Lambasingi Review క్యూట్ లవ్ స్టోరీలో దివి వద్యా మెప్పించిందా? లంబసింగి మూవీ రివ్యూ
నటీనటులు: దివి వద్యా, జై భారత్ రాజ్, వంశీ రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు
దర్శకత్వం: నవీన్ గాంధీ
సమర్పణ: కల్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: ఆనంద్ తన్నీరు
మ్యూజిక్: ఆర్ఆర్ ధ్రువన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
సినిమాటోగ్రఫి: కే బుజ్జి
ఆర్ట్: ఝాన్సీ లింగం
స్టంట్స్: రామకృష్ణ
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలిం
రిలీజ్ డేట్: 2024-03-15
సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఆయుధం పట్టిన నక్సలైట్ కుమార్తె హరిత (దివి వద్యా) తండ్రి బాటలోనే అడుగులు వేస్తుంటుంది. పోలీస్ ఉద్యోగంలో చేరిన వీరబాబు తొలి పోస్టింగ్‌గా లంబసింగి ప్రాంతంలో చేరుతాడు. హరితను తొలి చూపులోనే ప్రేమించేస్తాడు.ఆమె ప్రేమను గెలుచుకోవడానికి పరితపిస్తూ ప్రయత్నిస్తుంటాడు.

నక్సలైట్ ఉద్యమంలో హరిత ఎందుకు చేరింది? వీరబాబు ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? హరిత ప్రేమను గెలుచుకోవడానికి వీరబాబు చేసిన ప్రయత్నాలు ఏమిటి? పోలీసు, నక్సలైట్ల మధ్య పోరాటం ఎలా సాగింది? హరిత కోసం పోలీసులు వేట ఎందుకు సాగింది? వీరబాబును పోలీసుశాఖ ఎందుకు సస్పెండ్ చేసింది? చివరకు హరిత ప్రేమను వీరబాబు గెలుచుకొన్నాడా? హరిత, వీరబాబు ప్రేమకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లంబసింగి.
లంబసింగి అంటే గుర్తొచ్చేది భూతల స్వర్గంగా కనిపించే ప్రకృతి వాతావారణం. అలాంటి వాతావరణంలో పేద వర్గాల ఉన్నతి కోసం నక్సలైట్లు చేసే ఉద్యమం, వారిని అడ్డుకొనేందుకు చేసే పోలీసుల ప్రయత్నాల మధ్య.. వేర్వేరు సిద్దాంతాలు, అభిప్రాయాలున్న ఇద్దరి ప్రేమకథగా ఈ సినిమాను నవీన్ గాంధీ తెరకెక్కించారు. అయితే ఎంచుకొన్న పాయింట్, అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. కానీ పూర్తిస్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఇంకా బెటర్‌గా చేసి ఉంటే మంచి ప్రేమ కథ అయి ఉండేదనిపిస్తుంది.
ఇక హరితగా దివి వద్యా ఇప్పటి వరకు గ్లామర్ తారగానే ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నది. బిగ్‌బాస్ తర్వాత నటిగా తనకు తాను నిరూపించుకొనే ప్రయత్నంలో చేసిన ఈ సినిమాలోని పాత్రలో ఆమె ఒదిగిపోయింది. గ్లామర్‌తోనే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో తనలో మంచి నటి ఉన్నారనే విషయాన్ని హరిత పాత్ర ద్వారా వెల్లడించింది. ఎమోషనల్ సీన్లు, యాక్షన్ సీన్లు, లవ్ ట్రాక్ సీన్లలో మంచి హావభావాలు ప్రదర్శించింది. ఇక భరత్ రాజ్ కూడా కొత్తవాడైనప్పటికీ.. సినిమాను తన భుజాల మీద మోశాడు. వీరబాబు పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

సాంకేతిక విషయాలకు వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్. పాటలు సినిమాకు బలంగా మారాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాట, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం సినిమాను మ్యూజికల్ లవ్ స్టోరిగా మార్చింది. బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి, ధ్రువన్ మ్యూజిక్ సినిమాకు ఫీల్‌గుడ్‌గా మార్చింది. కాన్సెప్ట్ ఫిలింస్ అనుసరించిన నిర్మాణ విలువలు, ఆనంద్ తన్నీరు టీమ్ పాటించిన ప్రమాణాలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌గా లవ్ స్టోరీలు ఇంతకు ముందు వచ్చాయి. కానీ లంబసింగి మాత్రం ఓ డిఫరెంట్ మూవీ. కొత్తవారు మంచి నటనతో సినిమాను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం. చిన్న చిత్రాల్లో మంచి క్వాలిటీ మాత్రమే కాదు.. మంచి ఫీల్ ఉన్న ఉన్న సినిమాగా లంబసింగి కనిపిస్తుంది. నక్సల్స్, పోలీస్ బ్యాక్ డ్రాప్, ప్రేమ కథలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. లంబసింగి అందాలను తెరపైన చూడాలనుకొంటే ఈ సినిమా థియేట్రికల్ వాచ్‌తోనే సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications











