Maargan First Review: మార్గన్ మూవీ ఫస్ట్ రివ్యూ
దక్షిణాదిలో పాపులర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని నటించిన మార్గన్ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ద్వారా ఇప్పటి వరకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్ పాల్ దర్శకుడిగా మారి క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తున్నరు. మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ సినిమాలో అజయ్ దిషాన్, పీ సముద్రఖని, మహానది శంకర్, ప్రితీక, బ్రిగిడా సాగా తదితరులు నటిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..
మార్గన్ చిత్రంలో నటించడం, నిర్మించడమే కాకుండా ఈ సినిమాకు మ్యూజిక్ కూడా విజయ్ ఆంటోని అందించారు. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న లియో జాన్ పాల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 20 కోట్ల రూపాయలు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మార్గన్ కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ (విజయ్ ఆంటోని) అసిస్టెంట్ డీజీపీగా ముంబైలో పనిచేస్తుంటాడు. అయితే పోలీస్ శాఖకు సవాల్ విసురుతూ ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకొంటాడు. బాధితులను చంపే ముందు సీరియల్ కిల్లర్ వారి ముఖాలకు నల్లని పదార్థం పుస్తాడని తన ఇన్వెస్టిగేషన్‌లో ధ్రువ్‌కు తెలుస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు వరుస హత్యలు చేస్తుంటాడు? బాధితుల ముఖాలకు పూసే నల్లటి పదార్థం ఏమిటి? మిస్టరీ క్రైమ్‌ను ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడనే ప్రశ్నలకు సమాధానమే మార్గన్ సినిమా కథ.
యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తొలి చిత్ర దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన తీరు, అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోని క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకొనేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అనే విషయాన్ని సెన్సార్ చిత్ర యూనిట్‌కు సెన్సార్ టీమ్ వెల్లడించింది. ఈ సినిమాలో ఎమోషనల్ అంశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయనే విషయాన్ని చూఛాయగా వెల్లడించినట్టు తెలిసింది.
అయితే ఈ సినిమాపై సెన్సార్ అధికారులు ఎక్కువ అభ్యంతరాలు చెప్పకుండా చిన్న మార్పులు, కొన్ని డైలాగ్స్‌కు బీప్స్ వేసి వదిలివేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ వినియోగం, ఆల్కాహల్ లాంటి అంశాలు ఉండటం వల్ల ఈ సినిమాకు NC12 నిబంధనతో U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. NC 12 అంటే 12 సంవత్సరాలు దాటని పిల్లలను అనుమతించకూడదనే నిబంధన ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇచ్చారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ సాగే ఛేజింగ్ డ్రామా నిడివిని ప్రామాణికంగానే ఉంచేందుకు టీమ్ ప్రయత్నించింది. సెన్సార్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ 131 నిమిషాలు అంటే.. 2 గంటలు 11 నిమిషాలు అని స్పష్టమైంది. అయితే ఈ సినిమాలోని అంశాలను 3 గంటలపాటు చూపించిన ఏ మాత్రం థ్రిల్లింగ్ మిస్ కాదు. కానీ కొన్ని ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని 131 నిమిషాలకు ఫైనల్ కట్ విధించాం అని హీరో విజయ్ ఆంటోని తెలిపారు


Click it and Unblock the Notifications











