twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్నటి 'లవ్వే'

    By Staff
    |

    Love Today
    చిత్రం: లవ్‌టుడే
    నటీనటులు: ఉదయ్‌కిరణ్‌, దివ్యకోస్లా,
    సునీల్‌, దేవదర్శిని, తనికెళ్ళ భరణి తదితరులు
    సంగీతం: విద్యాసాగర్‌
    నిర్మాత: ఆర్‌.బి.చౌదరి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్పుతన్‌

    అయ్యో బాబోయ్‌..ఒక సినిమా చూసి ఎంత మంది దర్శక, నిర్మాతలు 'ఇన్‌స్పైర్‌' అయ్యారో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదు. హాలీవుడ్‌లో సాధారణ హిట్‌ చిత్రం 'సెరిండిపిటీ' అనే ఒక చిత్రాన్ని చూసి రసూల్‌ 'ఒకరికి ఒకరు', జ్యోతికృష్ణ 'నీ మనసు నాకు తెలుసు తీయగా, తమిళంలో శరణ్‌ 'జేజే' తీశాడు. అదే పాయింట్‌ను వాడుకొని కొద్దిగా మార్చి అర్పుతన్‌ అనే నూతన దర్శకుడు ఉదయ్‌కిరణ్‌తో 'లవ్‌టుడే' అనే అత్యంత బోర్‌ చిత్రాన్ని మన మీదికి వదిలాడు. ఈ లవ్‌ అంతా నిన్నటిదే. టుడే కొత్తగా అన్పించే అంశం ఏమీ లేదు. సినిమాలో పెద్దగా విషయం ఏమీ లేకపోవడంతో..దాన్ని ఎలా సాగదీయాలో తెలియక, సునీల్‌తో కాసేపు కామెడీ, మరికొద్ది సేపు ప్రేమపై 'క్లాస్‌'లతో దర్శకుడు ఈ సినిమాను నడిపించాడు. సినిమా అంతా బోరే. క్లైమాక్స్‌ ఒక్కటి విషాదాంతమే..ఐనా ఆ 'మలుపు' కోసం సినిమాను భరించడం కష్టం. బహుశా..'సెరిండిపిటీ' చిత్రాన్ని తీద్దామని మొదలుపెట్టి..సినిమా నిర్మాణంలో ఉండగానే..పైన చెప్పిన సినిమా విడుదల కావడంతో..చివర్లో మరో మలుపు తిప్పాలని భావించి ఉంటారు. అందుకే, క్లైమాక్స్‌ కొద్దిగా షాక్‌ కలిగిలే..హీరో, హీరోయిన్లును అలా విడగొట్టారు. 'నువ్వు లేక నేను లేను' తర్వాత ఉదయ్‌కిరణ్‌ నటించిన మరో అత్యంత బోర్‌ చిత్రం ఇది.

    కథ: ఉదయ్‌కిరణ్‌ దారిన వెళుతోన్న ఓ అందెగత్తె (దివ్యా కోస్లా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. వీరిద్దరూ అకస్మాత్తుగా అనుకోకుండా కలుస్తుంటారు. దేవుడి అలా మనిద్దరికి రాసి పెట్టి ఉంటాడు అందుకే ఇలా కలుస్తున్నామని ఉదయ్‌ ఆ అమ్మాయితో చెప్పి..తను ప్రేమిస్తున్నాని అంటాడు. ఓ వంద రూపాయల మీద తన అడ్రెస్‌ రాసిస్తాడు. అది తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తే..నీ ప్రేమ నిజమని నమ్ముతానని హీరోయిన్‌ హీరోకు చెపుతుంది.

    అన్నట్లుగానే..ఆ నోట్‌ కొద్దిరోజుల తర్వాత హీరోయిన్‌ వద్దకే చేరుకుంటుంది. సో..వీళ్ళు ఇద్దరూ ప్రేమించుకుంటుంటారు. మధ్య మధ్యలో పాటలు పాడుకుంటూ, డాన్స్‌లు చేసుకుంటూనే..అపార్థాలు పడుతుంటారు. హీరోయిన్‌ చివరికి తను హీరోకి సూట్‌ కానని భావించి విడిపోతుంది. హీరో..ఎంత ప్రయత్నించినా ఆమె కలవదు. ఓ ఏడాది తర్వాత హీరో లైఫ్‌లో సెటిల్‌ అయి..ఆమెను వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళినా ఆమె హీరోను చూసేందుకు రాదు. ఇదంతా ప్లాష్‌బ్యాక్‌ పద్దతిలో చెపుతుంటారు ఇద్దరూ. విషాదాంతమైన క్లైమాక్స్‌ ఏమిటో తెరపై చూడాలనుకున్నవాళ్ళు చూడవచ్చు.

    హీరో ఉదయ్‌కిరణ్‌ ఈ చిత్రాన్ని ఎలా అంగీకరించాడో! కొత్త హీరోయిన్‌ విషాద దృశ్యాల్లోనే బాగుంది. మామూలు సమయంలో ఆమెకు నటనలో ఓనమాలు కూడా తెలియన్న విషయం అర్థమవుతుంది. 'వాకింగ్‌..ఇన్‌ ది..' అనే పాట ఒక్కటి బాగుంది. సునీల్‌ కామెడీ కొంచెం రిలీఫ్‌. ఈనాటి కాలం ప్రేమికులు ఇలా స్వయంకృతం వల్లే ప్రేమలను నాశనం చేసుకుంటున్నారన్న 'బరువైన సందేశం' బాగానే ఉన్నా, దాన్ని చూపించే పద్దతి మాత్రం చాలా బోరింగ్‌గా ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X