Kanya kumari Movie Review: కన్యాకుమారి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ, భద్రం, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, నిర్మాత, దర్శకత్వం: సృజన్ అత్తాడ
సహ నిర్మాతలు: సతీష్ రెడ్డి చింత, వరీనియా మామిడి, అప్పల నాయుడు అత్తాడ, సిద్దార్థ్ ఏ
సమర్పణ: మధు శాలిని
మ్యూజిక్: రవి నిడమర్తి
సినిమాటోగ్రఫి: శివ గాజుల, హరిహరన్ కే
ఎడిటింగ్: నరేష్ అడుప
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
బ్యానర్: రాడికల్ పిక్చర్స్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-08-27
శ్రీకాకుళంలోని పెంటపాడు అనే గ్రామానికి చెందిన తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ) చిన్నతనంలో స్కూల్‌లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అనుకొంటే.. తను మాత్రం రైతు కావాలని కలలు కంటాడు. పాఠశాల స్థాయిలోనే చదువు వదిలేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. స్కూల్‌లో తన సహ విద్యార్థి కన్యాకుమారి (గీత్ సైనీ) అంటే తిరుపతికి చెప్పలేనంత ఇష్టం. స్కూల్ మానేసి రైతుగా మారడంతో వారిద్దరి మధ్య బంధానికి బ్రేక్ పడుతుంది. చదువుల్లో అద్బుతంగా రాణించే కన్యాకుమారి ఆశలపై తల్లిదండ్రులు నీళ్లు చల్లుతారు. ఇంజినీర్ చదువుకోవాలనే కోరికను తండ్రి కాదంటాడు. దాంతో చదువుపై ఇంట్రెస్ట్ కోల్పోయి బట్టల దుకాణంలో సేల్స్‌మేన్ అవుతుంది. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే కోరిక బలంగాను ఉంటుంది. అయితే పెద్దైన తర్వాత కన్యాకుమారితో తిరుపతి తన ప్రేమను తెలియజేస్తాడు.

తిరుపతి రైతుగా ఎందుకు కావాలనుకొన్నాడు? చిన్నతనంలో కన్యాకుమారిపై ప్రేమ ఎలా కలిగింది? కన్యాకుమారి ఆశలపై తండ్రి ఎందుకు నీళ్లు చల్లాడు? కన్యాకుమారిని తండ్రి ఇంజనీరింగ్ ఎందుకు చదివించలేకపోయాడు? డిగ్రీ పాసైన కన్యాకుమారి.. చదువులేని తిరుపతి ప్రేమను అంగీకరించిందా? కన్యాకుమారి, తిరుపతి మధ్య ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది? తిరుపతితో పెళ్లికి కన్యాకుమారి ఫ్యామిలీ ఎందుకు వ్యతిరేకించింది? కన్యాకుమారి హైదరాబాద్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడానికి ఎలాంటి త్యాగాలకు సిద్దపడింది? తిరుపతి, కన్యాకుమారి పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే కన్యాకుమారి సినిమా కథ.
శ్రీకాకుళం నేటివిటితో పూర్తిగా గ్రామీణ వాతావరణం, పల్లె అందాలు, మట్టి మనుషుల సహజ జీవన విధానం లాంటి అంశాలతో దర్శకుడు సృజన్ రాసుకొన్న పాయింట్ బాగుంది. నిజాయితీతో కూడిన కథను చెప్పాలనే అభిరుచి కూడా అంతే బాగుంది. కానీ కథను బలంగా చెప్పాలనే విషయంలో తడబాటు కనిపించింది. సింగిల్ పాయింట్ ప్రేమ కథలో వేరియేషన్స్ లేకపోవడం.. ఒకే అంశంపై కథను రకరకాలుగా సాగదీసి చెప్పడం ఈ సినిమాలో ఉండే సహజత్వాన్ని దెబ్బ తీసింది. కథలో బలమైన సన్నివేశాలు, భావోద్వేగాలు పండించే అంశాలు బలంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయనిపిస్తుంది. బలహీనమైన స్క్రీన్ ప్లే, స్క్రిప్టును నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.
పుష్పక విమానం సినిమాలో నటనతో ఆకట్టుకొన్న గీత్ సైనీ మరోసారి కన్యాకుమారిగా మంచి పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. గ్రామీణ ప్రాంత యువతిగా, గొప్ప చదువులు, మంచి ఉద్యోగం చేయాలనే పట్టుదల ఉన్న అమ్మాయిగా బాగా నటించింది. అలాగే ప్రేమ, కెరీర్, కుటుంబం మధ్య నలిగిపోయే మహిళగా తన నటనతో మెప్పించింది. ఇక తిరుపతిగా శ్రీ చరణ కూడా గీత్ సైనీతో పోటీ పడి నటించాడు. కొత్తవాడిననే ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా.. ఆడియెన్‌కు కలిగించకుండా పాత్రలో ఒదిగిపోయాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శివ గాజుల, హరిహరన్ కే సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రవి నిడమర్తి సంగీతం బాగుంది. నరేష్ అడుప ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. కనీసం 10 నుంచి 15 నిమిషాల నిడివి తగ్గిస్తే..ఇంకా బెటర్ అవుట్ ఉండేది. సృజన్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన మార్కు చాటుకొన్నాడు. రూరల్ డ్రామాలు, నిజాయితీతో, ఆర్గానిక్ ఫ్యామిలీ స్టోరీలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓసారి ఈ సినిమాపై థియేటర్‌లో లుక్కేయండి.


Click it and Unblock the Notifications











