Laggam Review: లగ్గం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, వడ్లమాని శ్రీనివాస్, రఘుబాబు, సప్తగిరి, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, కృష్ణుడు, రచ్చ రవి, ప్రభావతి, చిత్రం శ్రీను తదితరులు
రచన,దర్శకత్వం: రమేష్ చెప్పాల
నిర్మాత: టీ వేణుగోపాల్ రెడ్డి
మ్యూజిక్: మణిశర్మ, చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫి: బాల్ రెడ్డి
ఎడిటింగ్: నాగేశ్వర రెడ్డి బొంతల
బ్యానర్: సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-10-25
సదానందం అలియాస్ సదా (రాజేంద్రప్రసాద్) మేనల్లుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైతన్య (సాయి రోనక్)కు తన కూతురు మానస (ప్రగ్యా నగ్రా)కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొంటాడు. సదా ప్రపోజల్‌కు చైతన్య తల్లిదండ్రులు (రోహిణి, శ్రీనివాస్ వడ్లమాని) కూడా సంతోషంగా ఒప్పుకొంటారు. పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు కలుస్తాయని ఆనందపడిపోతారు. అయితే తీరా పెళ్లి పీటల మీదకు వచ్చేసరికి లగ్గం ఆగిపోతుంది.

మేనబావను పెళ్లి చేసుకోవడానికి మానస ఎందుకు అయిష్టంగా ఉంది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటే సదానందం ఎందుకంత ఇష్టం? ఇష్టపడి మేనల్లుడికి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకొన్న సదానందమే వివాహాన్ని ఎందుకు చెడగొట్టాలని అనుకొన్నాడు? మామకు, మానసకు తెలియకుండా చైతన్య కూడా తన పెళ్లిని ఆపు చేసేందుకు ఎందుకు నాటకం ఆడారు? పెళ్లి విషయంలో సదా, మానస, చైతన్య ఎందుకు అయిష్టతను ప్రదర్శించారు? చివరకు మానస, చైతన్య పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లగ్గం సినిమా కథ.
తెలుగు సినిమా తెర మీద పెళ్లి కథతో చాలా సినిమాలే వచ్చాయి. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో సినిమాను ఆవిష్కరించారు. అయితే తెలంగాణలో జరిగే పెళ్లిలో ఆచారాలు, సంప్రదాయాలపై పూర్తిస్థాయిలో సినిమాను తెరకెక్కించలేదు. కానీ దర్శకుడు రమేష్ చెప్పాల రాసుకొన్న లగ్గం కథలో చాలా ఎమోషన్స్ కనిపిస్తాయి. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసేందుకు కొంత సమయం తీసుకొన్నప్పటికీ.. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల ముందు స్టోరీ టేకాఫ్ భావోద్వేగంగా సాగడంతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో రెండు కుటుంబాల మధ్య పంతాలు, పట్టింపులు మంచి ఎమోషన్స్ పండించాయి. క్లైమాక్స్‌లో పెళ్లి కూతురు అప్పగింత ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అనిపిస్తుంది. దర్శకుడు రమేష్ చెప్పాల కథను తెరమీద ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది.
ఇక చైతన్యగా సాయి రోనక్, మానసగా ప్రగ్యా నగ్రా క్యారెక్టర్ల పరంగా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్ చూపించారు. వారి వారి పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. సదానందంగా రాజేంద్ర ప్రసాద్ సినిమా భారాన్ని పూర్తిగా మోశారు. రోహిణి, శ్రీనివాస్ కథకు బలంగా కనిపించారు. బర్రెలన్నగా రచ్చ రవి, చమ్మక్ చంద్ర ఎమోషనల్‌గా సాగే కథకు వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశారు. మిగితా వారందరూ తమతమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చరణ్ అర్జున్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారింది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంగా సాగే సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. ఎమోషనల్ కంటెంట్ ప్రాపర్‌గా తెర మీద కనిపించేలా చేశారు. సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్, వేణుగోపాల్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
తెలంగాణలో జరిగే పెళ్లి నేపథ్యంగా సాగే తెలుగు సినిమా. తెలంగాణలోని పెళ్లి ఆచారాలు, సంప్రదాయలను చక్కగా చూపించారు. కానీ యాక్టర్ల ద్వారా తెలంగాణ యాసను మాట్లాడించడంలో పర్‌ఫెక్షన్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉండటం వల్ల సినిమా వేగం నెమ్మదించినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఓవరాల్‌గా కథ, సన్నివేశాల్లో అద్బుతంగా ఎమోషన్స్ పండాయి. స్క్రిప్టు, నటీనటుల ఎంపిక విషయంలో జాగ్రత్త పడి ఉంటే.. బలగం లాంటి సినిమాగా అయి ఉండేదనిపిస్తుంది. క్లీన్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, ఫన్ ఉండే ఈ సినిమాను ఈ వారాంతంలో చూడటానికి ఎలాంటి సందేహం లేకుండా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











