Madha Gaja Raja Review in Telugu: మద గజ రాజ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంతానం, సోనుసూద్, మనోబాల, సుబ్బరాజు, శరద్ సక్సెనా, మణివణ్ణన్ తదితరులు
రచన, దర్శకత్వం: సుందర్ సీ
నిర్మాతలు: అక్కినేని మనోహర్ ప్రసాద్, అక్కినేని ఆనంద్ ప్రసాద్, ఏసీ షణ్ముగం, ఏసీఎస్ అరుణ్ కుమార్
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఎన్‌బీ శ్రీకాంత్
మ్యూజిక్: విజయ్ ఆంటోని
బ్యానర్: జెమిని ఫిల్మ్ సర్క్యూట్
రిలీజ్ డేట్: 2025-01-31
మద గజ రాజ అలియాస్ ఎంజీఆర్ అలియాస్ రాజు (విశాల్) తన చుట్టూ ఆనందంగా ఉండాలని కోరుకొనే యువకుడు. చిన్ననాటి స్నేహితులతో తన టీచర్ ఇంట్లో పెళ్లి కోసం కలిసి వెళ్తాడు. అక్కడ తొలి చూపులోనే మాయ (వరలక్ష్మీ శరత్ కుమార్) అంటే క్రష్ ఏర్పడుతుంది. తాను తన స్నేహితులందరూ ఇష్టపడే ఉపాధ్యాయుడి కూతురు పెళ్లికి ఏర్పడిన సమస్యలను పరిష్కరించి వివాహం జరిగేలా చూస్తాడు. అయితే పెళ్లి తర్వాత తన స్నేహితులిద్దరికి మీడియా అధినేత విశ్వనాథ్ (సోనుసూద్) వల్ల కష్టాలు ఎదురయ్యాయని రాజు తెలుసుకొంటాడు.

తాను ఇష్టపడిన మాధవి (అంజలి) రాజుకు ఎందుకు దూరమైంది? తమ గురువు కూతురు పెళ్లిలో ఎదురైన సమస్య ఏమిటి? తన స్నేహితులకు విశ్వనాథ్ ఎదురైన సమస్య ఏమిటి? మీడియా అధినేత విశ్వనాథ్ ఎందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకొన్నాడు. మంత్రి పదవి చేపట్టాలనుకొన్న విశ్వనాథ్ ప్రయత్నాలకు రాజు ఎందుకు అడ్డుగా నిలిచాడు? మాయపై రాజు క్రష్ ఎలా కొనసాగింది? తన ప్రేయసి మాధవిని మళ్లీ కలుసుకొన్నాడా? విశ్వనాథ్‌పై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? మినిస్టర్ సత్తిపండు (మనోబాల), రాజు స్నేహితుడు (సంతానం) ఈ కథలో హాస్యంతో ఎలాంటి వినోదాన్ని పండించారు అనే ప్రశ్నలకు సమాధానమే మధ గజ రాజా సినిమా కథ.
మధ గజ రాజ సినిమా రెగ్యులర్, రొటీన్ కథ. సుమారు 13 ఏళ్ల క్రితం రాసుకొని తీసిన కథ. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరకు సంక్రాంతి కానుకగా తమిళనాడులో రిలీజై ఘన విషయం సాధించింది. అయితే ఎలాంటి కొత్తదనం లేని కథకు సంతానం, మనోబాల క్యారెక్టర్లతో సృష్టించిన హాస్యం ఈ సినిమా విజయానికి చిరునామాగా మారిందని చెప్పవచ్చు. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా.. కామెడీ దట్టించి రాసుకొన్న సన్నివేశాలు స్టోరీని పరుగులు పెట్టించేలా చేశాయి. తెలుగు వెర్షన్ కోసం రాసిన డైలాగ్స్ పటాసుల్లా పేలడమే కాకుండా మంచి హాస్యాన్ని పండించి కడుపుబ్బ నవ్వించాయి.
మద గజ రాజగా విశాల్ తన మార్కు నటనను ప్రదర్శించారు. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. వరలక్ష్మీ, అంజలితో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టాడు. హీరోయిన్లతో కెమిస్ట్రీని బాగా వర్కవుట్ చేశాడు. అంజలి, వరలక్ష్మీ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నారు. సెకండాఫ్‌లో సోనుసూద్ పవర్‌ఫుల్ విలనిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాకు సంతానం, మనోబాల కామెడీ ప్రాణంగా నిలిచింది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

మద గజ రాజ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలనుకొంటే.. మూస కథతో రొటీన్, రెగ్యులర్ పాయింట్‌తో రూపొందినప్పటికీ.. కామెడీ, హాస్యంతో కూడిన సన్నివేశాలు, సంతానం పంచ్ డైలాగ్స్, మనోబాల ఫెర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాయి. కొత్తదనం ఆశించకుండా కేవలం వినోదం కోసం వెళ్తే కడుపుబ్బ నవ్వుకొని మంచి టైమ్ పాస్ మూవీ చూశామనే తృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చే అంశాలు ఫుల్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











