Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కిరీటీ, శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావురమేష్, ఆచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: రాధాకృష్ణారెడ్డి
నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి శివానీ
సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
బ్యానర్: వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-07-18
విజయనగరం గ్రామంలో కోదండపాణి (రవిచంద్రన్) భార్య శ్యామల లేటు వయసులో గర్భవతి అవుతుంది. అయితే గ్రామంలో వారికి ఎదురైన పరిస్థితుల వల్ల ఆ ఊరిని విడిచి వెళ్తారు. ఆ క్రమంలో బస్సులోనే అభి (కిరిటి)కి శ్యామల జన్మను ఇచ్చి కన్నుమూస్తుంది. తల్లిలేని అభికి సర్వం తానై పెంచి పెద్ద చేస్తాడు. కాలేజీలో స్పూర్తి (శ్రీలీల)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. బీటెక్ పూర్తయిన తర్వాత గోపాల్ (రావు రమేష్), విజయ సౌజన్య (జెనీలియా)కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ రైజ్‌లో ఇంటర్న్‌గా అభి, స్పూర్తి చేరుతారు. అయితే వారు చారిటీ నిర్వహిస్తున్న విజయనగరం గ్రామంలో తాము ఇచ్చే ఫండ్స్ విషయంలో భారీ కుంభకోణాన్ని అభి బయటపెడుతాడు. దాంతో విజయ సౌజన్య, అభి టీమ్‌ను ఆ ఊరికి వెళ్లమని గోపాల్ ఆదేశిస్తాడు.

విజయనగరం గ్రామాన్ని కోదండపాణి దంపతులు ఎందుకు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది? అభిని కోదండపాణి ఎలా పెంచాడు? అభి తన కాలేజీ లైఫ్‌ను ఎలా పూర్తి చేశాడు? స్పూర్తితో లవ్ ట్రాక్ ఎలా నడిచింది? విజయనగరం గ్రామంలో భారీగా అవినీతి ఏం జరిగింది? విజయ సౌజన్యకు, అభికి మధ్య గొడవ ఏమిటి? విజయకు అభికి ఉన్న రిలేషన్ ఏమిటి? ఆ ఇద్దరిని విజయనగరానికి ఎందుకు పంపారు? విజయనగరంలో జరిగిన సంఘటనలు ఏమిటి? తన తండ్రి విషయంలో తలెత్తిన సమస్యను అభి పరిష్కరించాడా? విజయ సౌజన్య కోసం అభి ఎలాంటి త్యాగం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే జూనియర్ సినిమా కథ.
పాజిటివ్ పాయింట్స్:
కిరిటీ ఫెర్ఫార్మెన్స్, డ్యాన్స్, ఫైట్స్
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్
సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి
రవిచంద్రన్ యాక్టింగ్
ప్రొడక్షన్ వాల్యూస్
శ్రీలీల డ్యాన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్, రెగ్యులర్ కథ
మూస తరహాలో సాగే స్క్రీన్ ప్లే
పాతకాలం సెంటిమెంట్, డ్రామా
లాజిక్స్‌కు దూరంగా
కథపై హిట్ సినిమాల ప్రభావం
దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి రాసుకొన్న కథను పరిశీలిస్తే.. ఒక యంగ్ హీరో ఎంట్రీకి కావాల్సిన కమర్షియల్ హంగులను జొప్పించి.. ఫాదర్-సన్, ఫాదర్-డాటర్, బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్‌తో రెగ్యులర్, రొటీన్ డ్రామాను రాసుకొన్నాడు. డైరెక్టర్ విజన్‌ను రెట్టింపు ఎనర్జీతో కిరిటీ మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. మూస తరహాలో సాగే కథ, కథనాలను కిరిటీ తన టాలెంట్‌తో అనేక లోపాలను సవరించే పనిని సక్రమంగా చేశాడు. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ ఉండదు. రెగ్యులర్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామానే ఉంటుంది. ఫస్టాఫ్‌ను కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఎంటర్‌టైనింగ్‌గా నడిపిస్తే.. సెకండాఫ్‌లో రెగ్యులర్ సెంటిమెంట్ అంశాలతో లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో వైరల్ వయ్యారి పాట లేకపోతే.. సినిమా పరిస్థితి మరోలా ఉండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా పక్కా మాస్ ఫార్మాట్‌లో డిజైన్ చేసిన కమర్షియల్ సినిమా.
నటీనటుల విషయానికి వస్తే.. కిరిటీ అన్ని రకాలుగా అదరగొట్టారు. తాను అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. లుక్, డ్యాన్స్‌ల విషయంలో జూనియర్‌ను దించేశాడనిపిస్తుంది. కాకపోతే తెలుగు సినిమా ఫార్మాట్‌లో సాగే రొటీన్, రెగ్యులర్ కథను కూడా నిలబెట్టి తన సత్తాను చాటుకొన్నాడు. ఇక శ్రీలీల ఆటలో అరటిపండు క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథ లేకపోవడం వల్ల శ్రీలీలతో టైంపాస్ చేశారు. సెకండాఫ్‌లో జెనీలియా ఎంట్రీతో శ్రీలీల దాదాపు అదృశ్యమై ప్రీ క్లైమాక్స్‌లో వైరల్ వయ్యారిని అంటూ దర్శనమిస్తుంది. జెనీలియా రీ ఎంట్రీ అదిరిపోయింది. హుందాగా ఉండే పాత్రలో మెప్పించింది. రవిచంద్రన్ సెంటిమెంట్‌ను గుప్పించాడు. సినిమాను భావోద్వేగంగా మార్చడంలో తన వంతు పాత్రను నూటికి నూరుశాతం పోషించాడు. రావు రమేష్ మరోసారి బలమైన సపోర్టింగ్ రోల్‌లో మెప్పించారు. సత్య, వైవా హర్ష మరోసారి తమదైన కామెడీని పండించారు. అచ్యుత్ రావుతోపాటు మిగితా పాత్రల్లో నటించిన వారందరూ ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అవినాష్ కోల్లా ఆర్ట్ వర్క్, సెంథిల్ సినిమాటోగ్రఫి, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండాఫ్‌కు దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బలంగా మారింది. సినిమా ఊగిసలాటకు గురైన ప్రతీసారి తన పాటలతో జోష్ పుట్టించారు. రూరల్ ఎన్విరాన్‌మెంట్, కార్పోరేట్ ఆఫీస్, కాలేజీ వాతావరణాన్ని అవినాష్ కోల్లా చక్కగా డిజైన్ చేశారు. సెంథిల్ కుమార్ సినిమాను చాలా రిచ్‌గా ప్రజెంట్ చేశారు. వరాహి చలన చిత్ర తమ బ్యానర్ ప్రతిష్టను చూపించే విధంగా ప్రొడక్షన్ వాల్యూస్‌ను మెయింటెన్ చేశారు.
జూనియర్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రెగ్యులర్ సెంటిమెంట్‌తో సాగే ఫ్యామిలీ డ్రామా. ఒక హీరోను సినిమా రంగానికి పరిచయం చేసేందుకు పాటించే అన్ని కమర్షియల్ అంశాల్లో కిరిటీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. కథ, కథనాలు డిఫరెంట్‌గా ఉంటే ఫలితం మరో రకంగా ఉండేది. స్టోరీ విషయంలో ఎక్కువ రిస్క్ చేయకుండా రొటీన్ ఫార్మాట్‌నే నమ్ముకొన్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉంది. సెంటిమెంట్ డోస్ ఎక్కువగానే ఉంది. అంచనాలు లేకుండా వెళితే.. పైసా వసూల్.. అతిగా ఆశిస్తే.. నిరాశ తప్పదు.


Click it and Unblock the Notifications











