కొడుకు-సమీక్ష

చిత్రం: కొడుకు
నటీనటులు: విక్రమ్, ఆదితి అగర్వాల్, మోనిక,
ప్రకాష్‌రాజ్, పొన్నాంబళం, రాజన్.పి.దేవ్, తదితరులు
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత: తాడి తాతారావు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎమ్మెస్ నారయణ
ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారయణ తన 'కొడుకు' విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, తను దర్శకుడుగా పరిచయం అయ్యాడు ఈ చిత్రం ద్వారా. ఎమ్మెస్ నారయణ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. దాన్ని అలాగే కంటిన్యూ చేయకుండా తెలుగు ప్రేక్షకులను హింసించాలని కాబోలు, రూపం, అభినయం ఇసుమంత లేని తన కుమారుడిని హీరోగా పరిచయం చేశాడు. పోనీ దర్శకుడిగా ఏమైనా బాగా తీశాడు అంటే అదీ ఇంకా అధ్వాన్నం. హీరో విక్రమ్ రూపం మన కంటికే కాదు, కెమెరా కన్నుకీ ఏ మాత్రం అందంగా చిక్కదు. నేలకి చూపులు వేసి డైలాగ్‌లు చెప్పిన విక్రమ్ ... ఒక సందర్భంలో హీరోయిన్ అదితి అగర్వాల్..' ఏమోయ్..' అని పలకరిస్తుంది. దానికి ఆయన తొలినాళ్ళల్లో సూపర్‌స్టార్ కృష్ణ మాదిరిగా..' ఏయ్..' అంటూ డైలాగ్‌లు పేలగా చెప్పడంతో థియేటర్లో అందరూ గొల్లున నవ్వుతారు. అదీ హీరో గురించిన సంగతి.
ఇక కథ అంటారా. మల్లయుద్దం పోటీ పందెంలో తన కూతురిని పోగొట్టుకోవడమే కాకుండా, నడ్డి కూడా విరగ్గొట్టుకున్న సుమన్ పదేళ్ళు ఊరి విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదీ సినిమా ప్రారంభం. పదేళ్ళ తర్వాత ఆయన కొడుకు (విక్రమ్) తన తండ్రి నడుం విరగ్గొట్టిన వాడిని (పొన్నాంబళం), విరగ్గొట్టించిన వాడిని(రాజన్.పి.దేవ్)ని చంపడం క్లైమాక్స్. సో..మధ్యలో ఉన్న రెండు గంటలు..విక్రమ్‌ను హీరోయిన్లు (ఆదితి అగర్వాల్, మోనికా) ప్రేమించుకొని పాటలు పాడుకునే సీన్లు, ప్రకాష్‌రాజ్‌తో రామాయణ, భారతాల్లోని పిచ్చి, పిచ్చి కథలు చెప్పించే డైలాగ్స్‌తోనూ దర్శకుడు ఎమ్మెస్ నారయణ సినిమా నడిపిస్తాడు.
మధ్యమధ్యలో సునీల్ రిక్షా జోకులు (రెండు సార్లు). కాలేజ్‌లో పూలు తెంపిన వాడికి బ్రహ్మనందం ఫైన్ వేస్తాడు, దానికి వేణుమాధవ్ ఏడ్పులు(ఇవీ జోకులుగా ఎమ్మెస్ కమెడియన్ చిత్రీకరించాడు. మనకి మాత్రం నవ్వు వస్తే ఒట్టే.
ఆదితి అగర్వాల్ మగవాడికి ఆడవేషం వేసినట్లుగా కన్పిస్తే, మోనికా కాలు విరిగినా సినిమా ఆసాంతం టకటకా నడుస్తూ నటించేసింది. అదీ వారి నటనాప్రతిభ. పొన్నాంబళం పాత్ర జుగుప్సాకరంగా ఉంది.గతంలో రచయితగా ఫెయిలైన ఎమ్మెస్ తన 'దర్శకత్వ ప్రతిభ ఇది' అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. వందేమాతరం శ్రీనివాస్ సమకూర్చిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. కానీ అందులో ఒక పాట పాత హిందీ పాటకు మక్కీకిమక్కీ కాపీ.


Click it and Unblock the Notifications











