Mad Movie Review యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. డైలాగ్స్ కిర్రాక్.. మ్యాడ్ మూవీ సమీక్ష
నటీనటులు: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, రఘుబాబు, అనుదీప్ కేవీ, అంథోని తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ శంకర్
రచన: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు, కల్యాణ్ రావు
నిర్మాత: హారిక సూర్యదేవర
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
సహ నిర్మాత: సాయి సౌజన్య
బ్యానర్: హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
మ్యూజిక్: భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫి: దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్
ఎడిటింగ్: నవీన్ నూలీ
ఆర్ట్: రామ్ అరసవల్లి
రిలీజ్ డేట్: 2023-10-06
రీజినల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఇంజనీరింగ్ విద్యార్థులు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఎదురైన ర్యాగింగ్, కాలేజీ క్యాంటీన్ కోసం ఛాలెంజ్ తదితర అంశాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వారి జీవితాల్లోకి తమ క్లాస్ మేట్స్ రాధ,జెన్నీ, ప్రియ వస్తారు. ఇంజినీరింగ్ ముగిసే సమయానికి వారి జీవితాల్లో జరిగి సంఘటనలు వారికి ఎలాంటి సుఖ:దుఖాలు పంచాయనేది మ్యాడ్ (MAD) సినిమా కథ.

ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరిగే సమయంలో చోటు చేసుకొన్న ఓ సంఘటన నేపథ్యంలో సీనియర్ విద్యార్థి లడ్డూ అలియాస్ గణేష్ (కమెడియన్ విష్ణు OI) కథ చెప్పడం ద్వారా సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో సాగుతుంది. మనోజ్, దామోదర్ చిలిపి చేష్టలతో లాజిక్ లేకుండా సన్నివేశాలు వినోదంతో వినోదాన్ని పంచుతాయి. ప్రియురాలిని మెప్పించడం కోసం మనోజ్, అశోక్‌ను మెప్పించడం కోసం జెన్సీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక దామోదర్‌ను టెలిఫోన్‌లో లవ్ ప్రపొజల్ చేసిన వెన్నెల్లో ఆడపిల్ల.. లవ్ ట్రాక్ సరదాగా సాగిపోతాయి. క్లైమాక్స్‌లో దామోదర్‌ను వెన్నెల కలిసిందా? అనేది ఓ ట్విస్టుతో ఫుల్ ఫన్‌తో మ్యాడ్ (MAD) సినిమా ముగుస్తుంది.
దర్శకుడు కల్యాణ్ శంకర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల చుట్టూ తిరిగే సంఘటనలు, ఆ సంఘటనలకు తగినట్టుగా అడల్డ్ డైలాగ్స్‌తో క్రియేటివ్ లిబర్టీతో తనకు తోచిన విధంగా వినోదాన్ని టార్గెట్ చేస్తూ రాసుకొన్న డైలాగ్స్, సీన్లు వర్కవుట్ అయ్యాయి. దాంతో వినోదం పూర్తి స్థాయిలో పండిందని చెప్పవచ్చు. కథగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించదు. లాజిక్ లేకుండా క్యారెక్టర్లు మాట్లాడే మాటలు, సన్నివేశాలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ రాసిన సన్నివేశాలు కనెక్ట్ అవ్వడంతో మ్యాడ్ (MAD) మంచి ఎంటర్‌టైనర్‌గా మారిందని చెప్పవచ్చు.

మ్యాడ్ (MAD) సినిమాలో నటీనటులంతా కొత్తవారే. కానీ నూతన నటీనటులు అద్బుతంగా సీన్లను పండించారని చెప్పవచ్చు. కమెడియన్ విష్ణు, సంగీత్ శోభన్ సినిమా భారాన్ని తమ భుజాలపై మోస్తే.. బలమైన క్యారెక్టర్లతో రామ్ నితిన్, నార్నే నితిన్ సినిమాకు సపోర్టుగా నిలిచారు. యువ హీరోయిన్లు శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ అందం, అభినయంతో మెప్పించారు. రవిబాబు, మురళీధర్ గౌడ్ లభించిన సీన్లు తక్కువే అయినప్పటికీ.. వారు గుర్తుండిపోయేలా నటించారు.
మ్యాడ్ (MAD) మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. పాటలు మాత్రమే కాకుండా కామెడీ సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా మారింది. పలు సన్నివేశాలు రీరికార్డింగ్‌తో బాగా ఎలివేట్ అయ్యాయి. దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్, నవీన్ నూలీ తన ఎడిటింగ్ ప్రతిభతో సినిమాను పరుగులు పెట్టించారు. డైలాగ్ బేస్ట్ కామెడీ కావడంతో సంభాషణలు యూత్‌కు కిర్రాక్ పుట్టించేలా ఉన్నాయి. నాగవంశీ సమర్పణలో హారిక హాసిని బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

మ్యాడ్ (MAD) సినిమా యూత్‌ఫుల్‌గా సాగే కామెడీ ప్రధాన చిత్రం. లాజిక్స్ వెతక్కుండా సినిమా చూస్తే మంచి వినోదాన్ని, అనుభూతిని పొందడానికి అవకాశం ఉంది. యువ హీరో, హీరోయిన్లు, సపోర్ట్ క్యారెక్టర్లలో నటించిన వారి ప్రతిభ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఎలాంటి అంచనాలతో వెళ్లినా ఈ సినిమా నిరాశ పరచదు. రెండు గంటలపాటు చక్కగా వినోదాన్ని ఆస్వాదించే చిత్రంగా మ్యాడ్ మూవీని తెరకెక్కించడంలో హారిక హాసిని బ్యానర్, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ సక్సెస్ అయ్యారు. మ్యాడ్ (MAD) సినిమా యూత్‌కు కనెక్ట్ అయితే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











