Little Hearts Review: లిటిల్ హార్ట్స్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు
రచన, దర్శకత్వం: సాయి మార్తండ్
ప్రొడ్యూసర్: ఆదిత్య హాసన్
మ్యూజిక్: సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫి: సూర్య బాలాజీ
ఎడిటర్: శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్: దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వినోద్ నాగుల, మురళి పున్న
బ్యానర్: ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-09-05

గవర్నమెంట్ ఉద్యోగి అయిన గోపాల్ రావు (రాజీవ్ కనకాల) తన కొడుకు అఖిల్ (మౌళి తనుజ్)ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తోపాటు మ్యూజిక్ కంపోజర్ కావాలనుకొంటాడు. కానీ తండ్రి లక్ష్యానికి దూరంగా ఇంటర్ మొక్కుబడిగా పాసై ఎంసెట్ క్వాలిఫై కూడా కాలేకపోతాడు. దాంతో ఎలాగైనా కొడుకును ఫ్రీ సీట్ కొట్టి బీటెక్ చదివించాలనే పట్టుదలతో అఖిల్‌ను ఎంసెట్ లాంగ్ టర్మ్‌లో చేర్పిస్తాడు. తండ్రి (ఎస్ఎస్ కాంచీ)కి ఇష్టం లేకపోయినా బైపీసీ చేసి మెడిసిన్ సీట్ కొట్టలేక లాంగ్ టర్మ్ కోచింగ్ చేరిన కాత్యాయని (శివానీ)తో అఖిల్ పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమలో పడేలా చేస్తుంది. అప్పటికే అమ్మాయి చేతిలో లవ్ రిజెక్ట్ అయిన అఖిల్ ఎలాగైనా కాత్యాయని అఫైర్ కొనసాగించాలనుకొంటాడు. కానీ వారి లవ్‌కు ఓ సమస్య ఎదురవుతుంది. కాత్యాయని ఇంట్లో అఖిల్‌తో ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది.

Little Hearts Movie Review and Rating in Telugu

అఖిల్ ఫస్ట్ లవ్ ఎలా బ్రేకప్ అయింది? ఎంసెట్ ఎందుకు క్వాలిఫై కాలేకపోయాడు? లాంగ్ టర్మ్ కోచింగ్‌లో ఎలా చేరాల్సి వచ్చింది. కాత్యాయనితో అఖిల్ లవ్ ట్రాక్ ఎలా కొనసాగింది? కాత్యాయనితో అఖిల్ ప్రేమకు ఎదురైన ప్రధానమైన సమస్య ఏమిటి? తల్లిదండ్రులు కోరుకొన్నట్టే అఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్, కాత్యాయని డాక్టర్ అయిందా? కూతురు ప్రేమ తెలిసిన కాత్యాయని తండ్రి రియాక్షన్ ఏమిటి? కొడుకు అఫైర్ గురించి అఖిల్ తండ్రి స్పందన ఏమిటి? అఖిల్, కాత్యాయని ప్రేమకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లిటిల్ హార్ట్స్ సినిమా కథ.

లిటిల్ హార్ట్స్ సినిమా విషయానికి వస్తే.. కథాపరంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు. రెగ్యులర్, రొటీన్ అంశాలతో సాగే టీనేజ్ లవ్ స్టోరి. కానీ దర్శకుడు సాయి మార్తండ రాసుకొన్న సన్నివేశాలు.. వాటికి తగ్గట్టు రాసిన డైలాగ్స్ సినిమా హిల్లేరియస్ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. తల్లిదండ్రులు బలవంతంగా తమ పిల్లలను ఎంసెట్, ఇంజినీరింగ్, మెడిసిన్ చదివించాలనే నేటితరం పోకడ ఈ సినిమాకు మెయిన్ పాయింట్‌గా మారడం ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దాదాపు ప్రతీ ఇంటిలో ఇలాంటి సన్నివేశాలే కనిపించడమనేది ఈ సినిమా అందరికి ఈజీగా నచ్చేలా చేస్తుంది. అయితే లవ్ ట్రాక్ ఆధారంగా సాగే ఈ సినిమాలో అఖిల్, కాత్యాయని ఫ్రెండ్స్ గ్రూప్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆద్యంతం నవ్వుల పూలు పూయిస్తాయి. దానికి తోడు నటీనటులు లీనమైన నటించిన తీరుతో సినిమా మరింత ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. కాకపోతే లవ్ ట్రాక్‌కు చిన్న పిల్లలను వాడుకొనే పాయింట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారితో చేయించే ఒకట్రెండు సీన్లు సినిమాలో ఎబ్బెట్టుగా ఉంటాయి. ఓవరాల్‌గా బూతులను మినహాయిస్తే.. ఫీల్ గుడ్, క్లీన్ ఎంటర్‌టైనర్‌ అందించడంలో దర్శకుడు సాయి మార్తండ సక్సెస్ అయ్యాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

లాంగ్ టర్మ్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ అడ్డగా మొదలయ్యే కథను జియో సిమ్‌‌కు ముందు తర్వాత అంటూ ప్రారంభించిన తీరు బాగుంటుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోవడం వల్ల అప్పుడే ప్రధమార్థం ముగిసిందా? అనే ఫీలింగ్ కలుగుతుంది. పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా సన్నివేశాల్లో పేలిపోయాయి. కథలో ఎమోషన్స్ పట్టించుకోకుండా పూర్తిగా ఫన్ ఎలిమెంట్స్‌పై ఆధారపడటం వల్ల సినిమా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇక టీనేజ్ లవ్ స్టోరీలో సెంటిమెంట్స్, గొడవలు, గందరగోళాలను టచ్ చేయకుండా కథను ఫన్ వేలో ముగించడం మంచి కామెడీ ఎంటర్‌టైనర్ చూశామనే తృప్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కథ అక్కడక్కడే తిరుగుతూ కొన్నిసార్లు ముందుకు సాగదే అనే విసుగు కలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సాగదీత ఎక్కువ కావడం ఈ సినిమాకు మైనస్.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమా చూసిన తర్వాత అఖిల్ పాత్రలో మౌళిని తప్పా మరొకరిని ఊహించుకోలేం. పాత్రలో లీనమవ్వడమే కాకుండా అత్యంత సహజంగా నటించి మెప్పిస్తాడు. అలవోకగా హావభావాలు, డైలాగ్ డెలవరీ.. స్పాంటెనిటీ బాగా చూపించాడు. చిన్నవాడైనా చిన్న సినిమాను పెద్ద మూవీగా మార్చే బాధ్యతను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించి తీరు, యాక్టర్‌గా కాన్ఫిడెన్స్ బాగా నచ్చేస్తాయి. ఇక కాత్యాయనిగా శివానీ నాగారం కూడా అంతే మొత్తంలో అదరగొట్టింది. కీలక సన్నివేశాల్లో చూపించిన పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందనిపిస్తుంది. అఖిల్ తల్లిదండ్రులుగా రాజీవ్ కనకాల, అనితా చౌదరీ ప్రతీ ఇంటిలో ఉండే కుటుంబాన్ని గుర్తు చేస్తారు. కాత్యాయని పేరెంట్స్‌గా కాంచీ, సత్య కృష్ణన్ ఈ తరం తల్లిదండ్రుల ప్రతిరూపంగా ఫర్‌ఫెక్ట్ అనిపించేలా నటించారు. మధు పాత్రలో నటించిన అబ్బాయి నటన ఈ సినిమాకు మరో హైలెట్. ఈ చిత్రంలో కనిపించిన ప్రతీ పాత్ర నచ్చుతుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. డైలాగ్స్ ఈ సినిమాను పూర్తి స్థాయి వినోదంగా మార్చింది. ఈ సినిమాకు అత్యంత బలం మాటలే. ఆ తర్వాత సింజిత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. కాత్యాయని పాట ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. కొన్ని పాటల ప్లేస్ మెంట్ వల్ల జోరుగా సాగే ఫన్, కామెడీకి కళ్లెం వేసాయా? అనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో శ్రీదర్ సోంపల్లి తన కత్తెరకు మరింత పదను పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ అవుట్‌పుట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. సూర్య బాలాజీ సన్నివేశాలను చాలా క్యూట్‌గా, ఫీల్‌గుడ్‌గా రూపొందించారు. సైనిక్‌పురి, మల్కాజిగిరి నేటివిటిని బాగా కెమెరాతో పట్టుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఆదిత్య హాసన్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈటీవీకి ఉండే క్లీన్ ఇమేజ్ ఈ సినిమా ఏమిటో తెలియజెప్పుతుంది.

లిటిల్ హార్ట్స్ సినిమా విషయానికి వస్తే.. సరదాగా సాగిపోయే.. రొటీన్, రెగ్యులర్ టీనేజ్ లవ్ స్టోరి. ఇంతకుముందు చెప్పుకొన్నట్టే.. డైలాగ్స్, నేచురాలిటికి దగ్గరగా ఉండే సీన్లు సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫస్టాఫ్ సరదా సరదగా సాగిపోతే.. సెకండాఫ్ త్వరగా ముగిస్తే బాగుండని ఓ దశలో అనిపిస్తుంది. యాక్షన్ సినిమాల మధ్య హాయిగా రెండు గంటలపాటు నవ్వుకొనే మంచి సినిమా. మనసులో ఎలాంటి లెక్కలు లేకుండా వెళితే.. హాయిగా ప్రశాంతంగా నవ్వుకొని బయటకు వచ్చే సినిమా. థియేటర్‌లోనే చూడండి.. మంచి అనుభూతిని లిటిల్ హార్ట్స్ పంచుతాయి.

More from Filmibeat

Read more about: mouli rajeev kanakala tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X