Mahaan Movie Review విక్రమ్ ఫెర్ఫార్మెన్స్, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ ఎలా ఉందంటే?
Rating : 3/5
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
నటీనటులు : విక్రమ్, బాబీ సింహ, ధ్రువ విక్రమ్, సనంత్, సిమ్రాన్
ప్రొడక్షన్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
దర్శకుడు: కార్తీక్ సుబ్బరాజ్
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రమ్. చాలా కాలంగా ఆయన సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి అపజయం మూటకట్టుకున్న కొడుకు ధ్రువ్ విక్రమ్ తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం 'మహాన్'. మాస్ సినిమాల కేరాఫ్ అడ్రెస్ కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్ వేదికగా 'మహాన్'ను విడుదల చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి పది గంటల నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఈమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది సమీక్షలో చూద్దాం.

'మహాన్' కథ ఏమిటంటే?
గాంధీ మహాన్ (చియాన్ విక్రమ్), గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా 40 ఏళ్ళ చప్పటి జీవితంతో విసుగు చెంది అతని భార్య (సిమ్రాన్) మరియు కొడుకు దాదా తిరుపతి వెళ్లడంతో రోజంతా ఇష్టం వచ్చినట్టు బతకాలని ఫిక్స్ అవుతాడు. ఆ రోజు అతని జీవితాన్ని మార్చేస్తుంది. కొడుకుని తీసుకుని భార్య వదిలి వెళ్లిపోవడంతో గాంధీ మహాన్ తన స్నేహితుడు సత్యవాన్(బాబీ సింహా) భాగస్వామ్యంతో మద్యం వ్యాపారిగా మారి బిలియనీర్ అవుతాడు. కొన్ని సంవత్సరాల తరువాత, కొడుకు గాంధీ దాదా (ధృవ్ విక్రమ్) పోలీసు అధికారి అవుతాడు. మద్యం వ్యాపారాన్ని అరికట్టడానికి ఆ మద్యం సిండికేట్ లో ఉన్న వ్యక్తులను చంపడానికి ఒక మిషన్‌ను ప్రారంభిస్తాడు.
ముఠాలోని ప్రతి ఒక్కరినీ చంపి ఈ మద్యం వ్యాపారాన్ని ఆపుతానని దాదా గాంధీతో సవాల్ చేస్తాడు. గాంధీ తనకు ప్రాణం లాంటి స్నేహితుడి కోసమో లేక విడిపోయిన కొడుకు కోసమో నిలబడాల్సిన సంక్లిష్ట స్థితిలో నిలబడతాడు. ఆ సమయంలో గాంధీ ఎవరికి అండగా నిలబడ్డాడు. మద్యం అరికడతాను అని దాదా ఛాలెంజ్ నెరవేరుతుందా? చివరికి దాదా, గాంధీ కలుస్తారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

'మహాన్' ట్విస్టులు
సినిమా మొదలయ్యాక కొంత సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ అసలు కథలోకి వెళ్లిన తర్వాత పూర్తిగా సీట్లకే అంటుకుపోయి విధంగా అనేక ట్విస్టులతో సినిమాను రూపొందించారు. చిన్నప్పటి స్నేహితులు అనుకోకుండా కలవడం, వారి కలయికే జీవితాలు మార్చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. భార్య కుమారుడిని తీసుకుని వెళ్ళిపోయిన తరువాత గాంధీ వ్యాపారాన్ని విస్తరించిన తీరు, తమ వాడినే మంత్రిగా మలచిన తీరు ఆకట్టుకుంటాయి. నిజానికి కొన్ని సీన్లలో తరువాత ఏమి జరగనుంది? అనే విషయాన్ని ఏ మాత్రం అంచనా వేయకుండా పకడ్బందీగా కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న కథనం అమోఘం.
అసలు సినిమా ఏమాత్రం ఊహించని విధంగా సాగిపోతూ ఉంటుంది. మద్యపానాన్ని నిషేధించే ఉద్యమం కోసం పోరాడుతూ గాంధీ మహాన్‌లా జీవిస్తానని చిన్న తనంలోనే తన తండ్రికి మాటిచ్చి పెద్దయ్యాక మద్యం సిండికేట్‌ను ఏలే ఒక డాన్‌గా ఎలా మారాడు? అలా డాన్ గా ఉన్న వ్యక్తి కొడుకు కోసం ఏం చేశాడు? అనే ట్విస్టులు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

దర్శకుడి టేకింగ్
జగమే తంత్రం లాంటి డిజాస్టర్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ 'మహాన్'తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. సినిమాలో పాత్రల మధ్య నాటకీయతకు మంచి స్కోప్ ఉంది. కార్తీక్ దానిని తెలివిగా ఉపయోగించుకున్నాడు. సినిమాలో అక్కడక్కడా కొన్ని చిన్నపాటి ల్యాగ్ లు ఉన్నప్పటికీ సినిమా బాగా ఎంగేజింగ్‌గా ఉంది. ఎటూ కదలకుండా మీ దృష్టిని కూడా మరల్చకుండా సినిమా చూసే విధంగా కార్తీక్ మేజిక్ చెసాడు.
చాలా కాలం తరువాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుంచి ఆశించిన అంచనా వేసిన అవుట్ ఫుట్ అయితే వచ్చింది. డైలాగ్స్ విషయంలో కూడా కార్తీక్ మేజిక్ పనిచేసింది.మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే సినిమా ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. చాలా వరకు సీన్లను అంచనా వేయలేకపోయినప్పటికీ కొన్ని సీన్ల విషయాల్లో మాత్రం ఇట్టే అంచనా వేయగలం.

విక్రమ్ నటన
చియాన్ విక్రమ్ మరోసారి అద్భుతమైన నటనను కనబరిచాడు. తన నటనా విశ్వరూపాన్ని చూపగలిగే గాంధీ లాంటి ఒక పాత్ర దొరకడంతో విక్రమ్ రెచ్చిపోయాడు. చాలా కాలం తరువాత ఆయన తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు రిచ్ లుక్ తేవడమేకాక సినిమా మొత్తాన్ని తన చేతుల మీదుగా నడిపించాడు.
మహాన్‌లో ఎక్కువ భాగం వాస్తవానికి విక్రమ్ యొక్క వన్-మ్యాన్ షో. ఆ వన్ మ్యాన్ షోని ఆయన చాలా ఈజీగా భుజాల మీద వేసుకుని నడపించాడు. విక్రమ్ లోని నట రాక్షసుడిని బయటకు తీసుకురావడానికి అవసరమైన పాత్రను కార్తీక్ అందించారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ చేసిన అన్ని పాత్రలలో ఇది బెస్ట్ అని చెప్పచ్చు.

ధృవ్ సహా ఇతర నటీనటుల నటన
మరోవైపు, ధృవ్ దాదాగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆదిత్య వర్మలో సూపర్ రొమాంటిక్, యాంగ్రీ యంగ్ మ్యాన్ లా నటించిన తర్వాత, మహాన్‌లో అతని పాత్ర చాలా ప్లస్ అయింది. తండ్రి మీద కోపం పెంచుకుని పగ తీర్చుకోవడానికి ఎదురుచూసి అవకాశం చిక్కితే విరుచుకుపడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించాడు. ఆదిత్య వర్మ సినిమా కంటే చాలా నటనా పరిణితి ధృవ్ లో కనిపించింది.
తండ్రీ కొడుకుల కాంబో, వారిద్దరి మధ్య సై అంటే సై అనేలా ఉండే సీనాలలో ధృవ్ మరింత అద్భుతంగా నటించారు. ఇక సిమ్రాన్ ఒక చిన్న పాత్రలో నటించినా తన అనుభవం స్క్రీన్ మీద కనపడేలా చేసింది. ఇక బాబీ సింహా గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన మేక్ఓవర్ అయితే ఆసక్తికరంగా ఉంది. కుర్రవాడిగా మొదలు ముసలివాడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాబీ సింహా కొడుకు రాకీ పాత్ర పోషించిన సనంత్ కూడా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేర నటించారు.

టెక్నికల్ విషయానికి వస్తే
సంతోష్ నారాయణన్ పాటలు నిజంగా మహాన్ లాంటి సినిమాకు మాత్రం ప్లస్ అవ్వట్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగా కుదిరింది కానీ కొన్ని చోట్ల కుదరలేదు. ఇక శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ టాప్-క్లాస్ అనే చెప్పాలి. ముఖ్యంగా సన్నివేశాల ఫ్రేమింగ్ మరియు లైటింగ్ కూడా కుదిరింది.
దాదా రాకీని చంపే సీన్ లో అయితే కెమెరా టెక్నిక్ మరో లెవల్ అంతే. ఇక వివేక్ హర్షన్ ఎడిటింగ్ టేబుల్ మీద మరింత పని చేయాల్సింది. గ్రిప్పింగ్ గా ఉంచడానికి కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉండవచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్ పోర్షన్‌తో సహా ఆకట్టుకునే ట్విస్ట్‌లు మరియు టర్న్‌లు రాసుకోవడంలో కార్తీక్ సక్సెస్ అయ్యాడు.
Recommended Video

ఫైనల్ గా
విక్రమ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ సహా ధృవ్ నటన సినిమాకు బాగా ప్లస్ అయింది. థియేటర్లలో విడుదల చేసి ఉంటె కలెక్షన్ల వర్షం కురిసి ఉండేది. తెలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తమిళంలో అయినా మంచి కలెక్షన్లు రాబట్టేధీ. తప్పకుండా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.


Click it and Unblock the Notifications











