Jawan Movie Review షారుక్ ఖాన్ వన్ మ్యాన్ షో.. అట్లీ టేకింగ్ అదుర్స్.. జవాన్ రివ్యూ
నటీనటులు: షారుక్ ఖాన్, నయన్ తార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, యోగిబాబు తదితరులు
రచన, దర్శకత్వం: అట్లీ
నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ
డైలాగ్స్: సుమిత్ వర్మ
సినిమాటోగ్రఫి: జీకే విష్ణు
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
ఎడిటర్: రుబెన్
బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైనర్
మూవీ నిడివి: 169
రిలీజ్ డేట్: 2023-09-07
జైలర్‌గా పనిచేసే ఆజాద్ (షారుక్ ఖాన్).. విక్రమ్ రాథోడ్ పేరుతో రాబిన్ హుడ్ అవతారం ఎత్తి అక్రమాలు చేసే పారిశ్రామిక వేత్తలను, అవినీతి మంత్రులను టార్గెట్ చేసి డబ్బు వసూలు చేస్తుంటాడు. అవినీతి పరుల జీవితాలను పబ్లిక్‌లో పెట్టి పేదలకు, రైతులకు ఆర్థిక సహాయం చేస్తుంటాడు. కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) చేసే అక్రమ వ్యాపారాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. రాబిన్ హుడ్ ముసుగులో హైజాక్స్, కిడ్నాప్‌లను చేస్తున్న ఆజాద్‌ను పట్టుకొనేందుకు పోలీస్ ఆఫీసర్ నర్మద (నయనతార) ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆజాద్‌ను కలుసుకోవడమే కాకుండా పెళ్లి చేసుకొంటుంది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకొన్న ఆజాద్.. హైజాక్, కిడ్నాప్ చేస్తున్న విక్రమ్ రాథోడ్ అని నర్మదకు తెలుస్తుంది. ఈ క్రమంలో నర్మద, ఆజాద్‌ను కాళి బంధిస్తాడు. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చి వారిని కాపాడుతాడు.

జైలర్ ఆజాద్ ఎందుకు విక్రమ్ రాథోడ్‌గా అవతారం ఎత్తాడు? కాళిని ఎందుకు ఆజాద్ టార్గెట్ చేశాడు. విక్రమ్ రాథోడ్ అసలు ఎవరు? విక్రమ్ రాథోడ్‌కు ఆజాద్‌కు సంబంధం ఏమిటి? విక్రమ్ రాథోడ్ భార్య ఐశ్వర్య (దీపిక పదుకోన్) పాత్ర ఏమిటి? ఆజాద్ చిన్నతనంలో జైలులో ఎందుకు పెరిగాడు? కాళికి, విక్రమ్ రాథోడ్‌కు మధ్య ఉన్న వైరుధ్యం ఏమిటి? చివరకు కాళి అక్రమ దందాలకు ఆజాద్, విక్రమ్ రాథోడ్ ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే జవాన్ సినిమా.

దేశ సరిహాద్దులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ ఎంట్రీని దర్శకుడు అట్లీ హై ఎనర్జీ, ఎమోషన్స్‌తో మొదలుపెట్టి కథలోకి తీసుకెళ్లిన తీరు హై స్పీడ్‌లో టేకాఫ్ అయిన ఫ్లయిట్‌లా ఉంటుంది. ఆ తర్వాత మెట్రో ట్రైన్ హైజాక్‌తో అసలు కథను మొదలుపెట్టి మంచి డ్రామాతో ఎమోషన్ సీన్ల పరుగుతు పెట్టించారు. అలాగే నయనతార ఎంట్రీ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేయడంతో కథ మరింత వేగంగా ముందుకు కదులుతుంది. ఆ తర్వాత ట్రైన్ హైజాక్ బేస్ చేసుకొని కాళీగా విజయ్ సేతుపతి ఎంట్రీతో మరో ఫీస్ట్ అందించాడు. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లిగా ఉన్న నర్మదను ఆజాద్ పెళ్లి చేసుకొనే సీన్‌తో కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను దట్టించాడు. ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో తండ్రి విక్రమ్ రాథోడ్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చి ఫస్టాఫ్ ముగించాడు.

ఇక సెకండాఫ్‌లో విక్రమ్ రాథోడ్, ఐశ్వర్య ఫ్లాష్ బ్యాక్‌తో తెరపైకి తెచ్చి కథకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఐశ్వర్యగా దీపిక పదుకోన్ ఎపిసోడ్ హృదయాన్ని పిండేసేలా ఉంటుంది. సెకండాఫ్‌లో తండ్రి, కొడుకులు చేసే మ్యాజిక్, మాస్, మసాలా సీన్లతో సినిమా పక్కా కమర్షియల్ హంగులతో సాగిపోతుంది. సంజయ్ దత్ పాత్రను పరిచయం చేసి మరింత జోష్‌ను కథలోకి తీసుకొచ్చాడు. రెగ్యులర్, రొటీన్ అంశాలు, మాస్ ఎలిమెంట్స్‌తో రివేంజ్ డ్రామాగా ముగించాడు. కథకు శ్రీకాకుళం కనెక్ట్ చేయడం, అలాగే వైజాగ్ కెమికల్ ఫ్యాక్టరీల వల ప్రజల ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుందనే విషయాలను టచ్ చేసి.. తెలుగు వారిని సినిమాకు రప్పించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.
దర్శకుడు అట్లీ ఎంచుకొన్న పాయింట్ గతంలో తండ్రి, కొడుకుల పగ, ప్రతీకారంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అట్లీ రాసుకొన్న సీన్లు, కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన విధానంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యేలా చేసింది. కథలో పాత్రలను డిజైన్ చేసిన విధానంతో సక్సెస్ ఫార్ములా వర్కవుట్ అయ్యేలా చేశాడు. కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు కానీ.. స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్తదనం తీసుకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

నటీనటుల విషయానికి వస్తే.. షారుక్ ఖాన్, నయనతార, దీపిక పదుకోన్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి, కొడుకులుగా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లతో తనదైన శైలిలో మ్యాజిక్ చేశాడు. ఎప్పటిలానే హై ఎనర్జీతో సినిమాను మరో లెవెల్‌కు
తీసుకెళ్లాడని చెప్పవచ్చు. నయనతార తన రేంజ్‌కు తగిన పాత్రలో ఒదిగిపోయింది. బాలీవుడ్ ఎంట్రీకి కావాల్సిన ఫర్‌ఫెక్ట్ క్యారెక్టర్‌తో మెప్పించింది. దీపిక పదుకోన్ పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయే ఎమోషనల్ పాత్రలో నటించింది. ఇక విజయ్ సేతుపతి విలన్ పాత్రలో విశ్వరూపమే చూపించాడు. సంజయ్ దత్ చిన్న అతిథిపాత్రలో మెరిసాడు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మాస్ ఆడియెన్స్ పల్స్ పట్టుకొని.. రాసిన డైలాగ్స్ సినిమాను మాస్ మూవీగా చేశాయి. కథలో బలమైన సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జత చేరి.. మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. పాటలు అభిమానులను స్టెప్పలు వేయించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు పనితీరు అద్బుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మరింత మాస్ ఎలిమెంట్స్ చేర్చిందని చెప్పవచ్చు.

లవ్, ఎమోషన్స్, అవినితీపై పోరాటం, దేశంలో రైతుల సమస్యలు, వాతావరణ కాలుష్యం, ఓటు విలువ లాంటి అంశాలను రంగరించి చేసిన మాస్, కమర్షియల్ సినిమా జవాన్. రజనీకాంత్ సినిమాలో మాదిరిగా లాజిక్కులు వెతకకుండా చూస్తే సినిమా మంచి అనుభూతిని అందిస్తుంది. సెంటిమెంట్, దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాకు మరింత బలంగా మారింది. షారుక్, నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అత్యంత పాజిటివ్ అంశాలు. అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా ఈ సినిమాను రూపొందించారు. ఎలాంటి అనుమానాలు లేకుండా సినిమాకు వెళ్తే మాస్ సినిమాల్లో ఉండే కిక్కు పొందడం ఖాయం.


Click it and Unblock the Notifications











