Mareechika Movie Review: మరీచిక మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసండ్రా, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్, వడ్లమాని శ్రీనివాస్, తాగుబోతు రమేష్, భద్రం, అనీష్ కురువిల్లా తదితరులు
దర్శకత్వం: సతీష్ కాసెట్టి
నిర్మాతలు: రాజీవ్ చిలక, మేఘా చిలక
సహ నిర్మాత: భరత్ లక్ష్మీపాటి
రచన: లక్ష్మీ భూపాల
మ్యూజిక్: ఇళయరాజా
సినిమాటోగ్రఫి: అరవింద్ కన్నాభిరాన్
ఎడిటర్: జునైద్ సిద్దికి
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కోసనం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ డొంకాడ
బ్యానర్: చిలక ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-05-29
సిటీలో కేఫేను నిర్వహించే సంజయ్ అలియాస్ సంజూని స్టూడెంట్ వెంకటలక్ష్మీ (అనుపమ పరమేశ్వరన్) ప్రేమిస్తూ వెంటపడుతుంది. కానీ తన మనసులోని ప్రేమను మాత్రం బయటపెట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో లండన్‌కు చెందిన మరీచిక (రెజీనా కసండ్రా)తో లక్ష్మీకి పరిచయం అవుతుంది. మరీచికను సంజూకి లక్ష్మీ పరిచయం చేస్తుంది. అయితే ఎలాగైనా వాలంటైన్ డే రోజున తన లవ్ ప్రపోజ్ చేయాలని లక్ష్మీ డిసైడ్ అయితే.. అదే రోజున మరీచికకు సంజూ తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. అయితే తన ప్రేమను త్యాగం చేసి మరీచికతో సంజూ పెళ్లిని లక్ష్మీ జరిపిస్తుంది. ఇదిలా ఉంటే.. లక్ష్మీ ముందే సంజూని మరీచిక చంపేస్తుంది. దాంతో మరీచికను అరెస్ట్ చేయాలని సీఐ అంజిబాబు (అజయ్ ఘోష్) కలుస్తుంది.

సంజూపై వెంకటలక్ష్మీ ఎలా ప్రేమను పంచుకొన్నది? లండన్ నుంచి మరీచిక ఎందుకు వచ్చింది? సంజూ ప్రపోజ్ చేయగానే మరీచిక ఎందుకు ఒప్పుకొన్నది? సంజూని మరీచిక పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏమిటి? మరీచికను పెళ్లి చేసుకోవడానికి సంజూ ఉద్దేశం ఏమిటి? వెంకటలక్ష్మీ ఎందుకు తన ప్రేమను త్యాగం చేసింది? ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంజూను మరీచిక ఎందుకు చంపింది? మరీచిక కేసును సీఐ అంజిబాబు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు? మరీచిక అసలు మనిషా? దెయ్యమా? సంజూను హత్య చేయడం నిజమేనా? అనే ప్రశ్నలకు సమాధానమే మరీచిక సినిమా కథ.
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉంది. మంచి పాయింట్‌నే పట్టేశాడు. అందుకు తగినట్టుగా తగిన నటీనటులను ఎంపిక చేసుకొన్నాడు. కానీ కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూని చంపే సీన్‌తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. స్క్రీన్ ప్ల విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్‌ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. కాస్తో కూస్తో సినిమాను చూసేలా చేయడంలో రెజీనా, అనుపమ, విరాజ్ పెర్ఫార్మెన్స్ తమ సత్తాను తెరపైన చూపించారు.
ఫస్టాఫ్‌ను పూర్తిగా సాగదీత థియేటర్లలో ఆడియెన్స్ పరీక్ష పెట్టినట్టే ఉంటుంది. సెకండాఫ్‌లో దెయ్యం అంశం ఎత్తుకొని కొంత వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా అది ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. దాంతో సన్నివేశాలు అనాసక్తిగా కొనసాగుతాయి. మరీచిక దెయ్యమా? మనిషా? సంజూ బతికి ఉన్నాడా? చనిపోయాడా? తేల్చేస్తే వెళ్లిపోవచ్చనేంత విసుగు ఆడియెన్‌లో కలుగుతుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో రెజీనా కసండ్రా తన మార్కు నటనతో ఆకట్టుకొంటారు. ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను సులభంగానే పోషించారు. అనుపమ డిఫరెంట్ రోల్‌లో కనిపించింది. డీ గ్లామరైజ్డ్ రోల్‌తోపాటు గ్లామర్ షేడ్స్ రోల్‌ను పర్‌ఫెక్ట్‌గా చేసింది. విరాజ్ అశ్విన్ మరోసారి తన ప్రతిభతో ఆకట్టుకొన్నాడు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా భావోద్వేగమైన పాత్రతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అంజిబాబుగా సీఐ పాత్రలో అజయ్ ఘోష్ కామెడీ, నటన ఫర్వాలేదనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు పర్వాలేదనిపించారు.
మరీచిక సినిమా మొత్తానికి అత్యంత ఆసక్తికరమైన విషయం ఇళయరాజా సంగీతం. ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో సంగీతం అనే సరికి సినిమా చూడాలనే జోష్ కలిగిస్తుంది. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. ట్విస్టులతో కూడిన కంటెంట్‌ను గాడిలో పెట్టడం జునైద్ సిద్దిఖికి ఎడిటర్‌గా కత్తి మీద సామే అయి ఉండొచ్చు. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications