IQ Movie review ఆసక్తిని రేపే థ్రిల్లింగ్ డ్రామా.. ఐక్యూ మూవీ మెప్పించిందా అంటే?
నటీనటులు: సాయిచరణ్, పల్లవి, సుమన్, బెనర్జీ, సత్య ప్రకాశ్, సూర్య, పల్లె రఘునాథ్ రెడ్డి, జబర్దస్త్ శేషు, గీతా సింగ్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ జీఎల్‌బీ
నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
సమర్పణ: కాయగూరల రాజేశ్వరి
బ్యానర్: కేఎల్‌పీ మూవీస్
సినిమాటోగ్రఫి: టీ సురేందర్ రెడ్డి
కథ, మాటలు, సంగీతం: పోలూరు ఘటికాచలం
రిలీజ్ డేట్: 2023-06-02
మధ్య తరగతి కుటుంబానికి చెందిన భూమిక (పల్లవి) బాల్యం నుంచే ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఉన్నత చదువులు చదివిన భూమిక ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరుతుంది. పల్లవి చేరిన కాలేజీలోనే వివేక్ (సాయికిరణ్) స్టూడెంట్‌గా ఉంటాడు. కాలేజీలో అల్లరిచిల్లరి బ్యాచ్‌లో చేరి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. భూమికను చూసి వివేక్ ప్రేమలో పడుతాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన మనసులోని ప్రేమను చెప్పాలని అనుకొంటాడు? అయితే ఆ కాలేజీలోనే మరో ప్రొఫెసర్ భూమికపై భయంకరమైన కుట్రకు ప్లాన్ చేస్తాడు.

ప్రొఫెసర్ భూమికకు వివేక్ మధ్య పరిచయం ఎలా జరిగింది? భూమికకు వివేక్ ఎలా దగ్గరయ్యాడు? భూమికను వివేక్ కిడ్నాప్ చేశాడా? భూమికు తన ప్రేమ విషయాన్నితెలియజేశాడా? భూమిక తెలివితేటలు చూసి మరో ప్రొఫెసర్ ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేశాడు? భూమిక లైఫ్‌ను భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టడానికి ప్రొఫెసర్ చేసుకొన్న డీల్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఐక్యూ సినిమా కథ.
ఐక్యూ చిత్రంలో నటించిన వారిలో చాలా మంది నటనకు కొత్తవారే. అయినా తమలోని ప్రతిభను చాటుకొనేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. భూమిక పాత్రలో నటించిన పల్లవి ఈ సినిమా భారాన్ని పూర్తిగా మోసే ప్రయత్నం చేసింది. వివేక్ పాత్రలో కనిపించిన సాయి చరణ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. పోలీస్ కమిషనర్ ప్రకాశ్ గౌడ్‌గా సుమన్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కలెక్టర్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నటించారు. జబర్దస్త్ శేషు, గీతా సింగ్ తమదైన శైలిలో కామెడీని పండించారు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు.
దర్శకుడు శ్రీనివాస్ జీఎల్‌బీ రాసుకొన్న పాయింట్.. ఆ పాయింట్ చుట్టు అల్లుకొన్న కథ, కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనుభవం లేకున్నా గానీ ఎలాంటి తడబాటు లేకుండా సీనియర్, జూనియర్ నటుల నుంచి మంచి నటనను రాబట్టుకొన్నారు. కథా రచయిత ఘటికాచలం మాటలు, పాటలతోపాటు సంగీతంతో ఆకట్టుకొన్నారు. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. దర్శకుడి స్టోరి విజన్‌ను బాగా ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించారు. శివ షర్వాణి ఎడిటింగ్ బాధ్యతలను బాగా నిర్వహించారు.
లవ్, ఎమోషన్స్, కిడ్నాప్ డ్రామాగా ఐక్యూ తెరకెక్కింది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణలు పనితీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కాయగూరల రాజేశ్వరి, లక్ష్మీపతి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వారు ఈ మూవీని నిర్మించిన తీరును చూస్తే సినిమాపై వారికి ఉండే అభిరుచి తెలియజేస్తుంది. థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











