Ikka Movie Review: ఎక్కా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా, దియా మిర్జా, తిలోత్తమ షోమే, సంజీద షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ తదితరులు
దర్శకత్వం: సిద్దార్థ్ పీ మల్హోత్రా
నిర్మాతలు: స్వప్న మల్హోత్రా, సిద్దార్థ్ పీ మల్హోత్రా
సినిమాటోగ్రఫి: జిష్ణు భట్టాచార్యజీ
ఎడిటింగ్: శ్వేత వెంకట్ మ్యాథ్యూ
మ్యూజిక్: మిథున్, జులియస్ పాకియమ్
బ్యానర్: ఆల్కెమి ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2026-07-10
అర్జున్ మెహ్రా (సన్నీడియోల్) నిజాయితీతో కూడిన పవర్‌ఫుల్ లాయర్. ఎలాంటి ప్రలోభాలకు తలవొగ్గని నంబర్ వన్ న్యాయవాదిగా పేరు ఉంటుంది. భార్య అవంతిక (దియా మిర్జా), కూతురు సమైరా (దరియా బేడీ) తో జీవితం సాఫీగా సాగుతుంటుంది. ఈ క్రమంలో అదే ముంబైలో సంచలనం రేపిన సోమా మిట్టల్ (ఆకాంక్ష రంజన్) మర్డర్ మిస్టరీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న శౌర్యమాన్ గౌర్ (అక్షయ్ ఖన్నా)పై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. అయితే ఓ కారణంగా అర్జున్‌ను బ్లాక్ మెయిల్ చేసి అర్జున్ తన కేసును వాదించేలా చేస్తాడు. శౌర్యమాన్‌కు వ్యతిరేకంగా జూనియర్ లాయర్ మధురా బెనర్జీ (తిలోత్తమ షోమే) కేసు వాదిస్తుంది. దాంతో అర్జున్ మెహ్రాకు, శౌర్యమాన్‌కు ఈ కేసు సవాల్‌గా నిలుస్తుంది.
అర్జున్ మెహ్రా ఫ్యామిలీలో చోటు చేసుకొన్న క్లిష్టమైన సమస్య ఏమిటి? నిజాయితీగా ఉండే అర్జున్ మెహ్రా తనకు ఇష్టం లేకుండా శౌర్యమాన్ తరపున ఎందుకు వాదించడానికి సిద్దమవుతాడు? అర్జున్‌ను ఏ విషయంలో శౌర్య బ్లాక్‌మెయిల్ చేశాడు? సోమా మరణం వెనుక కారణం ఏమిటి? శౌర్యమాన్‌పై సోమ మర్డర్ కేసు ఎందుకు నమోదైంది? ఈ కేసులో మధుర వాదనలు ఎలా సాగాయి? మర్డర్ కేసు నుంచి శౌర్యను అర్జున్ కాపాడాడా? లేదా హత్యాయత్నం కేసులో శౌర్యకు శిక్షపడేలా మధుర వాదనలు చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎక్కా సినిమా కథ.

దర్శకుడు సిద్దార్థ్ పీ మల్హోత్రా రాసుకొన్న కోర్టు రూమ్ డ్రామాలో ఫ్యామిలీ ఎమోషన్స్, మర్డర్ మిస్టరీ అంశాలను జొప్పించి కథను నడిపించిన తీరు బాగుంటుంది. అర్జున్ ఫ్యామిలీలో చోటు చేసుకొన్న ఓ సమస్య, శౌర్యమాన్ మర్డర్ మిస్టరీని ఏకకాలంలో నడిపిస్తూ ఆసక్తిని రేపాడు. అర్జున్, అవంతిక భావోద్వేగాలు ఓ వైపు.. కేసు నుంచి తప్పించుకోవాలనుకొనే శౌర్యమాన్ కుతంత్రాలు ఒకవైపు, అనేక ట్విస్టులతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. అయితే సింగిల్ పాయింట్ మీదే కథ సాగడం రొటీన్, రెగ్యులర్ డ్రామాగా అనిపిస్తుంది. కానీ కథలో చోటు చేసుకొనే ట్విస్టులను దర్శకుడు సిద్దార్థ్ బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి.
ఎక్కా సినిమాలో సన్నిడియోల్, అక్షయ్ ఖాన్నా, తిలోత్తమ షోమే, దియా మిర్జా పాత్రల మధ్య మానసిక సంఘర్ణణ ఆకట్టుకొనేలా ఉంటాయి. మరోసారి సన్నీడియోల్ పవర్‌ఫుల్ రోల్‌లో గర్జించాడనే చెప్పాలి. ధురందర్ తర్వాత అక్షయ్ ఖన్నా మరోసారి క్రూరమైన విలన్‌గా తన పాత్రలో ఒదిగిపోయాడు. జూనియర్ లాయర్‌గా తిలోత్తమ ఆకట్టుకొన్నారు. దియా మిర్జా ఓ ఎమోషనల్ క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేసింది. మిగితా పాత్రాల్లో నటించిన వారంతా ఫఱ్వాలేదనిపించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోర్టు రూమ్ డ్రామా కావడంతో టెక్నికల్ అంశాలకు పెద్దగా స్కోప్ లేకపోయింది. కేవలం కంటెంట్ మీదే సినిమా రన్ అవుతుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా ఎడిటింగ్ విభాగం పనితీరు వల్ల సినిమాకు ట్విస్టులు బలంగా మారాయని చెప్పాలి. కోర్టు రూమ్ డ్రామాను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తగినంత టైమ్ చూసుకొని ఒకేసారి చూసేయండి.. మంచి అనుభూత కలుగుతుంది.


Click it and Unblock the Notifications