Mem Famous Review సరదాగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. మేమ్ ఫేమస్ ఎలా ఉందంటే?
Rating: 2.75/5
నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి మామ, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్
బ్యానర్: లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
మ్యూజిక్: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫి: శ్యామ్
సౌండ్ డిజైనర్ నాగార్జున
కాస్ట్యూమ్ డిజైనర్: శివ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత సూర్య చౌదరి
రిలీజ్ డేట్: 2023-05-26
మహి, బాలీ, దుర్గ (సుమంత్ ప్రభాస్, మణి, మౌర్య)ముగ్గురు చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగిన ప్రాణ స్నేహితులు. అయితే ఎలాంటి ఎలాంటి బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఊర్లో గాలి తిరుగుడు తిరుగుతుంటారు. తన మేనమామ (మురళీధర్ గౌడ్) కూతురు మౌనిక (సిరి)ని ప్రేమిస్తే.. బబ్బీ (సార్య)ను బాలీ ప్రేమిస్తుంటారు. ఊర్లో కొన్ని సమస్యలు ఫేస్ చేసిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకొని ఫేమస్ టెంట్ హౌస్‌ను మొదలుపెడుతారు.

అల్లరి చిల్లరి పనుల మానేసి టెంట్ హౌజ్ పెట్టిన మహి, బాలీ, దుర్గకు ఎలాంటి అనుభవం ఎదురైంది? ముగ్గురి జీవితాలకు టెంట్ హౌజ్ రూపంలో ఎదురైన ఛాలెంజ్ ఏమిటి? తన మరదలు మౌనికతో మహీ లవ్ లైఫ్ ఎలా సాగింది? మౌనికను మహికి ఇచ్చి పెళ్లి చేయడానికి మేనమామ ఎందుకు నిరాకరించాడు? టెంట్ హౌజ్ వల్ల ఎదురైన చేదు అనుభవం తర్వాత మహీ, లిప్‌స్టిక్, బాలీ ఫేమస్ కావడానికి ఏం చేశారు. ఎలాంటి పనులు చేసి ఊరికి మంచి చేశారు? ఊరికి ఎలా మంచి చేసిన తర్వాత మేము ఫేమస్ అని నిరూపించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే మేమ్ ఫేమస్ సినిమా కథ.
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పరిచయమైన సుమంత్ ప్రభాస్ ఎలాంటి సాహసం చేయకుండా సింపుల్ కథను తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా రాసుకొన్నారు. కథలో కొత్తదనం లేకపోయినా కొత్తగా కథ చెప్పాలనే ప్రయత్నంలో నిజాయితీ కనిపించింది. తన చుట్టూ ఉండే క్యారెక్టర్లకు చక్కటి ఇంపార్టెన్స్ ఇచ్చి కథలో భాగం చేయడం సినిమాకు నిండుతనం వచ్చింది. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ఎమోషనల్‌గా సాగడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సుమంత్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. క్లైమాక్స్ చెప్పడానికి బలమైన పాయింట్ లేకపోయిందనే విషయం ఆరంభంలోనే స్పష్టమవుతుంది. కథను 15 నిమిషాలు సాగదీసినట్టు అనిపించినా ఎంటర్‌మెంట్‌తో కథ నడిపించడం సినిమా నిలబడే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. సెకండాఫ్‌లో లిపిస్టిక్ ఎపిసోడ్, మహి,మౌనిక మధ్య కల్లు సీన్, గోరేటి వెంకన్న పాట సినిమాకు బలంగా మారాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. సరదాగా గడిచిపోయే తెలంగాణ నేటివిటి ఉన్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కల్యాణ్ నాయక్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్‌లో మౌనిక బర్త్ డే సీన్ తర్వాత జరిగే గొడవ సీన్ లాంటి సన్నివేశాలను బీజీఎం మరింత ఎలివేట్ చేసింది. శ్యామ్ అందించిన సినిమాటోగ్రఫి పల్లెటూరులో తిరిగి వచ్చామనే ఫీలింగ్ కల్పించింది. సృజన ఎడిటింగ్ పనితీరు బాగుంది. కొంత నిడివి తగ్గించి ఉంటే.. స్క్రీన్ ప్లే, ఫీల్ కరెక్ట్‌గా సెట్ అయ్యేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్, క్యాస్టూమ్ విభాగాల పనితీరు కూడా బాగుంది.
మేమ్ ఫేమస్ సినిమా సక్సెసా? కాదా అనే విషయం పక్కన పెడితే.. 50 మంది కొత్తవారిని, కొత్త దర్శకుడు, హీరోను నమ్మి ప్రాజెక్టు చేయడమే మొదటి సక్సెస్. కమర్షియల్ హంగులకు వెళ్లకుండా నిజాయితీగా కథ చెప్పాలనే ప్రయత్నం ఛాయ్ బిస్కెట్, లహిరి ఫిలింస్ భాగస్వామ్యంలో కనిపించింది. మంచి నిర్మాణ విలువలతో ఫీల్‌గుడ్ మూవీని అందించే ప్రయత్నం చేయడాన్ని అభినందించాలి.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంగా సాగే కథలో ఎలాంటి బరువు బాధ్యతలు తెలియని ముగ్గురు యువకులు, వారి చుట్టు ఉండే వ్యక్తులు ఎలా ప్రయోజకులయ్యారనేది సింపుల్‌గా కథ. కానీ ఎంటర్‌టైనింగ్‌గా కథను నడించడం దర్శకుడు సుమంత్ ప్రభాస్ తన ప్రతిభను చాటుకొన్నాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరు గుర్తుండిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కథను నిజాయితీగా చెప్పాలనే ప్రయత్నంలో సాగదీసినట్టు, నిడివి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ ఇంకా పండించి ఉంటే సినిమాకు మరింత బలంగా మారేదనిపిస్తుంది. ఎలాంటి లాజిక్స్, లెక్కలు వేసుకొకుండా వెళ్లితే..మంచి ఫీల్‌ను, అనుభూతి లభిస్తుంది.


Click it and Unblock the Notifications











