వెండితెర అధ్బుతం 'అవతార్' (రివ్యూ)


సినిమా: అవతార్
నటీనటులు: సామ్, సింగ్యుర్ వీవర్, గివోన్ని రిబిస్సే, స్టెఫిన్ లాంగ్ తదితరులు.
సంగీతం: జేమ్స్ హార్నర్
కెమెరా: మరియో ఫియరో
ఎడిటింగ్: జాన్ రిపోవా, స్టెఫిన్ ఇ.రివికి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: జేమ్స్ కెమెరాన్
రిలీజ్ డేట్: డిసెంబర్ 18,2009
ప్రపంచం పన్నెండేళ్ళుగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవతార్ అద్భుతంగా ధియోటర్స్ లోకి దూకింది. తెలిసున్న కథే,కానీ మళ్ళీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అత్యవసరమున్న పాయింటుతో పలకరించింది. ప్రకృతి కన్న తల్లి లాంటిదని,గౌరవిస్తే అన్నీ ఆమే ఇస్తుందని, దాన్ని నాశనం చేయాలని చూస్తే మనమే నాసనమవుతామని సున్నితంగా హెచ్చరిస్తూ కథనం సాగుతుంది. అలాగే ఓ విచిత్ర ప్రపంచాన్ని మనముందు అత్యధ్బుతంగా ఆవిష్కరిస్తుంది. ఇప్పటివరకూ మనం చూడని లోకాన్ని పరిచయం చేసే ఈ చిత్రాన్ని చూడటం ఓ గొప్ప అనుభవం.
భూమికి చాలా దూరంలో వేరే గ్రహంపై పాండోరా అనే అడవి ఉంటుంది. అక్కడ నావీ అనే అటవీ తెగ ఉంటుంది. చూడ్డానికి మనుష్యులులాగ ఉన్నా వారు మన కన్నా ఎత్తు, పొడవైన తోక, మెరిసే నీలం రంగు చర్మం,ప్రత్యేకమైన భాషతో తమదైన ప్రపంచంలో బ్రతుకుతూంటారు. అలాగే అక్కడ భూమిమీద నుంచి వెళ్ళిన మనుష్యులు శ్వాస తీసుకోలేరు. అలాంటి చోటకి జాక్(సామ్)అనే ఓ మాజీ నావికాదళ ఉద్యోగి ప్రయాణం పెట్టుకుంటాడు. అతనికి ఉద్యోగ నిర్వహణలో నడుం క్రింది బాగం చచ్చుపడిపోతుంది. దాంతో ఆ పాండోరా ప్రాంతానికి వెళ్ళే అవతార్ అనే పోగ్రామ్ లో పాల్గొంటే అతను తిరిగి నడవగలనని తెలిసి అందుకు సిద్దపడతాడు. అయితే ఆ పోగ్రామ్ లో పాల్గొనే జాక్ కి ఓ కండీషన్. అక్కడకి వెళ్ళాక అతను పాండోరాలో తిరిగే తమ వారికి రక్షణ ఇస్తూ అక్కడ విషయాలు చెప్తూండాలని. ఓకే అన్న జాక్ భూమికి అత్యంత దూరంగా ఉన్న పాండోరా అనే అడివికి ఉత్సాహంగా ప్రయాణం అవుతాడు. అయితే అతనికి తెలియని మర్మం ఈ ప్రయాణంలో ఉంటుంది. పాండోరా గ్రహంపై ఉండే విలువైన సంపదని దోచుకోవాలనేది ఈ ప్రాజెక్టు ఆర్గనైజర్ ఆలోచన. అతడే ఈ స్కీమ్ వేస్తాడు. ఇక అక్కడికి వెళ్లాక అక్కడ శ్వాస పీల్చలేడు కాబట్టి కృత్రిమ పద్దతులతో అతన్ని నావీగా మార్చేస్తారు. అయితే అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు కదా. కొత్తగా నావీ గా మారిన జాక్ అక్కడ తప్పిపోతాడు. అక్కడ క్రూర మృగాల బారిన పడబోతాడు. ఆ సమయంలో అతన్ని ఓ ఆడ నావీ కాపాడుతుంది. ఆ తర్వాత మన హీరో జాక్ అక్కడ వారి నిజాయితీకి,ప్రకృతిలో బ్రతుకుతున్న వారి జీవన విధానానికి ముగ్దుడై రక్షించిన పడతితో ప్రేమలో పడతాడు. అంతేగాక అక్కడ వారితో కలిసి పోయి ఎగరటం,దూకటం, అక్కడ పక్షులను మచ్చిక చేసుకుని ఎగరటం వంటి విద్యలు నేర్చుకుంటాడు. మరోప్రక్క తనని అక్కడికి ఎందుకు పంపారో తెలుసుకుని ఆ తెగ వారికి అన్యాయం చేయవద్దని చెప్తాడు. అయితే ఇంత ఖర్చుపెట్టిన వారు ఇతని మాట విని ఊరుకోరు కదా..అక్కడ వారిపై యుద్దం ప్రకటిస్తారు. చివరకు అక్కడ జాతి వారిని హీరో జాక్ ఎలా రక్షించాడు అన్నది మిగతా కథ.
నిజానికి గిరిజన పుత్రులను దోచుకునే దుర్మార్గులు, వారిని ఎదుర్కొని వారి తరుపున పోరాడే హీరో లాంటి స్టోరీ లైన్ లు మన తెలుగుకు కొత్తేమీ కాదు. అయితే ఆకట్టుకునే విధానంగా చెప్పటంలోనే అంతా ఉంది. ఇక ఈ చిత్రంలో చెప్పుకోవాలంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అవన్నీ చూస్తేనే ఆసక్తిగా ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రం కధా పరంగా చాలా ఫెరఫెక్ట్ డిజైన్ తో ఉండి ఎక్కడా బిగి సడలనట్టుగా ఉండటం. అలాగే ఊహించటానికి అసాధ్యమనిపించే మరో ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు మేధస్సుని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక పాత్రల్లో వంక పెట్టడానికి వీల్లేకుండా ఎవరి పరిధిల్లో వారు ఇమిడిపోయారు. అన్నటికన్నా గొప్ప విషయం ఏదో కథ అనుకుని తీసేయకుండా ఓ భాధ్యతగా ఫీలై పర్యావరణం గురించి ఇండైరక్ట్ గా హెచ్చరించటం.
ఏదైమైనా ఇక ఈ సినిమా గురించి ఇంతకన్నా రాయటం అనవసరం. ఎందుకంటే చదవటం కన్నా ధియోటర్ లో చూసి ఎంజాయ్ చేయటం మేలు. అవకాశముంటే త్రిడీలో ఐమాక్స్ లో చూడండి..మిస్ కాకుండి..ముఖ్యంగా టీవీల్లో చూస్తే ఆ ఫీల్ ఉండదు.


Click it and Unblock the Notifications











