Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సుధీర్ బాబు, సాయాజీ షిండే, సాయిచంద్, ఆమని, రాజు సుందరం, శషాంక్ తదితరులు
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
నిర్మాత: సునీల్ బలుసు
మ్యూజిక్ డైరెక్టర్: జయ్ క్రిష్
సినిమాటోగ్రాఫర్: సమీర్ కల్యాణి
ఎడిటర్: అనిల్ కుమార్ పీ
కొరియోగ్రఫి: రాజు సుందరం
రచన: ఎవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి
బ్యానర్: వీ సెల్యూలాయిడ్స్, కామ్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-10-10
భార్య చనిపోవడంతో కొడుకు బాధ్యతలు భుజానికి ఎత్తుకొన్న లారీ డ్రైవర్ ప్రకాశ్ (సాయిచంద్) తన కొడుకును అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో 20 జైలు శిక్ష అనుభవిస్తాడు. అనాథ శరణంలో పెరిగిన అబ్బాయికి జానీ (సుధీర్ బాబు) అని పేరు పెట్టి.. స్టాక్ మార్కెట్ బ్రోకర్ శ్రీనివాస్ (సాయాజీ షిండే) పెంచుకొంటాడు. అయితే పెంపుడు తండ్రి శ్రీనివాస్ స్టాక్ మార్కెట్‌లో నష్టపోవడంతో ఆయన కోసం కోటి రూపాయలు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో కోటిన్నర గెలుచుకొన్న ప్రకాశ్.. జానీకి తారసపడుతాడు. ప్రకాశ్ మోసం చేసి కోటిన్నర రూపాయలు కొట్టేసి శ్రీనివాస్‌ను రక్షించాలని అనుకొంటాడు.

ప్రకాశ్ తన కొడుకు అనాథ శరణాలయంలో ఎందుకు చేర్పించాడు? లారీ డ్రైవర్ ప్రకాశ్ ఎందుకు జైలుకు వెళ్లాడు? జానీని దత్తత తీసుకొన్న తర్వాత శ్రీనివాస్ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయి? కోటి రూపాయల నష్టం ఎందుకు వచ్చింది? ప్రకాశ్‌కు కోటిన్నర రూపాయలు ఎలా వచ్చాయి. ప్రకాశ్ నుంచి జానీ కోటిన్నర కొట్టేయడానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? ఆ డబ్బును ఎలా కొట్టేశాడు? ప్రకాశ్ తన తండ్రి అని తెలిసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మా నాన్న సూపర్ హీరో సినిమా కథ.
దర్శకుడు అభిలాష్ రెడ్డి కేవలం మూడు పాత్రలతో రాసుకొన్న ఎమోషనల్ కథ. ఇద్దరు తండ్రులు, ఓ కొడుకుల మధ్య జరిగే భావోద్వేగమైన డ్రామా. భారమైన సన్నివేశాలు, ఉద్వేగ భరితంగా కొన్ని సీన్లు ఆడియెన్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. కథలోనే అక్కడక్కడా ఫన్ క్రియేట్ చేసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అందించాడు. అయితే కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నంలో నేటి తరం ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ మిస్ చేశాడా? అనే అనుమానం కలుగుతుంది. మూడు క్యారెక్టర్ల మధ్య బాండింగ్‌ను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఎప్పుడూ కొత్తదనం, కొత్తగా కథ చెప్పాలనే తాపత్రయంతో ఉండే సుధీర్ బాబు.. మరోసారి మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి. పూర్తిగా ఎమోషనల్‌గా సాగే జానీ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సాయాజీ షిండేతో కొన్ని ఎసిసోడ్‌లోను, అలాగే సాయిచంద్‌తో జర్నీలో నటుడిగా పరిణితితో కూడిన ఫెర్ఫార్మెన్స్‌ను చూపించారు. సాయాజీ షిండే, సాయిచంద్ ఎవరికి వారే పోటీపడి ఎమోషన్స్ పండించారు. మిగితా క్యారెక్టర్లలో ఉన్న వారంతా ఫర్వాలేదనిపించారు. రాజు సుందరం స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పుకోవాలి.

ఇక ఈ సినిమాకు సమీర్ కల్యాణ్ అందించిన సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. కేరళ ఎపిసోడ్స్‌ను బాగా చిత్రీకరించాడు. జయ్ క్రిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించింది. కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కొన్ని సీన్లపై అనిల్ కుమార్ పీ ఎడిటర్‌గా కొన్ని కత్తెర్లు వేయాల్సిందనిపిస్తుంది. నిర్మాత సునీల్ బలుసు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎమోషనల్ జర్నీతో ఎంటర్‌టైనింగ్‌గా సాగే తండ్రి కొడుకుల భావోద్వేగమైన కథ మా నాన్న సూపర్ హీరో. యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ కారణంగా ఈ సినిమా హార్ట్ టచ్ అయ్యేలా మారిందని చెప్పవచ్చు. అభిలాష్ రెడ్డి చాలా హానెస్ట్‌గా కథను చెప్పే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కాకపోతే సింగిల్ పాయింట్‌తో స్టోరీని చెప్పడం కొంత రెగ్యులర్‌గా,సాగదీసినట్టు అనిపిస్తుంది. పండుగ సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే సినిమా అని పక్కాగా చెప్పుకోవచ్చు. ఫాదర్, సన్ బాండింగ్ కథతో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. థియేటర్‌లో ట్రై చేయండి.. మంచి అనుభూతిని పొందడం గ్యారెంటి.


Click it and Unblock the Notifications











