పసలేని కౌరవుడు

నటీనటులు: నాగబాబు, రమ్యకృష్ణ, ఎం.ఎస్.నారయణ
మాటలు: చింతపల్లి రమణ
నిర్మాత: శ్రీమతి కె.పద్మజ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్
దర్శకత్వం: జ్వోతికుమార్
చిరంజీవి సోదరుడు నాగబాబు సమర్పించిన చిత్రం ఇది. ఇందులో ఓ పాట ఉంటుంది- అంతా నా ఇష్టం... అంతా నా ఇష్టం... ఎడాపెడా ఏంచేసినా...అడెగేదెవడ్రా ఇష్టం అని. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులకు ఈ పాట చాలా సజెస్టివ్ థాట్ తో పెట్టినట్టుగా అనిపిస్తుంది. కౌరవుడు(నాగబాబు) మొరటోడుగా ప్రవర్తించే ఊరిపెద్ద. ఆడవాళ్ళను, గుళ్ళో అమ్మవారిని ద్వేషించడం....తన వాళ్ల మీద కూడా కనికరం లేకపోవడం....వంటి పైత్యపు పనులు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే...ఆయన గారి భార్య చీకటి వ్యవహారం, తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అతనికి చేయి ఇవ్వడం కారణం. దానాలు చేసినా ఆయనే చేయాలి....దండించినా ఆయనే దండించాలి.
ఈ వ్యవహారంలో అనుకోకుండా ఇరుక్కుంటుందో టీచరమ్మ(రమ్యకృష్ణ). పిల్లలకు పాఠాలు చెప్పే స్కూలు పడిపోయేలా ఉందని, ఊరి పెద్దగా దాని రిపేర్లు విషయం చూడమని కౌరవుడికి చెప్పి భంగపడుతుంది. చివరికి గాలీవాన వచ్చిన ఓరోజున ఆ స్కూల్ పడిపోవడం, అందులో ఊరి వాళ్ళ పిల్లలతో పాటు కౌరవుడి పిల్లాడు కూడా దెబ్బలు తినడం....అయితే ఓ దూలం ఆ పిల్లాడి మీద పడుతుంటే టీచరమ్మ అడ్డం పడి బిడ్డను కాపాడటంతో కౌరవుడిలో కాస్త కనికరం మొదలవుతుంది. కౌరవుడి మనసులోని మంచితనం మేల్కొంటుంది. దీనికి పోటీగా తన చెల్లెలును పంచాయతీలో అవమానించాడని కౌరవుడి మీద కక్ష కట్టిన రామరాజు ఊరిలోని అయిదుగురు కుర్రాళ్ళను చేరదీసి కౌరవుడి పరువును పంచాయతీలోనే తీయాలని చూస్తాడు.
టీచరమ్మ దగ్గర 'మంచి' పాఠాలను నేర్చుకున్న కౌరవుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈలోగా టీచరమ్మ ప్రేమికుడు ఊళ్ళోకి దిగుతాడు. మొరటుగా తన మనస్సులోని ప్రేమను టీచరమ్మకు చెప్పి అవమానం పాలైన కౌరవుడు ఆమెకు క్షమాపణ చెప్పడంకోసం వాళ్ల ఇంటికి వెళ్ళడం.. అక్కడ జరిగే నాటకీయ సంఘటనల కారణంగా కౌరవుడు మర్నాడు పంచాయతీలో దోషిగా నిలబడటం... ఊర్లోని పెద్దలు అతనికి గుండు గీయించడం జరిగిపోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో టీచరమ్మ ప్రేమికుడి మనసులో అనుమాన బీజం మొలకెత్తుతుంది. అక్కడ నుండి ఆమె ట్రాన్స్‌ఫర్ చేయించుకుని సిటీకి వచ్చేస్తుంది.
విలన్స్‌తో గొడవ పడుతుండగా కౌరవుడి కొడుకును ఎద్దు కుమ్మేస్తుంది. హాస్పటల్‌లో చేరిన ఆ పిల్లాడు టీచరమ్మను చూడాలని కలవరిస్తుంటాడు.... ఆఖరి క్షణాల్లో వున్న ఆ పిల్లాడికి టీచరమ్మే ప్రాణదానం చేయగలదంటాడు డాక్టర్.... కౌరవుడు మనసు చంపుకుని సిటీకి వెళ్ళి టీచర్‌ను తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకోవడం, ఆవిడ తిరస్కరించడం....ఈలోగా తండ్రి చెప్పిన కొన్ని పాతవిషయాలతో పశ్చాత్తాపానికి గురై పిల్లాడ్ని చూడడానికి బయలుదేరడం జరుగుతాయి. చివరకు ప్రేమించిన ప్రియుడ్ని కాదని ఆమె కౌరవుడి కొడుకు దగ్గరకు వెళ్లి నీకు నేను అమ్మని అని చెప్పడంతో కథ సుఖాంతం (ప్రేక్షకులకు కూడా) అవుతుంది.
ఏమాత్రం పసలేని ఈ కథను నాగబాబు తెరకెక్కించాలనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 80వ దశకంలో రావాల్సిన కథను ఈ కొత్త శతాబ్దంలో ఆయన తీశాడేమిటా అనే సందేహం కూడా వస్తుంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నాగబాబు, ఎమ్మెస్ నారాయణ మధ్య సాగిన కామెడీ ట్రాక్. సెంటిమెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమాలో అతి పెద్ద రిలీఫ్ అదే. అదేవిధంగా రమ్యకృష్ణ నటన మహిళలను ఆకట్టుకునేలా సాగింది. మణిశర్మ సంగీతం, మోహన్‌చంద్ కెమెరా పనితనం బాగున్నాయి. నాగబాబు నటనలో మంచి పరిణతి కనిపించింది. తొలి ప్రయత్నమే అయినా దర్శకుడు జ్యోతికుమార్ కథను చక్కగా హ్యాండిల్ చేశాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడం కష్టమేమో కానీ మాస్ ప్రేక్షకుల్ని మాత్రం ఈ చిత్రం నిరాశపరచదని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











