»   » కాలా మూవీ రివ్యూ: రజనీ మార్కు మాస్ మసాలా!

కాలా మూవీ రివ్యూ: రజనీ మార్కు మాస్ మసాలా!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kaala Movie Review కాలా మూవీ రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: రజనీకాంత్, నానా పాటేకర్, సముద్రఖని, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు
  Director: పా రంజిత్

  దశాబ్దాలుగా వెండి తెర సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఐకాన్‌గా మారారు. పాలిటిక్స్‌పై దృష్టిపెట్టిన తలైవా.. కాస్తా రూట్ మార్చి సామాజిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్‌తో రజనీ కలిసి రూపొందించిన కబాలి చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రజాదరణ పొందలేదు. ఆ సినిమా ఆశాజనకంగా ఆడకపోయినప్పటికీ.. కాలా కోసం మళ్లీ పా రంజిత్‌తో జతకట్టారు. హీరో ధనుష్ నిర్మాతగా మారారు. ముంబై మురికివాడ ధారవి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన కాలా చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  కాలా కథ ఇదే

  కరికాలుడు అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబై మురికవాడ ధారవి ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడే నేత. స్వచ్ఛ మహారాష్ట్ర స్కీం కింద ధారవిలో నివసించే ప్రజలను ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తుంటాడు హరిదాదా (నానా పాటేకర్). అందుకోసం విష్ణు సేఠ్‌ (సంపత్ రాజ్)ను ఉపయోగించుకొంటాడు. హరిదాదా వేసే ఎత్తుకు కాలా పై ఎత్తులు వేసి తన నేలను రక్షించుకొంటాడు. ఈ క్రమంలో ధారవిలో పుట్టి పెరిగిన కాలా మాజీ ప్రేయసి జరీనా ( హ్యుమా ఖురేషి) ఈ వ్యవహారంలోకి ప్రవేశిస్తుంది.

  ట్విస్టులు, సమాధానం

  ధారవి నేల కోసం పోరాడే కాలాను హరిదాదా గ్యాంగ్ ఎలాంటి సమస్యలకు గురిచేసింది? నేల కోసం తన భార్య స్వర్ణ (ఈశ్వరీరావు)ను ఎలా కోల్పోతాడు? కాలాకు జరీనా ఎలా దూరమైంది? హరిదాసు భూకాంక్షను ఎలా ఎదుర్కొన్నాడు? తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ధారవి ప్రజల్లో కాలా ఎలా స్ఫూర్తిని నిలిపాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే కాలా చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ధారవి ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసే ప్రయత్నాలను ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోవడమనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో ధారవి ప్రజలకు అండగా నిలచేందుకు కాలా పాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కాలా కుటుంబ కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. ఇక జరీనా పాత్ర ఎంట్రీతో కాలా ప్రేమ ఎపిసోడ్‌తో చకచకా ముందుకెళ్తుంది. ఇంటర్వెల్‌కు ముందు కాలాను ఎటాక్ చేసే సీన్, అలాగే ఫ్లై ఓవర్‌పై విష్ణు సేఠ్‌ను చంపే సీన్లు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. హరిదాసు క్యారెక్టర్‌కు ధీటైన సమాధానం చెప్పే సీన్‌తో ఇంటర్వెల్‌కు తెరపడుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  ధారవిని ఆక్రమించేందుకు హరిదాదా కుట్రలు, వాటిని కాలా తిప్పికొట్టే అంశాలతో రొటీన్‌గా సినిమా సాగుతుంది. విష్ణు సేఠ్ హత్యకేసు ఆరోపణలపై కాలాను పోలీస్ స్టేషన్లో పెట్టడం, హరిదాదాకు బలవంతంగా కాళ్లు పట్టించే సీన్లు జోష్ పెంచుతాయి. భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్న కాలాను హరిదాదా మనుషులు ఎటాక్ చేయడం, ఆ దాడిలో తన పెద్ద కుమారుడిని, భార్యను కోల్పోవడం ఎమోషనల్ స్థాయిని పెంచుతాయి. రెండో భాగంలో హరిదాదా ఇంటికి వెళ్లి కాలా తనదైన స్టయిల్‌లో హెచ్చరించడం భగవంతుడు అదేశించాడు.. కాలా పాటిస్తున్నాడు (ఖుదా కా హుకం.. కాలా కా కసం) అనే డైలాగ్ ప్రేక్షకుల చేత చప్పట్టు, ఈలలు పెట్టించే విధంగా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు పరమ రొటీన్‌గా సాగడం సినిమా గ్రాఫ్‌ కిందికి జారేలా చేస్తాయి.

  పా రంజిత్ డైరెక్షన్

  జీవించే వారికే నేల మీద హక్కు ఉంటుంది అనే ఓ సింగిల్ లైన్ పాయింట్‌ను చెప్పడానికి పా రంజిత్ అల్లుకొన్న కథ బాగానే అనిపిస్తుంది. రజనీకాంత్ ఇమేజ్‌కు తగినట్టుగా కథ, కథనాలు, భావోద్వేగాల అంతగా పండేలా రాసుకోకపోవడం పా రంజిత్ మేకింగ్‌లో ఓ మైనస్ పాయింట్. సామాజిక అంశం, రజనీ లాంటి హీరోను పెట్టి సినిమా రూపొందించినప్పుడు అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగిన కసరత్తు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. కబాలిలో కనిపించిన లోపాలను సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. రజనీ అంటే అందరివాడు. అన్నివర్గాలను మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించకపోవడం పా రంజిత్‌లో లోపం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. క్లైమాక్స్ సరైన రీతిలో రాసుకోకపోవడం మరో మైనస్. ఒక కాలా లేకుంటే వందలాది కాలాలు పుట్టుకొస్తారు అని విభిన్నమైన రీతిలో చెప్పే ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది.

  రజనీకాంత్ పెర్ఫార్మెన్స్

  కాలా చిత్రంలో కేవలం రజనీకాంత్ మ్యాజిక్ కనిపిస్తుంది. రజనీ స్టయిల్స్, హావభావాలు అందర్ని ఆకట్టుకొంటాయి. వర్షం ఫైట్‌లో సెట్టింగా అంటూ రజనీ చెప్పిన డైలాగ్స్, ఫ్లైఓవర్‌పై రజనీ చేత చేయించిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉంటాయి. ఇక నానా పాటేకర్, రజనీ మధ్య నువ్వా నేనా అనే విధంగా వచ్చే సీన్లు ఆకట్టుకొంటాయి. ధారవికి వచ్చిన నానాను నా పర్మిషన్ లేకుండా వెళ్లలేవు అని చెప్పే సీన్ రజనీ స్టామినాకు అద్దం పట్టింది. రజనీ తన మార్కును ఒడిసిపట్టుకొంటూనే సోషల్ మెసేజ్ అందించే చిత్రాల్లో కనిపించి మెప్పించారని చెప్పవచ్చు. కాలాలో కేవలం రజనీదే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు

  నానా పాటేకర్ యాక్టింగ్

  ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలకు దూరమైన నానా పాటేకర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ పవర్‌ఫుల్ పాత్రతో వెండితెర మీద కనిపించారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. అధికారమే పరమావధి అని విర్రవీగే పాత్రలో నానా ఒదిగిపోయాడు. రజనీకి ధీటుగా నానా పాటేకర్ హరిదాదా పాత్రలో మెరిసాడు. ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుంది.

  హ్యూమా ఖురేషి, ఈశ్వరీభాయ్

  తెలుగు తెరపై సాధారణ పాత్రలకే పరిమితమైన ఈశ్వరీరావు కాలాకు భార్యగా స్వర్ణ పాత్రలో కనిపించింది. అద్భుతమైన హావభావాలతో రజనీకి పోటాపోటీగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని అద్భుతంగా పండించడమే కాకుండా.. వినోదాన్ని కూడా పంచారు. స్వర్ణ పాత్ర ద్వారా ఓ మంచి నటి ఉందనే అభిప్రాయం కలిగేలా ఈశ్వరీరావు తనకు తాను రుజువు చేసుకొన్నారు.

  సంతోష్ నారాయణ్ సంగీతం

  కాలా చిత్రం భావోద్వేగాలు సంగమం. అయితే బలంగా చెప్పలేని సన్నివేశాలకు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. పేలవమైన కొన్ని సన్నివేశాలకు తన సంగీతంతో జీవం పోశారు. కాలాకు పాటలు పెద్ద మైనస్. ఒకట్రెండు పాటలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పాటలు ఆసక్తికరంగా ఉండి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం లభించేది.

  సినిమాటోగ్రఫీ

  కాలా చిత్రానికి మురళి సినిమాటోగ్రఫిని అందించారు. ఆసియాలోని అతిపెద్ద మురికవాడ ధారవి తీరు తెన్నులను చక్కగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీన్లు ఆకట్టుకొంటాయి. సినిమా కోసం ఉపయోగించిన కలర్ ప్యాటర్న్, స్కీమ్ బాగుందనిపిస్తుంది.

  ఎడిటింగ్, ఇతర..

  కాలా చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఫస్టాఫ్‌లో రజనీ, హ్యూమా మధ్య లవ్‌స్టోరి ఎపిసోడ్‌ను మరింత షార్ప్‌గా చేసుకొనే వీలుటుంది. ఆ ఎపిసోడ్స్‌తోపాటు కొన్ని సీన్లు చాలా లెంగ్తీగా, స్లోగా అనిపిస్తాయి. అలాంటి వాటిపై శ్రీకర్ ప్రసాద్ కత్తెర మరింత బలంగా పడి ఉంటే కొంత ఫీల్ పెరిగేదేమో అని భావన కలుగుతుంది.

  ప్రొడక్షన్ వాల్యూస్

  రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి అనువుగా రూపొందించిన చిత్రంగా కాలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్‌తో కలిసి హీరో ధనుష్ రూపొందించారు. ధారవి సెట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. విభిన్నభాష చిత్రంగా రూపొందుతున్నప్పుడు కేవలం ఊరు పేరు తెలియని తమిళ నటులతో కాలాను చుట్టేశారనిపిస్తుంది. తెలుగు భాషకు ఏ మాత్రం సరిపోని పాత్రలు కనిపిస్తాయి. కంటెంట్‌ను బలంగా ఉందని నమ్ముకోవడం వల్ల ప్రధాన పాత్రలను మినహాయించి మిగితా రోల్స్‌ను నాసిరకంగా చుట్టేశారు. సాంకేతిక విభాగాలు, నిపుణుల ఎంపిక ఫర్వాలేదనిపిస్తుంది.

  ఫైనల్‌గా

  ముంబై ధారవిలోని మురికివాడలోని నివసించే ప్రజలు తమ నేల కోసం చేసే పోరాటంగా సాగే కథతో కాలాను మలిచారు. అయితే రజనీకాంత్ ఇమేజ్‌కు భిన్నంగా కాలా రూపొందిందనే విషయాన్ని ముందు నుంచి ప్రేక్షకులు ఊహిస్తు వచ్చారు. థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత అదే బోధపడింది. రజనీ నుంచి ఆశించే కొన్ని అంశాలు లేకపోవడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశం. తలైవాను పిచ్చిగా ఆరాధించే వారికి, సామాజిక అంశాల ఆధారంగా రూపొందే చిత్రాలను ఆదరించే వారికి కాలా నచ్చుతుంది. మల్టిప్లెక్స్ ప్రేక్షకులు ఆదరిస్తే రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం ఖాయం.

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  రజనీకాంత్, నానా పాటేకర్
  హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు
  సంగీతం
  సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్స్
  ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు
  ఫస్టాఫ్ స్లో నేరేషన్
  ఊరు, పేరు లేని నటీనటులు

  తెర ముందు.. తెర వెనుక

  నటీనటులు: రజనీకాంత్, నానా పాటేకర్, సముద్రఖని, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు, షియాజి షిండే, సంపత్ రాజ్, రవి కాలే, ధనుష్ తదితరులు
  కథ, దర్శకత్వం: పా రంజిత్
  నిర్మాత: ధనుష్
  సంగీతం: సంతోష్ నారాయణ్
  సినిమాటోగ్రఫీ: మురళి జీ
  ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
  బ్యానర్: వండర్ ఫిల్మ్స్
  డిస్టిబ్యూటర్: లైకా ప్రొడక్షన్
  రిలీజ్: జూన్ 7, 2018
  నిడివి: 167 నిమిషాలు

  English summary
  In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery. Pa. Ranjith has been able to get the right balance in a tightrope walk between Rajni’s larger-than-life image and the changing taste of today’s mass multiplex audience without losing his famous touch. In short, Pa. Ranjith has given us a more peppy and upmarket Rajni that is sure to work with today’s youth audience.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more