Lal Salaam Review రజనీకాంత్ విశ్వరూపం చూపించాడా? లాల్ సలామ్ సినిమా సమీక్ష!
నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవితా రాజశేఖర్ తదితరులు
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
నిర్మాత: సుభాస్కరన్
మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రాఫర్ం విష్ణు రంగసామి
ఎడిటర్: బీ ప్రవీణ్ భాస్కర్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-02-09
ముంబైలో రోడ్లమీద చేతి రూమాల్ అమ్ముకొనే స్థాయి నుంచి టెక్స్‌టైల్స్ కంపెనీ అధినేతగా ఎదిగిన పారిశ్రామిక వేత్త మొయినుద్దీన్ భాయ్ (రజనీకాంత్). తన కుమారుడు శంషూద్దీన్ (విక్రాంత్)ను ఇండియన్ క్రికెటర్‌గా చూడాలని కలలు కంటాడు. కపిల్ దేవ్ చేత ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాడు. అయితే కుసుమూరు, వెంకటాచలం గ్రామాల మధ్య క్రికెట్‌కు సంబంధించి శంషూద్దీన్, గురుస్వామి (విష్ణు విశాల్) జట్ల మధ్య అధిపత్య పోరు సాగుతుంటుంది. రెండు గ్రామాలకు చెందిన గొడవల్లో శంషూద్దీన్‌కు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
గురు, శంషూద్దీన్ మధ్య గొడవలకు కారణం ఏమిటి? కసుమూరు, వెంకటాచలం గ్రామాల్లో హిందూ, ముస్లింల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి? రెండు గ్రామాల వద్ద జాతరకు సంబంధించిన వ్యవహారం ప్రజల మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. తన కుమారుడు శంషూద్దీన్ రంజీ క్రికెట్ జట్టులో ఎంపికైన తర్వాత అతడికి జరిగిన సంఘటనతో మోయినుద్దీన్ ఎలా స్పందించాడు. కొడుకు జీవితాన్ని నాశనం చేసిన వారిపై మోయిన్ భాయ్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు. రెండు గ్రామాల మధ్య జాతర విషయంలో చోటుచేసుకొన్న సమస్యకు ఎలాంటి పరిష్కారం ఎలా? ఎవరు చూపించారు అనే ప్రశ్నలకు సమాధానమే లాల్ సలామ్ సినిమా కథ.

జంట గ్రామాల్లో క్రికెట్ మ్యాచ్ పోటీల వల్ల విభేదాల అంశం, అలాగే జాతర విషయంలో అధిపత్య పోరుతో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. తన ఊరుపై రజనీకాంత్‌కు ఉంటే ప్రేమ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లేలో క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా గందరగోళంగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్ అంశాలు, శంషూద్దీన్‌కు ప్రమాదం జరగడం సినిమాను మరింత భావోద్వేగంగా మారుస్తుంది. కాంతారా తరహాలో అమ్మవారి జాతర వ్యవహారం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక జైలర్ తర్వాత రజనీకాంత్ సినిమా కావడంతో ఏర్పడిన అంచనాలను తలైవా క్యారెక్టర్ చేరుకోలేదనే చెప్పాలి.
ఇక రజనీకాంత్ ముస్లిం వర్గానికి పెద్దగా, పారిశ్రామిక వేత్తగా, క్రికెట్ అభిమానిగా షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. కానీ ఆ రోల్‌ను ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేయకపోవడం, ఆయన చుట్టూ తిరిగే సన్నివేశాలు పేలవంగా ఉండటంతో ఆ పాత్ర తేలిపోయిందనే చెప్పాలి. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో రజనీ మెరుపులు మెరిపించాడు. విష్ణు విశాల్, విక్రాంత్ పోటాపోటీగా నటించారు. జీవిత రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రలో మెప్పించడమే కాకుండా గుర్తుండిపోయే పాత్రను పోషించారు. కపిల్ దేవ్ క్యారెక్టర్ చాలా నేచురల్‌గా ఉంటుంది.

లాల్ సలామ్ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. క్వాలిటీ పరంగా ఏ విభాగం కూడా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ మెప్పించలేకపోయింది. డైలాగ్స్ అక్కడక్కడా భారీగా పేలాయి. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయనిపిస్తుంది.
క్రికెట్ బెట్టింగ్, గ్రామాల్లో జాతరకు సంబంధించిన అధిపత్య పోరు లాంటి అంశాలతో రూపొందిన రూరల్ నేటివిటీ చిత్రం లాల్ సలామ్. మోయినుద్దీన్ పాత్రలో రజనీకాంత్ తన అభిమానులను మెప్పిస్తాడా? అంటే సందేహమే. ఐశ్వర్య రజనీకాంత్ పక్కాగా స్క్రిప్టును రాసుకొని ఉంటే.. బెస్ట్ రూరల్ డ్రామాగా మారి ఉండేదనిపిస్తుంది. రజనీ ఫ్యాన్స్ ఓ సారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











