For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఛస్తారా... చంపేయమంటారా (‘ఊకొడతారా.. ఉలిక్కి పడతారా' రివ్యూ)

  By Srikanya
  |

  బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజే వేరు... అందులోనూ పెదరాయుడు లాంటి విజయవంతమైన పాత్ర తరహా రోల్ అని ఊరిస్తే... ఇంకేముంది ఫ్యాన్స్ కే కాక మిగతా వారికి కూడా పండగే. అయితే ఆ రెండు విషయాలనే క్రేజి ఎలిమెంట్స్ గా తీసుకుని మిగతావి విస్మరిస్తే మాత్రం చూసేవారికి అగ్నిపరీక్షే. బాలకృష్ణ గెస్ట్ గా ఇంకా చెప్పాలంటే ఘోస్ట్ గా నటించిన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. బాలకృష్ణ గెటప్ దగ్గరనుంచి డ్రామా లుక్ తెచ్చిన నిర్లక్ష్యం చాలా భాదేస్తుంది. అయితే బాలకృష్ణ ని గెస్ట్ గానే భావించి ప్రక్కన పెడితే మంచు మనోజ్, అతని అక్క మంచు లక్ష్మి ప్రసన్న కొత్త దనం కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా క్లైమాక్స్ పేలవంగా ఉన్నా మంచు లక్ష్మి ప్రసన్న నటన మాత్రం శభాష్ అనిపిస్తుంది.

  సంస్థ: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌
  నటీనటులు: బాలకృష్ణ, మంచు మనోజ్‌, దీక్షాసేథ్‌, లక్ష్మీ ప్రసన్న, ప్రభు, సుహాసిని, భానుచందర్‌, పృథ్వీ, రఘుబాబు తదితరులు.
  దర్శకత్వం: శేఖర్‌ రాజా
  నిర్మాత: మంచు లక్ష్మీప్రసన్న
  సంగీతం: బెబో శశి
  సమర్పణ: మోహన్‌ బాబు
  విడుదల: జూలై 27,2012.

  గతంలో ఓ వెలుగు వెలిగిన గంధర్వ మహల్ కి అద్దెకు వస్తాడు ఓ యువకుడు(మంచు మనోజ్). అప్పటికే ఆ గంధర్వ మహల్ ని అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నవారిని గెంటేసి, ఆ మహల్ ప్రస్తుత యజమాని (ప్రభు)ని మంచి చేసుకుంటాడు. అంతేగాక ఆయన కూతురు (దీక్షాసేధ్)ని ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తూంటాడు. అయితే ఓ రోజు అతనికి ఆ గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు (బాలకృష్ణ) ఆత్మ కనిపించి భయపెట్టి, వార్నింగ్ ఇస్తుంది. పోనీ పారిపోదామంటే అక్కడ నుంచి వెళ్లనివ్వకుండా అడ్డు పడుతుంది. ఇంతకీ నరసింహ నాయుడు కథ ఏమిటి... నరసింహరాయుడు కుటుంబానికి ఆ యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి... గంధర్వ మహల్ ను రక్షించే క్రమంలో ఆ యువకుడుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మిగిలిన కథ.

  చంద్రముఖి, అరుంధతి వంటి సినిమా చేయాలనుకుని రెడీ చేసినట్లున్న ఈ చిత్రంలో ఎక్కడో క్లైమాక్స్ ట్విస్ట్ ని నమ్ముకుని ఫస్టాఫ్ ,సెకండాఫ్ లను ఏదీ రివిల్ చేయకుండా నీరసంగా నడిపారు. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర ను సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. బాలకృష్ణ పాత్ర ఎంతసేపూ "ఎవరైనా గంధర్వ మహల్ నాది అన్నాడో.... "అంటూ తన మహల్ గురించే తపనపడుతూ, దానికోసం పైట్ చేస్తూంటాడు. అలాగే హీరో మంచు మనోజ్ పాత్ర ని ట్విస్ట్ కోసం ఎవరో ఏమిటో చెప్పకుండా మొదటి నుంచి చివరి దాకా మూసి పెట్టి ఉంచటంతో ఆ పాత్రతో పండవలిసిన సీన్స్ పండలేదు. దాంతో ఎంతసేపూ మనోజ్ పాత్ర సస్పెన్స్ గానే ఉంటుంది తప్ప ఎంజాయ్ చెయ్యనివ్వదు.

  అదే చంద్రముఖిలో రజనీపాత్ర మొదటే సైక్రాటిస్ట్ గా రివిల్ చేసి.. చంద్రముఖి పాత్రను సస్పెన్స్ లో పెడతాడు. దాంతో ఫస్ట్ నుంచి చివరకి దాకా రజనీపాత్ర ఫన్ తో సాగుతూ ఎంటర్టైన్ చేస్తుంది. అదే ఈ సినిమాలో బాలయ్య పాత్ర, మనోజ్ పాత్ర రెండూ సస్పెన్స్ లో పెట్టడంతో డ్రామా పుట్టలేదు. ఒక పాత్రని రివిల్ చేసి మరో పాత్రను రివిల్ చేసినప్పుడే ఇలాంటి ధ్రిల్లర్ సినిమా ట్విస్ట్ లు పండుతూంటాయి. లేకపోతే క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడుకి ఏమీ అర్దకాక బిక్కమొహం వేసుకుని చూడాల్సిన స్ధితి వస్తుంది. "ఎవరైనా గంధర్వ మహల్ నాది అన్నాడో....", "రాయుడు చంపాలి అనుకంటే బ్రహ్మ దేముడు కూడా ఆపలేడు. కాపాడాలి అనుకుంటే యముడు కూడా చంపలేడు ".... వంటి డైలాగులలో తప్ప బాలకృష్ణను పూర్తిగా వాడుకోలేదనిపిస్తోంది. ఈ చిత్రం స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిపానని చెప్పారు కానీ.. అదే మైనస్ అనిపిస్తుంది.

  ఇక పాటల విషయంలో బాలకృష్ణపై ప్లాష్ బ్యాక్ లో వచ్చే అనురాగమే... మెలోడి ట్యూన్ తో ఆకట్టుకుంటుంది. ఇక హాస్య నటులు ధర్మవరుపు వంటి వారు కామెడీ చేసినా పెద్దగా పండలేదు. నటీనటుల్లో మంచు లక్ష్మి ప్రసన్న క్లైమాక్స్ సన్నివేశంలో తన విశ్వరూపం ప్రదర్శించి ఆశ్చర్యపరుస్తుంది. ఆమెకు ఈ సినిమా తర్వాత బయిట బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఇండస్ట్రీ మంచి ఆర్టిస్టుని ఉపయోగించుకోవటంలేదనిపిస్తుంది. సోనూ సూద్ మరో సారి అరుధంతిని గుర్తు చేస్తాడు. అలాగే సెకండాఫ్ లో వచ్చే సాయికుమార్ పాత్ర, గెటప్ పెద్ద జోకర్ లాగ ఉండి నవ్విస్తుంది తప్ప విలనీ కురిపించదు. అదో మైనస్ గా మారింది.

  మనోజ్ ఎప్పటిలాగేనే ప్రతీ ప్రేమ్ లో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. అయితే ఆ కొత్త దనం కనిపించినప్పుడల్లా అతనిలో తెలుగుతనం లోపిస్తూంటుంది. చాలా సార్లు డైలాగు డెలవరీలో తన తండ్రి డైలాగ్ కింగ్ ని అనుకరిస్తూండటం కూడా బావుంది. దీక్షాసేధ్...నటన అనేది నేర్చుకోకుండా సినిమాలు కంటిన్యూగా చేస్తూ రిటైర్ అయ్యిపోయేటట్లు ఉంది. కెమెర్ అద్బుతం కాదు కానీ బావుంది అనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్పు గా ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో చేస్తే బావుండేది. సంగీతం ఏదో పాప్ సాంగ్స్ వింటున్న ఫీల్ కలగ చేసింది.

  దర్శకుడుగా పరిచయమైన శేఖర్ రాజా... మంచి కథను ఎన్నుకుంటే ఉలిక్కిపడే సినిమా చేయకపోయినా ఊ కొట్టే సినిమా అయినా చేయగలడని, సీనియర్ దర్సకుడులా నటీనటులను హ్యాండిల్ చేసిన తీరు చెప్తుంది. నిర్మాతగా మంచు లక్ష్మి ప్రసన్న మంచి నిర్మాణ విలువతో ఈ సినిమా రూపొందించింది. కథ విషయంలోనూ జాగ్రత్త పడితే ఆమె మంచి విజయాలు సాధించగలరు అని ధైర్యంగా ఖర్చు పెట్టిన తీరు చెప్తోంది.

  ఫైనల్ గా ఆరు కోట్ల పైగా ఖర్చు పెట్టిన గంధర్వ మహల్ ని అంత ఖర్చు పెట్టిన సెట్ ఎలా ఉందో ఆసక్తి ఉంటే చూడటానికి ఈ సినిమాకి వెళ్లాలి. ఇక రెగ్యలర్ గా మంచు మనోజ్ సినిమాలు చూడటం అలవాటు పడిన వారికి ఈ సినిమా అతని మ్యానరిజంస్ క్యాజువల్ గా అనిపిస్తాయి.

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  English summary
  Manchu Manoj's "Uu Kodathara Ulikki Padathara" released with divide talk. Mainly Balakrishna's guest role not impressed. Manchu Laxmi Prasanna's performance is the main attraction for the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X