Maruthi Nagar Subramanyam Review: మారుతి నగర్ సుబ్రమణ్యం రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
మూవీ: మారుతి నగర్ సుబ్రమణ్యం
నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
లిరిక్స్: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి,
ఆర్ట్: సురేష్ భీమంగని,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి,
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి,
క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమల్లి
రిలీజ్ డేట్: 2024-08-23
మారుతి నగర్ సుబ్రమణ్యం టీచర్ ఉద్యోగం కోసం 1998 డీఎస్పీకి సెలెక్ట్ అవుతాడు. కానీ ఆ ఉద్యోగం రాకుండా కోర్టు స్టే ఇవ్వడంతో నిరాశకు గురి అవుతాడు. భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపై ఆదారపడి జీవిస్తుంటాడు. ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ మరో ఉద్యోగం చేయడానికి ఇష్టపడడు. కొడుకు అర్జున్ (అంకిత్ కోయా) తన తండ్రి సుబ్రమణ్యం అని చెప్పకుండా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అని చెప్పుకొంటూ ఉంటాడు. కాంచన (రమ్య పసుపులేటి) అనే చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో పడుతాడు. ఇదిలా ఉండగా, రకరకాల అవమానం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుబ్రమణ్యం బ్యాంక్ అకౌంట్‌లో 10 లక్షల రూపాయలు జమ అవుతాయి.

టీచర్ ఉద్యోగం రాకపోయినా 25 ఏళ్లకుపైగా ఎలాంటి జాబ్ లేకుండా ఎందుకు భార్య సంపాదనపై సుబ్రమణ్యం బతుకుతుంటాడు? తన తండ్రి అల్లు అరవింద్, తన అన్నయ్య అ్లలు అర్జున్ అని అర్జున్ చెప్పుకొంటాడు? కాంచనతో ఎలా ప్రేమలో పడ్డాడు? తొలి చూపులోనే పెళ్లి చేసుకోంటానని అర్జుణ్ చెప్పడంతో వారి తండ్రి భాస్కర్ (హర్షవర్ధన్) నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? కష్టకాలంలో ఉన్న సమయంలో అకౌంట్‌లో 10 లక్షలు పడితే సుబ్రమణ్యం ఏం చేశాడు? 10 లక్షల అప్పనంగా రావడంతో ఎలాంటి కష్టాలకు సుబ్రమణ్యం గురి అయ్యాడు? కళారాణి, సుబ్రమణ్యం సొంత ఇంటి కల తీరిందా? కాంచనను అర్జున్ పెళ్లి చేసుకొన్నాడా? 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎలాంటి క్లారిటీ వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా కథ.
ఇటీవల డీఎస్పీ పరీక్షపై కోర్టు తీర్పు అనే చిన్న పాయింట్ చుట్టూ ఫన్, కామెడీ, ఎమోషన్స్ తదితరల అంశాలతో రాసుకొన్న పాయింట్ బాగానే ఉంది. కానీ కథలోకి వెళ్లడానికి ముందు కాస్త తడబాటు కనిపించింది. అసలు పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కథపై సాధించిన పట్టును విడవకుండా రకరకాల పాత్రలు, ట్విస్టులతో కథను ఫీల్ గుడ్‌తో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు లక్ష్మణ్ కార్య సక్సెస్ అయ్యాడు. ఇక ఫస్టాఫ్‌లో కథా స్వభావం, పాత్రల పరిచయం కారణంగా కొంత ల్యాగ్ అనిపించినా.. సెకండాఫ్‌లో కథలో అనేక మలుపులతో చకచకా పరుగులు పెట్టించడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు రావు రమేష్‌ను చూసిన కోణం వేరు.. మారుతి నగర్ సుబ్రమణ్యంగా ఒక సినిమాను పూర్తిగా భుజాల మీద మోయడమే కాకుండా నటుడిగా తన స్టామినాను ప్రూవ్ చేసుకొన్నాడు. సినిమాకు కర్త, కర్మ, క్రియ కావడం, పుల్ లెంగ్త్ క్యారెక్టర్ లభించడంతో చెలరేగిపోయాడు. సెటైరికల్ కామెడీ, ఎమోషనల్ సీన్లలో అద్బుతంగా నటించారని చెప్పడం రొటీన్ అవుతుంది. కథానాయకుడిగా సినిమాను ముందుకు తీసుకెళ్లే సత్తా తనకు ఉందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు.
మిగితా నటీనటుల్లో అంకిత్ కోయా ఫెర్ఫార్మర్‌గా ఆకట్టుకొన్నాడు. రావు రమేష్‌తో పోటీ పడి నటించాడు. అలాగే తండ్రి కొడుకులుగా వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. రమ్య పసుపులేటితో కలిసి రొమాంటిక్ సీన్లలో మెప్పించాడు. కాంచనగా రమ్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. ఇక ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమోషనల్ క్యారెక్టర్‌తోనే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. ఆమెలో ఇంకా హీరోయిన్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అన్నపూర్ణమ్మ, అజయ్, ప్రవీణ్, మిగితా పాత్రల్లో నటించిన వారాంత తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయానికి వస్తే.. లక్ష్యణ్ కార్య రాసిన డైలాగ్స్ అద్బుతంగా పేలడమే కాకుండా ఫన్ క్రియేట్ చేశాయి. ఇక పాటల సాహిత్యం కూడా భాగుంది. అలాగే సినిమాను చాలా హోమ్లీగా కనిపించేలా ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి, సురేష్ భీమంగని ఆర్ట్ విభాగాలు పనిచేశాయి. చాలా సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి. ఇక బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. సెకండాఫ్‌లో సీన్ల కూర్పు బాగుంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక తబితా సుకుమార్ సమర్పకురాలిగా సినిమా రేంజ్‌ను పెంచారని చెప్పాలి.
ఫైనల్‌గా మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా విషయానికి వస్తే..ప్రధానంగా నటీనటుల ఫెర్ఫార్మెన్స్, కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ.. ఇంకాస్త దట్టించి ఉంటే.. ఆ ఫీల్ మరో రేంజ్‌కు వెళ్లి ఉండేది. ఆ ప్రయత్నం క్లైమాక్స్‌లో వర్కవుట్ అయింది. ఈ వారం క్లీన్ అండ్ ఫెయిర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలంటే మారుతి నగర్ సుబ్రమణ్యం ఎంచుకోవచ్చు. థియేటర్లలో రావు రమేష్ మిమ్మల్ని నిరాశపరచరు.
ట్యాగ్ లైన్: క్లీన్ ఫ్యామిలీ, ఫన్ డ్రామా


Click it and Unblock the Notifications











