twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇష్టం - ఎంతకష్టం!

    By Staff
    |

    Istam
    - జలపతి
    చిత్రం: ఇష్టం
    నటీనటులు: చరణ్‌, శ్రేయ, పూనమ్‌ థిల్లాన్‌, శరత్‌ బాబు, చంద్రమోహన్‌
    సంగీతం: డి.జె.గోపీనాథ్‌
    నిర్మాత: రామోజీరావు
    కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్‌ - రాజ్‌ కుమార్‌

    యూత్‌ చిత్రాల పేరుతో వచ్చిన మరో అర్థం పర్థం లేని చిత్రం- ఇష్టం. ఇప్పుడు అన్ని సినిమాలకు ఒకటే నేపథ్యం- కాలేజ్‌. ఈ కాలేజ్‌ నేపథ్యంలో హీరో, వారి గ్యాంగ్‌ చేసే పిచ్చి, పిచ్చి చేష్టలు, బూత్‌ డైలాగ్‌ లకు, ప్రేమను కలపి తీయడం అందరూ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే చేశారు. కాకపోతే, ఈ సినిమాలో తెలుగు సీరియల్స్‌ ధోరణి ఎక్కువ. ప్రతి పాత్ర కూడా అంతకుముందు జరిగిన సన్నివేశాన్ని మళ్ళీ మనకు వివరిస్తుంటుంది. దీనికి తోడు సెంటిమెంట్‌. అందుకే ప్రేక్షకులకు కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా పాత చింతకాయపచ్చడి లాంటి సందేశం కూడా చెప్పారు.

    అదేమిటంటే- ప్రేమించడం ఈజీయే, కానీ సంపాదించడమే కష్టమని. కాబట్టి ముందు నువ్వు ప్రయోజకుడివని నిరూపించుకో..ఆ తర్వాత పెళ్లి చేసుకో అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. కానీ, డిగ్రీ చదువుకునే వాడికే పెళ్ళి ఎందుకో చేస్తారో మాత్రం మనకు అర్థం కాదు. ఈ రోజుల్లో డిగ్రీ చదివే వాడికి పెళ్ళి అంటే బాల్య విహహాం కిందే లెఖ్ఖ. ఇదీ తెలుగు సినిమా దర్శకులకు అర్థం కాదు. అందుకే, ఇలాంటి అర్థం, పర్థం లేని సినిమాలు తీస్తారు. సందేశం అనే ముసుగులో- చెత్త సినిమాలను వదులుతున్నారు. ఈ యూత్‌ సినిమాల బెడద ఎప్పుడు తగ్గుతుందో!

    చరణ్‌ డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థి. కొత్తగా చేరిన శ్రేయను ర్యాగింగ్‌ చేస్తాడు. టీజ్‌ చేసే వాళ్ళంటే ఆమెకు ఇష్టమేమో, వెంటనే హీరోగార్ని ప్రేమిస్తుంది. హీరో మాత్రం మందు తాగుతూ, 'ఫిగర్‌'లను ఏడిపిస్తూ, కాలం గడుపుతుంటాడు. ఒక సందర్భంలో శ్రేయకు, చరణ్‌ అమ్మ(పూనమ్‌ థిల్లాన్‌)కు పరిచయం ఏర్పడుతుంది. వయసులో తేడా ఉన్నా వారిద్దరూ స్నేహితులవుతారు. సో..ఈ అమ్మాయి రాకపోకల వల్ల రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. చరణ్‌ కు కూడా ఉన్నట్టుండి శ్రేమ మీద ఇష్టం పెరుగుతుంది. శ్రేయ, చరణ్‌ లకు ఇద్దరికీ పెళ్ళి చేస్తే బాగుంటుందని శ్రేయ తండ్రి చంద్రమోహన్‌ ప్రపోజ్‌ చేస్తాడు.

    దీనికి పూనమ్‌ ఒప్పుకోదు. ఎందుకంటే తన కొడుకు- శ్రేయ లాంటి మంచి అమ్మాయికి సరిపోడని ఆమె అభిప్రాయం. ఇది తెలుసుకొన్న చరణ్‌ వాళ్ళ అమ్మ మీద అలిగి ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు. ఇళ్ళు వదిలి వెళ్ళాక బాధ్యత తెలిసి వస్తుంది. సో..పిట్జా కార్నర్‌ లో డెలివరీ బోయ్‌ గా పనిచేసి, కష్టపడి సంపాదించి...తను ఎంత మంచి వాడో రుజువు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏముంది సినిమా ముగుస్తుంది.

    ఒకే ఒక్క సందర్భంలో చరణ్‌ బాగా చేశాడు- డెలీవరీ బోయ్‌ గా. అంతే. ఇక శ్రేయ అందంగా ఉంది. తొలిప్రేమలో కీర్తిరెడ్డి టైప్‌ లో ఫేసియల్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో ఆకట్టుకుంది. గోపినాథ్‌ సంగీతం ఫర్వాలేదు. యే వూరే...చిన్నదానా అనే పాట మాత్రం మరీ బాగుంది. కాకపోతే అది కాపీ ట్యూన్‌. కథ, మాటలు, దర్శకత్వం..ఇలా అన్నీ శాఖలు నిర్వహించిన దర్శక ద్వయం విక్రమ్‌- రాజ్‌ కుమార్‌ లు టీవీ సీరియల్స్‌ కు బాగా నప్పుతారు. 'ఆ బొమ్మ(బూతు బొమ్మ)లను చూసి, చూసి, నా చేతుల మీద గీతలు చెరిగిపోతున్నాయి' లాంటి డబులు మీనింగ్‌ డైలాగ్స్‌ కూడా ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X