Kushi Movie Review క్లీన్ రొమాంటిక్ కామెడీగా ఖుషి.. విజయ్ దేవర కొండ, సమంత కెమిస్ట్రీ ఎలా ఉందంటే?
Ranting: 3/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు, సచిన్ ఖేడ్కర్, శరణ్య, మురళీ శర్మ, లక్ష్మీ, రోహిణి, వెన్నెల కిషోర్, జయరాం, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యాంగర్, భరత్ రెడ్డి తదితరులు
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్
సినిమాటోగ్రఫి: మురళి జీ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వహబ్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిడివి: 165 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-09-01
విప్లవ్ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఇష్టమైన కశ్మీర్‌లో కోరి ఉద్యోగంలో చేరుతాడు. కశ్మీర్‌లో ముస్లిం యువతిగా కనిపించిన ఆరాధ్య (సమంత)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆరాధ్య స్నేహితురాలు (శరణ్య) చెప్పిన ఓ అబద్దాన్ని నిజమని నమ్మి ఫిరోజ్ అనే అబ్బాయి కోసం వెతుకుతూ ఆరాధ్య మనసు గెలుచుకొంటాడు. అయితే వారి ప్రేమకు విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్), ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాసరావు పట్టింపులు, సంప్రదాయాలు అడ్డంకిగా నిలుస్తాయి. దాంతో ఇద్దరు తమ తండ్రులను మనోభావాలను ఎదురించి రిజిస్టర్ వివాహం చేసుకొంటారు.
తల్లిదండ్రుల మాటను ఎదురించి వివాహం చేసుకొన్న విప్లవ్, ఆరాధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది? వారి మధ్య మనస్పర్ధలకు ప్రధాన కారణం ఏమిటి? సంప్రదాయాలను, ఆచారాలను పాటించకపోతే విప్లవ్, ఆరాధ్య కాపురం కూలిపోతుందని చెప్పిన చదరంగం శ్రీనివాసరావు మాట నిజమైందా? విప్లవ్, ఆరాధ్య దాంపత్యంలో ఏర్పడిన విభేదాలకు కారణం ఏమిటి? కొడుకు కోసం లెనిన్ సత్యం తన సిద్దాంతాన్ని వదిలి మెట్టు దిగాడా? కూతురు కోసం చదరంగ శ్రీనివాసరావు తన పంతాన్ని, సంప్రదాయాలను పక్కన పెట్టి ఓటమిని అంగీకరించారు. ఈ పంతాలు, పట్టింపులు మధ్య ఆరాధ్య, విప్లవ్ కాపురం ఎలా నలిగిపోయింది. ఇద్దరు తండ్రుల మధ్య అధిపత్య పోరులో ఎవరిది విజయం అనే ప్రశ్నకు సమాధానమే ఖుషి సినిమా కథ.

నాస్తికత్వం, ఆస్తికత్వం మధ్య అధిపత్యం పాయింట్ అధారంగా ఖుషి సినిమా ఆలోచించే విధంగా ప్రారంభమవుతుంది. కథను అలా ప్రారంభించడంతోపాటు విప్లవ్ జర్నీని కశ్మీర్‌కు చేర్చి ఫుల్లుగా వినోదం పంచేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. ఫస్టాఫ్‌లో అల్లుకొన్న సన్నివేశాలు ఫన్‌తో జోష్‌తో కొనసాగుతాయి. విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో సన్నివేశాలు వర్కవుట్ కావడంతో కథ చాలా తేలికగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇక విప్లవ్, ఆరాధ్య పెళ్లి ఎపిసోడ్ మొదలు కావడంతో ఎమోషన్స్ సన్నివేశాల్లో బాగా పండినట్టు కనిపిస్తాయి. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ మధ్య సన్నివేశాలు కథకు బలంగా మారాయని చెప్పవచ్చు. తొలి భాగం మంచి పాటలు, హాస్యంతో నెట్టుకురావడంతో ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం కనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో విప్లవ్, ఆరాధ్య మధ్య గిల్లి కజ్జాలు, రొమాన్స్ తదితర అంశాలతో సాఫీగా సాగిపోతుంది. కానీ కథనంలో వేగం లేకపోవడం, కథలో బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం ఓ పాయింట్ చుట్టూ సాగదీసినట్టు అనిపిస్తుంది. జోయా (రోహిణి), థామస్ (జయరాం) ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ కథకు బలంగా మారలేకపోయింది. అప్పటికే కథ ముందుకు సాగపోలేదనే ఫీలింగ్‌తో ఉన్న సమయంలో బార్ ఎపిసోడ్, అందులో పాట మరింత నసపెట్టినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రీ క్లైమాక్స్ నుంచి విజయ్ దేవరకొండ, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ మధ్య సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. అత్యంత వివాదాస్పదంగా అనిపించే పాయింట్‌కు ఎలా ముగింపు ఇస్తారనే విషయం కోసం ఎదురు చూసిన నేపథ్యంలో డైరెక్టర్ ఎత్తుకొన్న పాయింట్ కథకు కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, సమంత గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కామెడీ టైమింగ్, రొమాంటిక్ మూమెంట్స్, యాక్షన్, డ్యాన్సులకు స్కోప్ ఉన్న విప్లవ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో యూత్‌ను ఆకట్టుకొనే విధంగా హ్యుమర్‌తో డీల్ చేయగా.. సెకండాఫ్‌లో ఎమోషనల్ ఫెర్ఫార్మెన్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సమంతతో ఉన్న రొమాంటిక్ సీన్లలో ఇద్దరి కెమిస్ట్రీ బాగుందనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో జోష్, ఎమోషనల్ అంశాలతో సమంత ఆకట్టుకొంటే.. కీలకమైన క్లైమాక్స్‌లో క్యారెక్టర్ పరంగా డల్‌గా కనిపిస్తుంది. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్ మరోసారి తమ పాత్రలతో డిసెంట్‌గా కనిపించారు. లక్ష్మీ, శరణ్య పొనువన్నన్ తమ పాత్రలతో ఆకట్టుకొన్నారు. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, చివర్లో బ్రహ్మనందం సినిమా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. రోహిణి, జయరాం కథకు మరింత బలంగా మారారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఖుషి సినిమాకు అత్యంత బలం మ్యూజిక్, పాటలు. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కేరళ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సన్నివేశాలకు మ్యూజిక్ మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చింది. మురళీ జీ సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. కశ్మీర్, కేరళ ఎపిసోడ్స్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. ఎడిటింగ్ ఈ సినిమాకు మైనస్ అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ కథలోనే ఎమోషన్స్ తగ్గించాయనే ఫీలింగ్ కలుగుతుంది. మైత్రీ మూవీస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక మైత్రీకి సినిమాపై ఉన్న అభిరుచిన తెలియజేస్తుంది.
ఖుషి మూవీ.. నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు మధ్య జరిగే మానసిక సంఘర్ణణ. సైన్స్, సంప్రదాయాలు, జాతకాలు, ముహుర్తాలకు మధ్య జరిగే వితండవాదానికి ప్రేమ కథను జోడించి ఫుల్లుగా వినోదాన్ని పంచే చిత్రంగా చూడొచ్చు. ఈ సినిమాకు లెంగ్త్ ప్రధానమైన సమస్య. సెకండాఫ్‌లో సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ లోపాన్ని ఎమోషనల్ క్లైమాక్స్‌తో సరిదిద్దడంతో చివరకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమ కథ, ఫ్యామిలీ వ్యాల్యూస్ అంశాలతో తెరకెక్కే సినిమాలను ఇష్టపడేవారికి ఖుషి నచ్చుతుంది. ఫైనల్‌గా ఖుషి క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఫ్యామిలీ ఆడియెన్స్ పుష్కలంగా ఎంజాయ్ చేసే విషయాలు చాలానే ఉన్నాయి. కాబట్టి థియేటర్‌లో ఫీల్ గుడ్ చిత్రం చూడాలనుకొనే వారికి ఖుషి కేరాఫ్ అడ్రస్.


Click it and Unblock the Notifications











