Love You Ram Review సెన్సిబుల్ లవ్ స్టోరి.. లవ్ యు రామ్ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్, కామిక్ రైటర్ మల్లిక్, డైరెక్టర్ దశరథ్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకత్వం: డీవై చౌదరి
కథ: దశరథ్
నిర్మాతలు: డీవై చౌదరి,దశరథ్
సంగీతం: వేద
సినిమాటోగ్రఫి: సాయి సంతోష్
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్
నిర్మాణ సంస్థ: మన ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2023-06-30
నార్వేలో హోటల్ బిజినెస్ నిర్వహించే రామ్ (రోహిత్ బెహల్) ఇండియాకు వచ్చి పెళ్లి కోసం అమ్మాయి వేట ప్రారంభిస్తాడు. నార్వేలో తన వ్యాపార వ్యహారాలు చూసుకొనే సీఈవో పూర్ణాచారి అలియాస్ పీసీకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అయితే తాను చేసుకోబోయే అమ్మాయి తనకు భార్య కంటే తన కంపెనీలో మంచి ఉద్యోగిగా ఉండాలనే కండిషన్ పెడుతాడు. ఆ క్రమంలో బాల్య స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్ధన్)ను పెళ్లి చేసుకొంటాడు. శోభనానికి ముందు రామ్ కమర్షియల్ ఆలోచన దివ్యకు తెలుస్తుంది.

రామ్ కమర్షియల్ మెంటాలిటీ వల్ల సీఈవో పీసీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రామ్ వ్యాపార ధోరణి పీసీకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి భార్య కంటే మంచి ఉద్యోగి కావాలని రామ్ కోరుకొన్నప్పుడు పీసీ రియాక్షన్ ఏమిటి? రామ్ ప్లాన్ తెలిసిన తర్వాత దివ్య ఎలా రియాక్ట్ అయింది? భార్య కంటే ఉద్యోగి కావాలనుకొన్న రామ్ ఆలోచనకు దివ్య ఆమోదం తెలిపిందా? రామ్ ప్లాన్ తెలిసిన తర్వాత దివ్య ఏం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ యు రామ్.
రామ్, పూర్ణాచారి (పీసీ) మధ్య చిన్న చిన్న విభేదాలు, తగువలతో సినిమా ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. రామ్, పూర్ణాచారి మధ్య సన్నివేశాలు అవసరానికి మించి ఉందనిపిస్తుంది. పిసినారితనం, కమర్షియల్ మెంటాలిటీతో ఉన్న రామ్ పాత్రను దర్శకుడు డీవై చౌదరి డిజైన్ చేసిన తీరు బాగుంది. కానీ ఆ పాత్ర చుట్టు మరింతగా ఎమోషన్స్‌ను జోడించి ఉంటే కథ మరింత ఫీల్‌గుడ్‌గా ఉండేదనిపిస్తుంది.
రామ్, దివ్య పెళ్లి తర్వాత అసలు కథ మొదలవుతుంది. రామ్, దివ్య మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు, బేధాభిప్రాయాలతో కథ ముందుకు సాగుతుంది. కథ, కథనాల్లో వేగం లోపించడం వల్ల స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల రొటీన్, రెగ్యులర్ అనిపిస్తుంది. చెవిటితనంతో బాధపడే బామ్మ పెట్టిన ట్విస్టుతో క్లైమాక్స్‌లో కథ, కథనాలు స్పీడ్ అందుకొంటాయి. రామ్, దివ్య మధ్య ఉన్న ప్రేమనురాగాలు ఒకరినొకరు తెలుసుకోవడంతో కథ ఫీల్‌గుడ్‌గా సుఖాంతం అవుతుంది. హీరోయిన్, హీరో మధ్య ఉండే సమస్యను సున్నితంగా డీల్ చేసిన విధానం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది.
రామ్‌గా రోహిత్ బెహల్, దివ్యగా అపర్ణ జనార్ధనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సహజసిద్దంగా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వారిద్దరి కెమిస్ట్రీని చూసిన తర్వాత ఇంకా ఎమోషనల్ సీన్లు ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ నటన కొత్త ఎలిమెంట్. తొలిసారి నటుడిగా మారిన ఆయన ఆద్యంతం బ్రహ్మానందాన్ని ఇమిటేట్ చేసినట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో నటనపరంగా ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. మరికొన్ని సన్నివేశాల్లో నేచురల్ యాక్టింగ్‌తో నవ్వులు పూయిస్తాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వేద అందించిన సంగీతం బాగుంది. ఉండాలని ఉంది నీతో పాట ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. తూ మెరా.. మై తెరా అనే పాట కూడా మెలోడియస్‌గా సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్నివేశాలను సాయి సంతోష్ చిత్రీకరించిన తీరు బాగుంది. నమ్మించడం కష్టం. ప్రేమించడం ఈజీ తెలుసుకో. చిన్నప్పటి నుంచి ఒకరిని ప్రేమిస్తూ.. వాడిని రాముడు, దేవుడు అని జీవితం అంకితం చేసిన తర్వాత వాడు మోసం చేస్తే ఎంత నరకంగా ఉంటుందో లాంటి డైలాగ్స్ హత్తుకొనేలా ఉంటాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఎస్బీ ఉద్దవ్‌కు ఇంకా చాలా పని ఉందనిపిస్తుంది.
ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమించిన ఓ అమ్మాయి, భార్య అంటే తన వ్యాపారాన్ని చూసుకొనే ఉద్యోగి అనే అభిప్రాయం ఉన్న అబ్బాయి మధ్య జరిగే మానసిక సంఘర్షణ లవ్ యు రామ్. మంచి పాయింట్.. మరింత ఎఫెక్టివ్‌గా చెప్పడానికి స్కోప్ ఉంది. ఈ కథలో ఇంకా ఎమోషన్స్ పండించడానికి పాత్రలు రెడీగా ఉన్నాయనిపిస్తుంది. అయితే దర్శకుడు పూర్తిస్థాయిలో ఇంకా కొంత వర్క్ చేసి ఉంటే క్లాసికల్ లవ్ స్టోరి అయి ఉండేది. సెన్సిటివ్, సెన్సిబుల్ లవ్ స్టోరీలను ఆదరించే వారికి లవ్ యూ రామ్ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











