాజీవ్ పిళ్లై)కు ఎలాంటి సంబంధం ఉంది? పోలీస్ ఆఫీసర్ (రఘు కుంచె) ఎందుకు కేసును పక్కదారి పట్టించేందుకు చూశాడు? డీజీపీ (సంజయ్ స్వరూప్) బోయాను రక్షించేందుకు ప్రయత్నించారు? రాష్ట్ర సీఎం (శుభలేఖ సుధాకర్) మిస్సింగ్ కేసును పర్సనల్‌గా ఎందుకు తీసుకొన్నారు? దర్యాప్తు చేపట్టడానికి ముందే అభయ్, ఆద్య అప్పటికే ఎందుకు బ్రేకప్ జరిగింది? నరహంతకులైన గిరిజన తెగ హిడింబకు కథ ఏమిటి? అమ్మాయిల మిస్సింగ్‌కు హిడింబ తెగకు ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయిల మిస్సింగ్ కేసును అభయ్, ఆద్య ఎలా ఛేదించారనే ప్రశ్నలకు సమాధానమే హిడింబ సినిమా కథ.

నగరంలో అమ్మాయిల మిస్సింగ్ కేసు సంచలనంగా మారడంతో కథ మొదలవుతుంది. మద్యానికి బానిసైన పోలీస్ ఆఫీసర్ అభయ్ ఎంట్రీ ఆసక్తిని రేపుతుంది. అమ్మాయిల సీరియల్ మిస్పింగ్ వ్యవహారం కథను మరింత ఇంటెన్స్‌గా మారుస్తుంది. అయితే ఫస్టాఫ్ కొంత రొటీన్‌గా కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అభయ్, ఆద్య మధ్య రొమాన్స్, ప్రభుత్వ అధికారులు, సర్కారు తీరు లాంటి అంశాలతోపాటు చిన్న ట్విస్టుతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరిగేలా ఫస్టాఫ్ ముగుస్తుంది.
హిడింబ సినిమా రెండో భాగంలో కథ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆద్య తండ్రి (సిజ్జు) మిస్సింగ్ కేసు కథను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తుంది. అండమాన్ ఎపిసోడ్‌తో కథ మరో లెవెల్‌కు వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే ట్విస్టు సినిమాకు మరింత బలంగా, ఎమోషనల్‌గా మారుస్తుంది. కానీ సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు హింస, క్రూరత్వం, జుగుప్సకరమైన సీన్లు దారుణంగా ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడు తట్టుకోలేని విధంగా సన్నివేశాలు తెర మీద కనిపిస్తాయి. కానీ మంచి ఎమోషనల్ పాయింట్‌తో కథ ముగుస్తుంది.

దర్శకుడు అనీల్ కన్నె గంటి ఎంచుకొన్న పాయింట్.. ఆ పాయింట్ కోసం చేసిన పరిశోధన ఆకట్టుకొనేలా ఉంటుంది. కథను అనేక మలుపులు తిప్పుతూ.. క్యారెక్టర్లపై అనుమానాలు రేకిస్తూ రాసుకొన్న స్క్రీన్ ప్లే బాగుంది. ఫీల్‌గుడ్‌గా మార్చాల్సిన సన్నివేశాల్లో మితిమీరిన హింస, జుగుప్సకరమైన కంటెంట్‌ను జొప్పించడం కాస్త ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా కొత్త పంథాలో అనీల్ కథ చెప్పిన బాగుంది.
ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కథను, దర్శకుడు పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభయ్ పాత్రలో అశ్విన్ బాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. క్యారెక్టర్‌కు తగినట్టుగా బాడీని మలచుకొన్న తీరు.. ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకొంటాయి. రియల్‌గా ఫీల్ కలిగించేలా ఫైట్స్ చేయడం అశ్విన్ ప్రతిభకు అద్దంపట్టింది. ఓవరాల్‌గా కొత్త అశ్విన్‌ను చూడటానికి హిడింబ స్కోప్ కలిగించింది.

మిగితా నటీనటుల విషయానికి వస్తే.. ఆద్య లాంటి ఎమోషనల్ పాత్రతో నందిత శ్వేత ఆకట్టుకొన్నది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని చెప్పాలి. ఇక మకరంద్ దేశ్‌పాండే, శుభలేఖ సుధాకర్, రాజీవ్ పిళ్లే తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా సౌండ్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫి ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా, ఎమోషనల్‌గా, ప్రతీ సన్నివేశాన్ని రిచ్‌గా చూపించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది.

హిస్టరీ, ఫిక్షన్ అంశాలను కలబోసి రూపొందించిన మర్డర్ మిస్టరీ హిడింబ. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించిన విధానం దర్శకుడు అనిల్ కన్నెగంటి దర్శక ప్రతిభకు అద్దంపడుతుంది. పాత్రల్లో లీనమై నటించిన అశ్విన, నందిత శ్వేత ఆకట్టుకొంటారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ సినిమాను బలంగా మారాయి. అయితే హింస, మితిమీరిన అసభ్యత జుగుప్సను కలిగిస్తాయి. కాబట్టి ఈ సినిమాను పిల్లలకు దూరంగా ఉంచితే మంచిది. కొత్త పాయింట్, వేగంగా కథను నడిపించే స్క్రీన్ ప్లే కారణంగా మంచి అనుభూతి కలుగుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్, వయోలెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి హిడింబ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











