Mahesh Babu Review: గాంధీ తాత చెట్టుపై మహేష్ బాబు రివ్యూ.. సుకృతి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అంటూ
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బండ్రెడ్డి, ప్రముఖ నటుడు ఆనంద చక్రపాణి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా గాంధీ తాత చెట్టు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మించారు. సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ చిత్రం జనవరి 24వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
గాంధీ తాత చెట్టు సినిమా కథ విషయానికి వస్తే.. గాంధేయవాది అయిన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) పల్లెలు పచ్చగా ఉంటే దేశానికి మేలు జరుగుతుందనే విషయాన్ని అందరికీ బోధిస్తుంటారు. తనకు ఆదర్శప్రాయమైన గాంధీ పేరును తన మనవరాలి (సుకృతి వేణి బండ్రెడ్డి)కి పెట్టుకొని.. ఆ చిన్నారికి సత్యం, ధర్మం, మానవతా విలువలు లాంటి అంశాలను చెబుతుంటాడు. పరిశ్రమల పేరుతో పల్లె వాతావరణాన్ని విధ్వంసం చేయడానికి వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రయత్నాలను ఆయన అడ్డుకొంటారు. ఈ క్రమంలో తాతకు గాంధీ ఇచ్చిన మాట ఏమిటి? తాతకు ఇచ్చిన మాట కోసం గాంధీ ఎంత వరకు వెళ్లింది? అహింస అనే ఆయుధం ద్వారా గ్రామస్థులందరిని ఏకం చేసి.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను ఎలా ఎదురించింది? అనేది సినిమా కథ.

ఉన్నత విలువలతో దర్శకురాలు పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాను రిలీజ్‌కు ముందే మీడియాకు, సెలబ్రిటీలకు ప్రదర్శించారు. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నటీనటులు సుకృతి, ఆనంద చక్రపాణి ఉత్తమ నట ప్రదర్శనను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులకు ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన తర్వాత భావోద్వేగంతో మహేష్ ట్వీట్ చేశారు.
గాంధీ తాత చెట్టు సినిమా చూశాను. నాకే కాదు.. మీ హృదయాల్లో నిలిచిపోయేలా ఉంటుంది. అహింస నేపథ్యంగా ఓ భావోద్వేగమైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నా చిన్నారి స్నేహితురాలు సుకృతి బండ్రెడ్డి నటనను చూసి గర్వంగా ఫీలవుతున్నాను. నటిగా ఆమె ఎదిగిన తీరు చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాను అని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గాంధీ పాత్రలో సుకృతి వేణి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ చూసి నా హృదయం ఉప్పొగింది. ఈ చిన్నారి నటించిన మాస్టర్ పీస్ థియేటర్‌లో ఉంది. తప్పకుండా ఈ సినిమాను చూడండి అని మహేష్ బాబు తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మహేష్ బాబు ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











