twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భక్తిరస గుళిక శ్రీ మంజునాథ

    By Staff
    |

    Sri Manjunatha
    సాంఘిక చిత్రాల వెల్లువలో పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలకు కాలం చెల్లిన మాట వాస్తవం. అయితే అప్పుడప్పుడూ కొంత మంది ఆయా చిత్రాల నిర్మాణానికి పూనుకోవటం ద్వారా మనుగడ ఉంది అని నిరూపిస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన భక్తిరస చిత్రమే శ్రీ మంజునాథ. రెండు సంవత్స రాల క్రితం అన్నమయ్య చిత్రంతో అఖిలాంధ్ర ప్రేక్షకుల్నే కాకుండా భక్తిరస చిత్రాలను ఆదరించే ప్రేక్షలందరినీ ఒప్పించి మెప్పించిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందటంతో ఓ విధమైన క్రేజ్‌ ఏర్పడింది.

    దానికి తగ్గట్లే ఈ సినిమాను భక్తిరస చిత్రంగానే మలిచారాయన. అన్నమయ్యలో మోహన్‌బాబు పాత్ర ద్వారా వచ్చిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకునో లేక భక్తిరసానికి శృంగారాన్ని జోడించటం ఎబ్బెట్టుగా ఉంటుందనుకున్నారో ఏమో కానీ తన తాజా చిత్రంలో సంఘవిపై చిత్రీకరించిన పాట సినిమాలో లేదు. అసలు విషయానికి వస్తే దేవుడు లేడంటూ నిందాస్తుతి చేసే ఓ హేతువాది శివుడికి పరమ భక్తుడిగా మారి శివ సాక్షాత్కారం పొందటమే ఈ చిత్రం కథ. ఏదో ఒక భాషకే ఈ చిత్రాన్ని పరిమితం చేసి ఉంటే బావుండేద.

    ఎందుకంటే ప్రధానంగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రం కావటం వల్ల కొద్దిగా కన్నడ వాసన వేసింది. కానీ ప్రధాన పాత్ర అయిన శివుడి పాత్రను చిరంజీవి పోషించటం వల్ల, అలాగే శివభక్తుడు మంజునాధుడుగా అర్జున్‌ నటించటం, ఆయన భార్యగా సౌందర్య నటించటంతో తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలో లీనమై పోతారు.

    కథ గురించి విపులీకరించాలంటే మంజునాథుడు (అర్జున్‌) నాస్తికుడు. దేవుడనే వాడుంటే పేద, గొప్ప తారతమ్యం ఎందుకు? అని ప్రశ్నిస్తూ అన్యాయాల్ని ఎదుర్కొవటానికి హింసను ప్రోత్సహిస్తుంటాడు. అతడిని ఆరాధిస్తుంటుంది ప్రక్క ఊరికి చెందిన కాత్యాయని (సౌందర్య). శివభక్తురాలైన ఈమెను ఊరి పెద్దలు పన్నిన వ్యూహం నుంచి తప్పించి పెళ్ళి చేసుకుంటాడు మంజునాథుడు. వారికి పుట్టిన బిడ్డ (ఆనందవర్థన్‌) కూడా శివభక్తుడవుతాడు. ఇది సహించలేని మంజునాథుడు బిడ్డను, ఇంట్లోని వారిని కూడా నిందిస్తాడు.

    అయితే శివుడి ఉపదేశం ద్వారా జ్ఞానోదయమై ధర్మస్థలిని సందర్శిస్తాడు. అదే సమయానికి అక్కడకి విచ్చేసిన అంబికేశ్వరమహారాజుకు మంజునాథపై గ్రామపెద్దలు ఫిర్యాదు చేయటంతో తన భక్తిరసంతో దీపాలను వెలిగించి కోటిలింగాలను ప్రతిష్టిస్తాడు మంజునాధుడు. ఇక్కడ నుంచే కథ రసవత్తరమైన రీతిలో సాగుతుంది. ఎంత శివభక్తుడైనా మంజునాథ మనసులో ఇంకా మలినం పోలేదని, దాన్ని కూడా వదిలిస్తానని ముదుసలి వేషంలో శివుడు వెళ్తాడు. మంజునాథచే గెంటివేయబడతాడు. నిజం తెలుసుకున్న మంజునాథుడు పాప పరిహారంగా అన్నదానం చేయతలపెట్టి బిడ్డను పోగొట్టుకుని కూడా అనుకున్న పని పూర్తి చేస్తాడు. ఈ పని చేసినందుకు రాజు ఆస్థానానికి దోషిగా వెళ్ళి జంగందేవర రూపంలో వచ్చిన శివుడి ప్రమేయంతో నిర్థోషిగా బయట పడతాడు.

    ఇదే సమయంలో మంజునాథుడి మరణం ఆసన్నమైందని యముడు గుర్తు చేయటంతో తన భక్తుడి ప్రాణాలను తీసుకు రావటానికి స్వయంగా వచ్చిన శివుడికి తన ఆతిథ్యాన్ని స్వీకరిస్తే గడపదాటి బయటకు వస్తానని మంజునాధుడు షరతు విధిస్తాడు. దాని ప్రకారం ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మంజునాధుడితో పాటు అతని భార్య కోరికపై ఇద్దరి ప్రాణాలను స్వీకరించి తిరుగు ప్రయాణం అవుతాడు శివుడు. స్థూలంగా ఇదీ కథ.

    కన్నడ ప్రజలు కథలు కథలుగా చెప్పుకునే 'చావులేని ఇంట్లో ఆవాలు తీసుకురమ్మని మంజునాధుడు భార్యను అడగటం', 'శివుడు తన ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తేనే గడపదాటి బయటకు వస్తానని మంజునాథుడు చెప్పటం' వంటి సన్నివేశాలతో ఈ కథను పకడ్బందీగానే అల్లారు రచయిత భారవి. దీనికి తోడు శివుడు మంజునాథుడి ఇంటికి వచ్చేటప్పుడు వెనుక శివలింగాలు రావటం, నందీశ్వరుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం, శివుడు ఆగాగు అనగానే శాంతించటం వంటి సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ పనితనం బాగా ఉంది. దర్మస్థలిని పోలినవిధంగా కోటిలింగాలతో వేసిన సెట్‌ కళా దర్శకుడి ప్రావీణ్యానికి మచ్చుతునక.

    నటీనటుల విషయానికి వస్తే మంజునాథుడిగా నటించిన అర్జున్‌కే అగ్రతాంబూలం ఇవ్వాలి. నటజీవితంలో ఎప్పుడో ఓసారి లభించే ఈ పాత్రలో ఆయన మమేకమై నటించారు. అలాగే ఆయన భార్యగా నటించిన సౌందర్య కూడా అద్భుతమైన నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సించి శివుడి పాత్రధారి చిరంజీవి గురించి. బ్రేక్‌డాన్స్‌లతో ప్రేక్షకులనలరించిన ఆయన రుద్రతాండవం కూడా కొద్దిగా బ్రేక్‌ మిక్స్‌ అయిందేమో అనిపించింది. అయితే మంజునాధుడిని పరీక్షించే నిమిత్తం ముదుసలిగా వచ్చినపుడు, అఘోరాగా నడిచి వచ్చిన సన్నివేశాల్లో ఆయన హావభావ ప్రకటన అత్యద్భుతమని చెప్పవచ్చు. ఉచ్ఛారణ పరంగా అక్కడక్కడా కొద్దిగా తడబడినా నటనా సామర్థ్యపు వెల్లువలో కొట్టుకుపోయిందది.

    మిగిలిన పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు తగిన రీతిలో న్యాయం చేశారు. కైలాసంలో కూడా హాస్యాన్ని పండించాలనే తాపత్రయంతో నంది, భృంగి పాత్రలను హాస్యగాళ్ళుగా దిగజార్చటం, చిరంజీవికి ఉన్న మాస్‌ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలనే తాపత్రయంతో శివపార్వతులకు గ్రూప్‌డాన్స్‌ పెట్టడం వంటి పొరపాట్లు కూడా ఉన్నప్పటికీ కథాగమనానికి అడ్డు అనిపించలేదు. ఒక్కటి మాత్రం నిజం. అన్నమయ్యని ఎలివేట్‌ చేయటానికి ఎంతగానో దోహదపడ్డ సంగీత ఝరి ఈ చిత్రంలో లేదు. ఈ చిత్రానికి ఉన్న ఏకైక, అతి పెద్దదైన లోపం ఇదే.

    శివలింగాన్ని ప్రతిష్టించటంలో భాగంగా అన్నీ ఒకే రకమైన లింగాలను రూపొందించే బదులు భిన్నాకృతులతోకూడిన అంటే పంచభూత లింగాలను, జ్యోతిర్లింగాలను చూపించి ఉంటే ఇంకా బావుండేది. పాటలలో ఆకట్టుకునేవి చాలా తక్కువ. ఆనందం, స్వాగతమయా యమాతో పాటలు బావున్నాయి. శంకర్‌మహాదేవన్‌ గానం చేసిన బ్రెత్‌లెస్‌ స్త్రోత్రం ఒక్కటే సంగీత పరంగా హైలైట్‌ అనదగ్గది. ముందు చెప్పిన విధంగా నిర్మాత నారా జయశ్రీదేవి ఈ చిత్రాన్ని తెలుగు భాషకే పరిమితం చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అలాగని తీసివేయదగ్గ చిత్రం కాదిది. రాఘవేంద్రజాలంతో తయారైన మరో భక్తిరస గుళిక శ్రీ మంజునాథ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X