మర్యాదగా చెప్పాలంటే కామిడీ తక్కువే!! ('మర్యాద'రామన్న రివ్యూ)


సంస్ధ: ఆర్కా మీడియా
నటీనటులు: సునీల్, సలోనీ, నాగినీడు, బ్రహ్మాజి, రావు రమేష్, సుప్రీత్, వేణు గోపాల్, ప్రభాకర్, కాంచి తదితరులు
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
కెమెరా: సి.రామ్ ప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: ఆర్.రవీందర్
విజువల్ ఎఫెక్ట్స్: ఆర్.సి.కమలాకరన్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
స్టైలింగ్: రమా రాజమౌళి
స్టోరీ ఐడియా: వరా ముళ్ళపూడి
కథ,మాటలు: ఎస్.ఎస్.కాంచి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
రిలీజ్ డేట్: 23 జూలై, 2010
యాక్షన్ చిత్రాల రాజమౌళి ట్రెండ్ మార్చి ఫుల్ లెంగ్త్ కామిడీ తీస్తున్నాట్ట...అదీ సునీల్ ని హీరోగా పెట్టి..ఎలా ఉంటుందో ఏంటో అంటూ గత కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్ళినా ఇది వినపడుతోంది. ఆ టాక్ కి తగ్గట్లుగానే మంచి ఓపినింగ్స్ కూడా మర్యాదరామన్నకి వచ్చాయి. కానీ సినిమాలో ఊహించనంత కామిడీ మాత్రం కరువవటం నిరాశపరిచింది. అయితే ఈ సినిమాకి సంభందించి ఇక్కడో గొప్ప విషయం మాట్లాడుకోవాలి. తెలుగులో కామిడీ సినిమా అనగానే తెరనిండా కామిడీ యాక్టర్లు, రకరకాల సబ్ ప్లాట్లుతో కామిడీ పండించే ప్రయత్నాలు కామన్. అయితే మర్యాదరామన్న తన మర్యాదను పోగొట్టుకోకుండా సినిమా ప్రారంభంలో ఎత్తుకున్న పాయింట్ ప్రక్కకు పోనివ్వకుండా,తెరనిండా కామిడీ నటులును నింపకుండా తెలుగు కామిడీ చిత్రాన్ని రూపొందించారు. ఇక 1923లో వచ్చిన బస్టర్ కీటన్ సైలెంట్ కామిడీ అవర్ హాస్పటిలాటి చిత్రం కథని ఈ కాలానికి ముఖ్యంగా ఫ్యాక్షన్ వాతావరణంలోకి మార్చి కథనం తయారుచేసుకున్న ఈ చిత్రం స్క్రిప్టు లోపమే సెకండాప్ ని డల్ చేసిందనిపిస్తుంది. అయితే హింస, అసభ్యత లేని ఈ చిత్రం, రాజమౌళి ట్రేడ్ మార్క్ తో ప్యామిలీలను రప్పిచే ప్రయత్నం చేస్తుంది. ఇక సునీల్ స్లిమ్ గా మారటమే కాక తనకు అలవాటైన హావభావాలను ప్రక్కన పెట్టి కొత్తగా ట్రై చేసాడు. అయితే సునీల్ ఇంతకు ముందులాగే బొద్దుగా ఉంటేనే చూడగానే నవ్వు వచ్చేదేమో ఒక్కోసారి అనిపించటం ఖాయం.
హైదరాబాద్ లో నానా కష్టాలుపడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న అనాధ రాము(సునీల్. అతనికి ఆశాకిరణంలా ఓ రోజు చిన్నప్పుడే వదిలేసిన తన సొంత ప్రాతం రాయలసీమ నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారసత్వపు పొలాన్ని స్వాధీనం చేసుకోమని ఆ లెటర్ లో ఉంటుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాము ఆ ఊరుకి గాల్లో తేలుకుంటూ బయిలుదేరతాడు. రాముకి ప్రయాణంలో అపర్ణ(సలోని)అనే అందాల అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ఓ పాట పాడుకుని తన ఊరు వెళ్ళిన రాముకి ఆ ఊరి పెద్ద రామనీడు(నాగినీడు)ఆతిధ్యమిస్తాడు.ఆ క్రమంలో వాళ్ళతో వారి ఇంటకి వెల్ళిన రాముకి రామనీడు తను ఇష్టపడ్డ అమ్మాయి అపర్ణ తండ్రి అని తెలిస్తుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవకుండా వెంటనే మరో విషయం బయిటపడుతుంది. అది వేరేదో కాదు..రామనీడు చిరకాల ప్రత్యర్ధి కొడుకే రాము. ఇది తెలిసిన వెంటనే రామనీడు, అతని కొడుకులు వెంటనే రాముని చంపేయాలనుకుంటారు. అయితే తమ ఆచారం ప్రకారం ఇంటిలో చంపకూడదని,గుమ్మం దాటి బయిటకు అడుగుపెట్టిన వెంటనే చంపేయాలని రెడీ అవుతారు. విషయం తెలుసుకున్న రాము ఇల్లు గుమ్మం దాటి బయిటకు వెళ్ల కూడదనుకుని నిర్ణయించుకుంటాడు. ఈ విపత్కర పరిస్ధితుల్లో ఇరుకున్న రాము అక్కడనుంచి ఎలా బయిటపడి తన ప్రాణాలు కాపాడుకుని,తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది మిగతా కథ.
సింగిల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న ఈ కథ సెకెండాఫ్ లో స్పీడు తగ్గింది.నెగిటివ్ పాత్ర అయిన రామనీడు ఇంటిలో నుంచి బయిటకు అడుగు బయిటకు పెట్టకూడదని నిర్ణయించుకున్న సునీల్ కి ఆ ఇంటిలో ఉండలేని పరిస్ధితులు ఏర్పాటు కావు. దాంతో పెద్ద టెన్షన్ పుట్టదు. అలాగే రామనీడు..సునీల్ ని బయిటకు గెంటడానికి ప్రయత్నం చేసి భంగపడితే బాగుండేది.అదీ జరగదు. అలా చేసుంటే సునీల్ కి ముందుకు వెళ్తే గొయ్యి...వెనక్కి వెళ్తే నుయ్యి లాంటి సిట్యువేషన్ ఏర్పడి మరిన్ని నవ్వులు పండేవి. అలాగే ఆ సమస్యలు నుంచి తప్పించుకునే క్రమంలో సునీల్ ..విలన్ రామనీడు కి కొన్ని కొత్త సమస్యలు తెచ్చి పెట్టి, ఆ ఫ్యామిలీని ఇరుకున పెడితే అప్పుడు మజా ఉండేది. అలా కాకుండా సినిమా మొత్తం సునీల్ భయపెడటమే సరిపోవటంతో ఆ క్యారెక్టర్ పూర్తి ప్యాసివ్ గా మారిపోయింది.దాంతో ధ్రిల్లింగ్ లేకుండా పోయింది. అలాగే సునీల్, సలోని మధ్య లవ్ ట్రాక్ పెద్దగా పండలేదని స్పష్టమవుతూంటుంది. అయితే ప్రాణభయింతో ఉన్నవాడు ప్రేమించటం కష్టమనేదీ లాజిక్కే.
ఇక టెక్నికల్ గా చెప్పుకోవాలంటే..రాజమౌళి తన గత చిత్రాలకు తీసిపోని విధంగా విజువల్ ట్రీట్ గా నీట్ గా చాలా సీన్స్ చిత్రీకరించారు. అలాగే కీరవాణి సంగీతంలో వచ్చిన తెలుగు అమ్మాయి, కిటీకీ ప్రక్కన అమ్మాయి పాటలు చాలా బాగున్నాయి.కథ అందించిన కాంచీనే రాసిన డైలాగులు సిట్యువేషన్ కి తగ్గట్లుగా కొన్ని చోట్ల పేలాయి. కళ్ళతో భావాలు పలికించే సలోనీ మంచి క్యారెక్యర్స్ దొరికితే బాగానే పండిస్తుందని నిరూపించుకుంది.ఆమెకు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్టవచ్చు. సునీల్ గురించి ప్రత్యేకించి చెప్పుకునేదేమీ లేదు..ప్రూవ్డ్ ఆర్టిస్టు.రవితేజ తన రెగ్యులర్ స్టైల్ లో సునీల్ సైకిల్ కి చెప్పిన డైలాగులు బాగానే ఉన్నా ఆ ట్రాక్ కి పెద్ద రెస్పాన్స్ రాలేదు. అలాగే రామినీడు గా వేసిన కొత్త ఆర్టిస్టు నాగినీడు కు మంచి ఆఫర్స్ వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా, ఆర్ట్ వర్క్. ఎందుకంటే సినిమా మొత్తం ఒకే ఇంటిలో జరగటంతో ఆ ఇంటి సెట్ ని నిండుగా వేసిన ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అబినందనీయులు.
ఫైనల్ గా మర్యాదగా(అంటే ఎక్కువ హంగామా, బిల్డప్, కామిడీ కూడా లేకుండా ఓ పెద్ద మనిషి తరహాలో గంభీరంగా )రాజమౌళి వ్యవహిరించి తీసిన చిత్రం మర్యాదరామన్న అని చెప్పాలి. అధ్బుతమేమీ కాకపోయినా ఒక్క సారి చూసి ఆనందించటానికి లోటు రానివ్వదు. రాజమౌళి రెగ్యులర్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని(పాపం ట్రైలర్స్ లోనూ ఇదే చెప్తున్నారు)చూడకుండా ఉంటే ఓకే అనిపిస్తుంది. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసింటే రాజమౌళి కష్టానికి,ధైర్యానికి(సునీల్ తో తీయటం)కి పూర్తి స్ధాయి ఫలితం దక్కేది.ఏదైమైనా స్టార్ డైరక్టర్ ఇలాంటి కామిడీ తీయటం సాహసమే. దానికి మరోసారి జైజైలు చెప్పవచ్చు. ఆఖరుగా సినిమా చూసి సునీల్ గత చిత్రం అందాలరాముడే బాగుంది అంటే మాత్రం మా పూచీ లేదు.


Click it and Unblock the Notifications











