Keedaa Cola Review కడుపుబ్బా నవ్వించే కామెడీ.. తరుణ్ భాస్కర్ మ్యాజిక్.. కీడా కోలా సమీక్ష
నటీనటులు: బ్రహ్మనందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రఘురామ్, విష్ణు, జీవన్ కుమార్, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్ తదితరులు
నిర్మాతలు: సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి:ఏజే ఆరోన్
ఎడిటింగ్: ఉపేంద్ర వర్మ
ఆర్ట్: ఆశీష్ తేజ పులాల
రిలీజ్ డేట్: 2023-11-03
మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవించి జైలు నుంచి విడుదలైన నాయుడు (తరుణ్ భాస్కర్ ) సోదరుడు జీవన్ నాయుడు (జీవన్)కు కార్పోరేటర్ కావాలనేది జీవిత ధ్యేయం. తన సోదరుడి సాయంతో కార్పోరేటర్ కావాలనుకొంటాడు. అందుకు కావాల్సిన కోటి రూపాయల కోసం కీడా కోలాలో బొద్దింకను వేస్తారు. ఇదిలా ఉండగా.. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వాస్తు (చైతన్య రావు) తన తాత వరదరాజు పర్యవేక్షణలో పెరుగుతాడు. ఓ కేసులో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న వాస్తు కీడా కోలా డ్రింకులో వచ్చిన బొద్దింకను బూచీగా చూపి తన స్నేహితుడైన లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్) కలిసి యజమానిని బ్లాక్ మెయిల్ చేయాలనుకొంటారు.
ప్రమాదంలో దివ్యాంగుడిగా మారిన వాస్తు ఎలాంటి కోర్టు కేసును ఎదుర్కొన్నాడు? కోర్టు తీర్పు ప్రకారం కోటి రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కీడా కోలా యజమానిని బ్లాక్ మెయిల్ చేయాలని ఎలాంటి ప్లాన్ వేశారు? జైలు నుంచి విడుదలైన నాయుడు, జీవన్‌కు వాస్తు, లాయర్ కౌశిక్‌కు ఉన్న లింక్ ఏమిటి? నాయుడు, వాస్తు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకొన్నాయి? జీవన్ కార్పోరేటర్ అయ్యాడా? వాస్తుకు కోటి రూపాయలు లభించాయా? అనే ప్రశ్నలకు సమాధానమే కీడా కోలా సినిమా కథ.

కీడా కోలా పూర్తిగా ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రంలో పాత్రలను, కథను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఫస్టాఫ్ ముగిసిపోతుంది. దాంతో సినిమాలో విషయం లేదా? అనే అనుమానం కలుగుతుంది. కాకపోతే ఫన్‌తో కూడిన జర్నీ కొంత ఫర్వాలేదనే ఫీలింగ్ కలుగజేస్తుంది. జీవన్, నాయుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరి, కార్పోరేటర్‌తో జీవన్‌కు ఉన్న వివాదాన్ని వినోదాత్మకంగా మార్చడంతో కథ సరదాగా సాగిపోతుంది. ఇక వరదరాజు, వాస్తు క్యారెక్టర్లు పూర్తిగా ఫన్‌గా డిజైన్ చేయడంతో హాయిగా సాగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. జీవన్, విష్ణు, నాయుడు కాంబినేషన్ ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు అదిరిపోయాయి.
కీడా కోలా సినిమా ఫస్టాఫ్ సాదాసీదాగా సాగడంతో.. సెకండాఫ్‌పై అంచనాలు పెట్టుకొన్న ప్రేక్షకులకు తరుణ్ భాస్కర్ తన మార్కు మ్యాజిక్‌తో కథను వేగంగా పరుగులు పెట్టిస్తూ..ప్రతీ సన్నివేశాన్ని హాస్యాన్ని దట్టించి నవ్వులు పువ్వులు పండించారు. సినిమా ద్వితీయార్ధం కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. వాస్తు బిజినెస్ చేసే బొమ్మతో నాయుడు ప్రేమలో పడటం కామెడీతో ఆలరిస్తుంది. రవీంద్ర విజయ్‌తో సన్నివేశాలు సినిమాకు ట్విస్టుగా మారుతాయి. అలాగే గెటప్ సీన్ ఎపిసోడ్ ఫన్‌తో అలరిస్తుంది. క్లైమాక్స్‌లో యాక్షన్, కామెడీ మిక్స్ చేసి చేసిన హంగామా సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలతో హాస్య బ్రహ్మగా మారిన బ్రహ్మానందం ఈ మూవీలో వరదరాజుగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో తనదైన శైలిలో నవించాడు. ఇక చైతన్య రావు వాస్తుగా డిఫరెంట్‌గా కనిపించడంతోపాటు ఫెర్ఫార్మర్‌గా మెప్పించాడు. కౌశిక్‌గా రాగ్ మయూర్, షాట్స్‌గా రఘురామ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తరుణ్ భాస్కర్ ఆల్ రౌండ్ ప్రతిభతో మెప్పించాడు. కామెడీ, యాక్షన్ సీన్లలో నటుడిగా బెస్ట్ ఫెర్ఫార్మ్ చేశారు. జీవన్ కామెడీ ట్రాక్ హిలేరియస్‌గా ఉండటంతోపాటు సినిమాకు వెన్నెముకగా నిలిచాడు. ప్రతీ పాత్ర మంచి నటనతో ఆకట్టుకొన్నది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను హిలేరియస్‌గా మార్చడంతోపాటు ఎలివేట్ చేశాయి. అరోన్ సినిమాటోగ్రఫి, ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. తరుణ్ భాస్కర్ తన ఫాలోవర్స్, అభిమానుల అభిరుచికి అనుగుణంగా కథను అందించిన తీరు అభినందించాల్సిందే.
ఫన్, యాక్షన్, సెటైరికల్ కామెడీతో రూపొందిన చిత్రం కీడా కోలా. ప్రతీ సన్నివేశంలోని వినోదం పండటంతో నాన్‌స్టాప్ లాఫింగ్‌తో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందిస్తుంది. తెలుగులో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. తరుణ్ భాస్కర్ విజన్, మేకింగ్ ఈ సినిమాకు బలంగా మారాయి. నటీనటులు యాక్టింగ్, బ్రహ్మనందం కామెడీ సినిమాకు మరింత ఆకర్షణీయంగా మారింది. పక్కా వినోదాన్ని ఆశించే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి వినోదాన్ని ఆస్వాదించడం గ్యారెంటీ.


Click it and Unblock the Notifications











