Kaantha Movie Review: కాంత మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్, గాయత్రి, నిళగల్ రవి తదితరులు
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచేజ్ లోపేజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్
మ్యూజిక్: జాను చాంతర్
ఎడిటింగ్: లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్
బ్యానర్: స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-11-14
అయ్యా అని పిలుచుకొనే పాపులర్ డైరెక్టర్ (సముద్రఖని) తన తల్లి కథను శాంతిగా తెరకెక్కించాలనేది చిరకాలంగా ఉన్న కోరిక. ఆనాథ అయిన టీకే మహాదేవన్ అలియాస్ మహాదేవ్ (దుల్కర్ సల్మాన్)ను చేరదీసి సూపర్‌స్టార్‌ను చేస్తాడు. వారి మధ్య విభేధాలు చోటు చేసుకోవడంతో ఇద్దరి మధ్య వైరం పెరుగుతుంది. దాంతో శాంత సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత కాంతగా మళ్లీ మహాదేవ్‌తో తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తారు. కుమారి (భాగ్యశ్రీ భోర్సే) అనే అనాథను చేరదీసి కాంత చిత్రంలో హీరోయిన్‌గా చేస్తాడు అయ్యా.. అయితే కాంత సెట్లో అభిప్రాయభేదాలు మళ్లీ భగ్గుమంటాయి. అయ్యా, మహదేవ్ మధ్య ఇగోల కారణంగా కుమారి హత్యకు గురవుతుంది.

అయ్యా తల్లికి జరిగిన అన్యాయం ఏమిటి? తన తల్లి జీవిత చరిత్రను ఎందుకు సినిమాగా తీయాలని అనుకొన్నాడు? మహదేవ్‌తో అయ్యాకు ఉన్న విభేదాలు ఏమిటి? వివాదాస్పదంగా మారిన శాంత సినిమాను మళ్లీ కాంతగా ఎందుకు తెరకెక్కించాలని నిర్మాత మార్టిన్ (రవీంద్ర విజయ్) నిర్ణయం తీసుకొన్నాడు? అయ్యాకు కుమారికి ఉన్న బంధం ఏమిటి? అప్పటికే దేవీ (గాయత్రి)ని వివాహం చేసుకొన్న మహాదేవ్ మళ్లీ కుమారితో ఎలా ప్రేమలో పడ్డాడు? కుమారిని హత్య చేసింది ఎవరు? కుమారి హత్యను ఫినిక్స్ (రానా దగ్గుబాటి) ఎలా దర్యాప్తు చేశాడు? ఇంతకు కుమారిని హత్య చేసిందెవరు? ఇంతకు కాంత సినిమా పూర్తయిందా? అనే ప్రశ్నలకు సమాధానమే కాంత సినిమా కథ.
ముందుగా కాంత కథను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చాలా నిజాయితీగా రాసుకొన్న తీరును అభినందించాలి. డైరెక్టర్ అయ్యా, సూపర్ స్టార్ మహేదేవ్, నూతన హీరోయిన్ కుమారి పాత్రలను రాసుకొన్న తీరు.. వాటిని తెరపైన చూపించిన విధానం.. ఆ పాత్రల కోసం వారి నుంచి రాబట్టుకొన్న పెర్ఫార్మెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్ తర్వాత సినిమాపై పూర్తిగా పట్టు కోల్పోయాడనే చెప్పాలి. ఫినిక్స్ పాత్రలో రానా దగ్గుబాటి ఎంట్రీ తర్వాత సినిమా పూర్తిగా పట్టాలు తప్పిందా? అనే విధంగా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సహనానికి పరీక్షలా ఉంటాయి. ఇన్వెస్టిగేష్ ఎపిసోడ్ అత్యంత పేలవంగా సాగుతుంది. సినిమాలో క్యారెక్టర్లనీ పిరియాడిక్ నేచర్‌లో డైలాగ్స్ చెబుతుంటే.. రానా పాత్ర మాత్రం మాడరన్ టచ్‌తో సాగడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడేలా చివర్లో పది నిమిషాలు మంచి ఎమోషన్స్‌తో సినిమాను ముగించడం కొంత ఊరటలా ఉంటుంది. కానీ అప్పటికే ఆ సినిమా డైరెక్టర్ చేతిలో నుంచి చేజారిందనే ఫీలింగ్ కలుగుతుంది.
కాంత సినిమాను కొంత వరకు నిలబెట్టిన పాత్రల్లో దుల్కర్ సల్మాన్ ముందు వరుసలో ఉంటాడు. సినిమాలో నట చక్రవర్తి అనే బిరుదును తెరపైన తన పెర్ఫార్మెన్స్‌తో సార్థకం చేసుకొన్నాడు. ఈ సినిమాలో మహాదేవ్ పాత్రలో వన్ మ్యాన్ షోగానే ఉంటుంది. సముద్రఖనితో పోటీ పడి నటించాడు. డైరెక్టర్ పాత్రలో సముద్రఖని గంభీరమైన, హుందాతనంతొ కూడిన పాత్రను చక్కగా పోషించాడు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ భోర్సే జీవించడమే కాకుండా దుల్కర్, సముద్రఖనితో పోటీ పడి నటించింది. రానా పాత్ర ఈ సినిమాకు ఎక్కడా సింక్ కాని పాత్ర. ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ అంటే రానా క్యారెక్టరే. రవీంద్ర విజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా పర్వాలేదనిపించారు.
కాంత సినిమాకు గౌరవం కల్పించిన సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్, క్యాస్టూమ్, సౌండ్ డిజైనింగ్ విభాగాలు బ్రహ్మండమైన ప్రతిభను చూపించాయి. ప్రతీ ఫ్రేమ్‌ను డానీ సాంచేజ్ లోపేజ్ పెయింటింగ్‌లో చూపించాడు. చాలా క్లిష్టమైన కథను సన్నివేశాలను ఎడిటర్స్ లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ పద్దతిగా పేర్చారు. జేక్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నిర్మాతగా రానా దగ్గుబాటి, దుల్కర్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో తమ అభిరుచిని చాటుకొన్నారు. కథ, కథనాలను గాలికి వదిలేయకుండా కొంత జాగ్రత్తలు తీసుకొంటే ఈ సినిమా మాస్టర్ పీస్ అని చెప్పుకొనే అవకాశం ఉండేది.
కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈ పిరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. సెకండాఫ్ బోరింగ్‌తో విసుగు పుట్టిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పూర్తి మిస్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా కనిపించవు. సెకండాఫ్ అత్యంత పేలవంగా, సహనానికి పరీక్షగా సాగుతుంది. దుల్కర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. సాధారణ ఆడియెన్స్‌కు మాత్రం రుచించని వంటకంలా ఉంటుంది.


Click it and Unblock the Notifications











