Japan Movie Review కార్తీ అదరగొట్టినా.. అలాంటి నిరాశ.. జపాన్ మూవీ రివ్యూ
నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, జితన్ రమేష్, సునీల్, కేఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్, వగై చంద్రశేఖరన్, బావ చెల్లదురై తదితరులు
కథ, దర్శకత్వం: రాజు మురుగన్
నిర్మాత: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్
సినిమాటోగ్రఫి: రవి వర్మన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-11-10
నగరాలల్లో ఉండే అత్యంత విలువైన నగల షాపుల్లో భారీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‌గా నిలిచే దొంగ జపాన్ (కార్తీ). దొంగతనాలు చేస్తూ సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తనకు ఉన్న సినిమా పిచ్చితో హీరోగా నటిస్తూ తానే సినిమాలు నిర్మిస్తుంటాడు. ఆ క్రమంలో సంజూ (అను ఇమ్మాన్యుయేల్) అనే హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోతాడు. ఆ క్రమంలో జరిగిన భారీ చోరీ జపాన్‌కు అనేక సమస్యలు తెచ్చి పెడుతుంది.

బంగారం దొంగతనాలను జపాన్ ఎందుకు చేస్తాడు? హీరోయిన్ సంజూ ఎలా ప్రేమ పడ్డారు. నగరంలో జరిగిన భారీ చోరీ తర్వాత మూడు రాష్ట్రాల పోలీసులు వెంటపడితే జపాన్ ఏం చేశాడు? తాను చేయని చోరీ తనపై వస్తే జపాన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? తన పేరు ఉపయోగించి దొంగతనం చేసిన గుర్తు తెలియని వ్యక్తిని జపాన్ గుర్తించాడా? ఇంతకు ఆ భారీ చోరీ ఎవరు చేశారు? తన తల్లిని మెప్పించడానికి జపాన్ చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోన్నాడనే ప్రశ్నలకు సమాధానమే జపాన్ సినిమా కథ.
దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్ రాసుకొన్న శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంద. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ కొన్ని సందర్భాల్లో సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పాలి. కానీ కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు ఫుల్ ఫన్‌గా, నవ్వుల్లో ముంచెస్తాయి.దర్శకుడు రాజు మురుగన్ కథను మదర్ సెంటిమెంట్‌తో చెబితే సెంటిమెంట్‌తో కూడిన మంచి ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపించింది.

కార్తీ విషయానికి వస్తే.. జపాన్‌గా తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. టిపికల్ డైలాగ్ డెలీవరి, బాడీ లాంగ్వేజ్, లుక్, అన్ని రకాలుగా మెప్పించారు. కార్తీ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్. కథలో పస లేకపోవడం వల్ల తన పాత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్లలేకపోయారనే ఫీల్ కలుగుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌కు పరిమితమైన పాత్ర లభించినా.. గ్లామర్ పంట పండించిందనే చెప్పవచ్చు. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్ శ్రీధర్‌గా సునీల్ ఓకే అనిపించారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. ఆర్ట్ విభాగం పనితీరు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల మ్యూజిక్ ఎలివేట్ కాలేకపోయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమాలో బాగా ఆకట్టుకొన్నదేమైనా ఉందంటే... డైలాగ్స్ మాత్రమే. తెలుగు నేటివిటికి తగినట్టు రాసిన డైలాగ్స్ ఫుల్లుగా ఫన్ క్రియేట్ చేశాయి.

కథ, కథనాలపై కసరత్తు చేయకుండా.. కేవలం కార్తీ క్యారెక్టర్‌ను బలంగా రాసుకొన్న థ్రిల్లర్ కథ జపాన్. తన వరకు కార్తీ న్యాయం చేసినా..దర్శకుడు మాత్రం నిరాశ పరిచాడు. కథలోని మిగితా క్యారెక్టర్లు కనెక్ట్ కాకపోవడం వల్ల సినిమా అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. కార్తీ ఫెర్ఫార్మెన్స్, డైలాగ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే వారికి సినిమా నచ్చుతుంది. కార్తీ సినిమాలను ఇష్టపడే వారికి జపాన్ నచ్చడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











