In Car Movie Review: కారులో అమ్మాయిపై ముగ్గురు మానభంగ ప్రయత్నం.. కథ, కథనాలు ఎలా సాగాయంటే?
Rating: 1.5/5
నటీనటులు: రితిక సింగ్, సందీప్ గోయట్, మనీష్ జంజోలియా, గ్యాన్ ప్రకాశ్, సునీల్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష వర్ధన్
నిర్మాతలు: అంజుమ్ ఖురేష్, సాజిద్ ఖురేషి
సినిమాటోగ్రఫి: మిథున్ గంగోపాధ్యాయ్
ఎడిటింగ్: మణిక్ దివార్
మ్యూజిక్: మథియాస్ డుప్లెస్సీ
బ్యానర్: ఇన్‌బాక్స్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-03-03

మర్డర్ కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడు,మరో ఇద్దరు (సందీప్ గోయట్, మనీష్ జంజోలియా, సునీల్) తమ వాహనంలో ప్రయాణిస్తుంటారు. తమ వాహనం చెడిపోవడంతో అదే దారిలో వస్తున్న మరో కారును హైజాక్ చేస్తారు. డ్రైవర్‌ను తుపాకితో బెదిరించి తమ వెంట తీసుకెళ్తారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు బర్త్ డే కావడంతో ఎవరైనా అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకొంటారు. వారు వెళ్లే దారిలో బస్టాప్‌లో ఉన్న అమ్మాయి (రితిక సింగ్)ను కిడ్నాప్ చేసి కారులో బంధించి కోరికలు తీర్చుకోవాలనుకొంటారు.
నేరస్థుల చేతిలో కారులో బందీ అయిన రితిక సింగ్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది? కారులో రితికా సింగ్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారా? ముగ్గురు కిడ్నాపర్లను రితికా సింగ్ ఎలా ప్రతిఘటించింది? కారులో ఉన్న ముగ్గురితో రితికా సింగ్ ఎలా పోరాడింది? తప్పించుకు పారిపోయిన రితికా పరిస్థితి ఏమైంది? రితికా సింగ్‌పై మానభంగం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురిని కారు డ్రైవర్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఇన్ కార్ సినిమా కథ.
నేరప్రవృత్తి కలిగిన ముగ్గురు కారును హైజాక్ చేసి.. అందులో ప్రయాణిస్తూ అమ్మాయిని కిడ్నాప్ చేసి తమ కోరికలను తీర్చుకోవాలనే సింగ్ పాయింట్ ఎజెండాతో కథ సాగుతుంది. 2 గంటల సినిమా నాలుగు పాత్రలతో కారులోనే సాగుతుంది. కథా, కథనాల్లో వైవిధ్యం కొరవడంతో ఆద్యంతం బోర్‌గా సాగుతుంది. షార్ట్ ఫిలింకు ఎక్కువ, సినిమాకు తక్కువ అనే విధంగా ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా సినిమా సాగుతుంది. సన్నివేశాలు కూడా పేలవంగా ఉన్నాయి. సినిమాకు కావాల్సిన కనీస ప్రమాణాలు కూడా కనిపించవు.
నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. పరిమితమైన పాత్రలో కూడా రితిక తన ప్రతిభను నిరూపించడానికి ప్రయత్నించింది. కొన్ని ఎమోషన్స్, హావభావాలను బాగా ప్రదర్శించింది. మనీష్ క్రూరత్వంగా విలనిజాన్ని పండించే ప్రయత్నం చేశాడు. మిగితా పాత్రల పెద్దగా క్యారెక్టరైజేషన్ పెద్దగా లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారు.
దర్శకుడు హర్షవర్ధన్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథగా విస్తరించి.. మంచి కథనంతో ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ఒక కారులో సినిమాను నడిపించడం అంటే కత్తి మీద సామే. అలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో దారుణమైన తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం ఏదైనా ఉందంటే.. అది సినిమాటోగ్రఫి, మ్యూజిక్ మాత్రమే. పేలవమైన సీన్లను కూడా ఈ రెండు విభాగాలు కాపాడే ప్రయత్నం చేశాయి.
ఫైనల్‌గా ఇన్ కార్ సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి కొత్తదనం, ఆసక్తికరమైన కథ, కథనాలు లేని చిత్రం. ఆద్యంతం సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే అంత మంచింది. చూడాలనుకొనే వారు.. ఓటీటీలో వచ్చే వరకు ఆగితే.. సమయం, డబ్బు ఆదా అవుతుంది.


Click it and Unblock the Notifications











