Kodama Simham 4K Review and Rating: కొదమ సింహం రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: చిరంజీవి, సోనమ్, రాధ, వాణి విశ్వనాథ్, ప్రాణ్ చోప్రా, మోహన్ బాబు, కన్నడ ప్రభాకర్, సుధాకర్, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య, బ్రహ్మనందం, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, వై విజయ తదితరులు
దర్శకత్వం: కే మురళీ మోహన్ రావు
నిర్మాత: కైకాల నాగేశ్వరరావు
మ్యూజిక్: రాజ్ కోటి
సినిమాటోగ్రఫి: కేఎస్ హరి
ఎడిటింగ్: నాగేశ్వరరావు, సత్యనారాయణ
బ్యానర్: రమా ఫిలింస్
రిలీజ్ డేట్: 1990-08-09
రీ రిలీజ్ డేట్: 2025-11-21
బ్రిటీష్ పాలన కాలంలో గజపతి సోదరులు (కన్నడ ప్రభాకర్, సుధాకర్, ప్రసాద్ బాబు), సుడిగాలి (మోహన్ బాబు) సాగించే అరాచకాలు, అన్యాయాలను ఎదురించే యువకుడు భరత్ (చిరంజీవి). గ్యాంబ్లింగ్, అమ్మాయిల అక్రమ రవాణా, వేశ్యవృత్తిని అడ్డుకొని గజపతి, సుడిగాలి ముఠాపై దెబ్బ కొడుతాడు. ఈ క్రమంలో భరత్‌పై పగ తీర్చుకొనేందుకు ఆయన తల్లిదండ్రులు (గొల్లపూడి మారుతిరావు, అన్నపూర్ణ) కాల్చి చంపుతారు. అయితే తన తల్లిదండ్రులుగా భావిస్తున్న వారు పెంపుడు తల్లిదండ్రులని.. తనకు జన్మనిచ్చిన వేరే ఉన్నారనే విషయం తెలుస్తుంది. తన తండ్రి ధర్మదేవ్ (సత్యనారాయణ) దేశద్రోహిగా ముద్రపడి అజాతంలో ఉండటం, తన తల్లి చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని భరత్‌కు తెలుస్తుంది.

గజపతి సోదరుల అరాచకాలను భరత్ ఎలా అడ్డుకొన్నాడు? సుడిగాలి వ్యవహారం ఎలా సాగింది. ధర్మదేవ్ అజాతంలో ఎందుకు ఉన్నారు? భరత్ తల్లిని ఎందుకు జైలులో పెట్టి శిక్షించారు? నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం విషయంలో మేయర్ (ప్రాణ్ చోప్రా), సుడిగాలి చేసిన కుట్ర ఏమిటి? కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తిరిగి తీసుకు రావడానికి, తన తల్లిదండ్రులపై పడిన నేరాలను తప్పు అని నిరూపించడానికి భరత్ ఎలాంటి సాహసం చేశాడు? బిజిలీ (రాధ), మేయర్ కూతురు (సోనమ్)తో భరత్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? చివరకు కోహినూర్ వజ్రాన్ని భరత్ వెనక్కి తీసుకొచ్చాడా? తల్లిదండ్రులపై పడిన మచ్చను భరత్ తుడిపేశాడా? అనేది సినిమా కథ.
సుప్రీం హీరో చిరంజీవి కెరీర్‌లో చేయనటువంటి పాత్రను చేయించాలని రమా ఫిలింస్ బ్యానర్ చేసిన ప్రయత్నాలకు కే మురళీమోహన్ రావు స్పందించి.. కౌబాయ్ చిత్రాన్ని చేయాలని నిర్ణయించారు. పక్కా ప్లానింగ్‌తో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేవలం 96 రోజుల్లో 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను విజయవంతంగా తెరకెక్కించారు. ఈ కథలో తల్లిదండ్రులు సెంటిమెంట్, కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం అంశాలను ప్రధానంగా చేసుకొని రమా ఫిలింస్ సిద్దం చేసిన కథను దర్శకుడు హాలీవుడ్ ప్రమాణాలకు తీసిపోని విధంగా చిత్రీకరించారు. కథలోకి తెచ్చిన పాత్రలు, వాటికి నటీనటులు ఎంపిక ఈ సినిమాను విజయం వైపు నడిపించేలా చేశాయి.
ఇక చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్, భరత్ పాత్రకు సంబంధించిన లుక్స్, యాటిట్యుడ్, స్టైల్ అన్నీ చక్కగా కుదిరాయి. అన్ని రకాలుగా మెగాస్టార్ తన విశ్వరూపం చూపించారు. ఇక మోహన్ బాబు సుడిగాలిగా విలనిజం, కామెడీ, ఫన్ క్రియేట్ చేసి తాను ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించారు. బాలీవుడ్ నటి సోనమ్, రాధ, వాణి విశ్వనాథ్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. ప్రాణ్, కన్నడ ప్రభాకర్ పక్కాగా విలనిజాన్ని పండించారు. కైకాల సత్యనారాయణ ఓ ఎమోషనల్ పాత్రలో గుర్తుండిపోయేలా నటించారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచారు.
కొదమ సింహం సినిమాకు సత్యానంద్ రాసిన మాటలు, పరుచూరి బ్రదర్స్ వేసిన స్క్రీన్ ప్లే, హరి సినిమాటోగ్రఫి రిచ్‌నెస్‌ను తెచ్చి పెట్టడమే కాకుండా కౌబాయ్ జోనర్‌లో క్లాసిక్‌గా మలిచాయి ఇక ఈ సినిమా సక్సెస్‌లో రాజ్ కోటి సంగీత ద్వయం అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్రను పోషించాయి. కే నాగేశ్వరరావు అనుసరించిన నిర్మాణ విలువలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. ఇలాంటి చిత్రాన్ని 4K, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో నేటి తరం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు చేసిన ప్రయత్నం భేషుగ్గా ఉంది.
కొదమ సింహం సినిమాకు సంబంధించిన మాస్టర్ నెగిటివ్‌ను రమా ఫిలింస్ జాగ్రత్తగా భద్ర పరచడం వల్ల.. ఈ సినిమా క్వాలిటీ తెరపైన బ్రహ్మండంగా కనిపించింది. ఈ సినిమా కొత్తగా తీశారా? అనేంతగా విజువల్స్ క్లారిటీగా ఉండటంతో సన్నివేశాలు, పాటలకు స్క్రీన్ పై బ్రహ్మండమైన ఫీల్, జోష్ కలిగింది. డైలాగ్స్‌లో క్లారిటీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అంశాలు నేటి తరం ప్రేక్షకుల టేస్ట్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా చక్కగా మాస్టరింగ్ చేశారు. ఇటీవల కాలంలో వచ్చిన రీ రీలీజ్ సినిమాల్లో మంచి క్వాలిటీ, కంటెంట్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తరం వారు మరోసారి ఈ సినిమాతో ఉన్న తమ అనుభవాలను నెమరు వేసుకోవడానికి, ఈ తరం ఆడియెన్స్ చిరంజీవి మ్యాజిక్ మూమెంట్స్‌ను పొందేలా ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. కౌబాయ్ జోనర్ చిత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ వారం చూసే సినిమాలో జాబితాలో కొదమ సింహాన్ని నిస్సందేహంగా చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications











