సాధారణమైన 'మహా'రాణి

చిత్రం: మహారాణి
నటీనటులు: ప్రకాష్ రాజ్, ప్రశాంత్, దేవయాని
సంగీతం: దేవా
నిర్మాత: ప్రకాష్ రాజ్
దర్శకత్వం: వసంత్
అంతఃపురం, సముద్రం చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి తన నటనా పాటవాన్ని ప్రదర్శించిన ప్రకాష్ రాజ్ కు మహారాణి మరో అవకాశం. హిందీ చిత్రం సడక్ ఆధారంగా తీసిన ఈ సినిమా సడక్ స్థాయిలో లేదు. ఫర్వాలేదనిపించేట్లుగా ఉంది. ప్రకాష్ రాజ్ నటన, మంచి స్క్రీన్ ప్లే వంటి సానుకూల అంశాలున్నా చిత్రం అక్కడక్కడా బోరు కొట్టిస్తోంది. దర్శకుడు వసంత్ గత చిత్రం(ఆశ..ఆశ..ఆశ....)లాగే ఈ సినిమాలో కూడా సన్నివేశాల్లో రేసీనెస్ లేదు.
మహారాణి(ప్రకాష్ రాజ్)-ఆడా, మగా కాని కొజ్జా. ముంబాయిలో ఓ వేశ్యాగృహాన్ని నడుపుతుంటాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభం శుభం తెలియని అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి జీవనం సాగిస్తుంటాడు. ప్రశాంత్ టాక్సీడ్రైవర్. ప్రశాంత్ టాక్సీలోనే దేవయానిని తీసుకువచ్చి వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిస్తాడు-ప్రకాష్ రాజ్. దేవయాని మీద మనసు పారేసుకున్న ప్రశాంత్ ఆమెను కాపాడేందుకు పూనుకుంటాడు.
ప్రశాంత్ యత్నాలను ప్రకాష్ రాజ్ తిప్పికొడుతాడు. అనవసరంగా తన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని బుద్ధి చెపుతాడు. దేవయానిని మరిచిపోయేందుకు కొన్నాళ్ళూ నగరాన్ని వదిలి వేరే ఊరు వెళుతాడు. కానీ ఎంత ప్రయత్నించినా మనసు దేవయాని మీదినుంచి మరలకపోవడంతో తిరిగి వచ్చి ఆమెను రక్షించి పెళ్ళిచేసుకునేందుకు సిద్ధమవుతాడు. మహారాణి నుంచి దేవయానిని ఎలా రక్షిస్తాడనేదే చిత్రం ముగింపు.
హిందీలో సడక్ చిత్రం చూసిన వారికి ఈ చిత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నచ్చదు. ఎందుకంటే ఏ రకంగా చూసినా మహారాణి కన్నా సడక్ చాలా బావుంటుంది. అలాగే కొజ్జా పాత్రలో ప్రకాష్ రాజ్ ఎంత బాగా నటించినా, సదాశివ్ అమ్రాకర్పూర్ నటనే బావుందనిపిస్తుంది. దేవా సంగీతం ఫర్వాలేదు. సన్నివేశాల్లో చురుకుదనం ఉంటే బావుండేది.


Click it and Unblock the Notifications











