Mere Husband Ki Biwi Hindi Review: మేరే హస్పండ్ కీ బీవీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. రకుల్ ప్రీత్ ఖాతాలో హిట్టు
Rating: 2.75/5
మేరే హస్పండ్ కి బీవీ
నటీనటులు: అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమీ పడ్నేకర్, శక్తి కపూర్, డినో మారియా, ముఖేష్ రుషి, హర్ష్ గుజ్రాల్, అనితా రాజ్ హితెన్ పటేల్, కన్వల్జిత్ సింగ్ తదితరులు
దర్శకత్వం: ముదస్సర్ అజీజ్
రచన: ముదస్సర్ అజీజ్, వషు భగ్నానీ
నిర్మాతలు: జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్
సినిమాటోగ్రఫి: మనోజ్ కుమార్ ఖాతోయి
ఎడిటింగ్: నినద్ ఖనోల్కర్
మ్యూజిక్: డాక్టర్ జ్యూస్, విశాల్ మిశ్రా, తనిష్క్ భాగ్చి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జాన్ స్టివార్ట్ ఎడూరి
రిలీజ్: 2025-02-21
అంకుర్ చద్దా (అర్జున్ కపూర్)కు భార్య పబ్లీన్ కౌర్ ధిల్లాన్ (భూమీ పడ్నేకర్) పరిష్కరించుకోలేని విధంగా విభేదాలు చోటు చేసుకోవడంతో మ్యారేజ్ బ్రేకప్ అవుతుంది. భార్యతో సపరేట్ అయి ఆందోళనలో ఉన్న అంకుర్‌కు కాలేజీ సమయంలో పీకల్లోతు ప్రేమలో మునిగిన అంత్ర ఖన్నా (రకుల్ ప్రీత్ సింగ్) మళ్లీ తారసపడుతుంది. ఒంటరిగా ఉన్న అంకుర్ మరోసారి అంత్రాకు దగ్గర కావాలనుకొంటాడు. వారిద్దరి కలిసి లైఫ్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న సమయంలో మళ్లీ అంకుర్ జీవితంలోకి పబ్లీన్ ఎంట్రీ ఇస్తుంది. గతంలో వైవాహిక జీవితంలో వచ్చిన అభిప్రాయ బేధాలన్నీ మరిచిపోయి అంకుర్‌తో జీవితాన్ని కొనసాగించాలనుకొంటుంది.
అంకుర్‌కు పబ్లీన్ మధ్య విభేదాలకు కారణం ఏమిటి? ఏ పరిస్థితుల్లో అంకుర్, పబ్లీన్ విడిపోయారు? కాలేజీ లైఫ్‌లో అంత్రాతో అంకుర్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అంకుర్‌కు అంత్రాకు లవ్ బ్రేకప్ ఎలా జరిగింది? మరోసారి లైఫ్‌లోకి వచ్చిన అంత్రాతో రిలేషన్ ఎలా కొనసాగింది? అంత్రాతో లవ్ లైఫ్ లీడ్ చేస్తున్న అంకుర్‌కు పబ్లీన్ మరోసారి ఎలాంటి షాక్ ఇచ్చింది. గతంలో జరిగిన విషయాలు మరిచిపోయి పబ్లీన్‌కు రెండో అవకాశం ఇచ్చాడా? లేదా అంత్రాతో అంకుర్ జీవితాన్ని పంచుకోవడానికి పబ్లీన్ ఛాన్స్ ఇచ్చిందా? ఈ ముగ్గురి మధ్య ట్రాయంగిల్ లవ్ ఎలా సాగిందనే వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో పతీ, పత్నీ ఔర్ ఓ, హ్యాపీ భాగ్ జాయేగి చిత్రాల దర్శకుడు ముదస్సర్ అజిజ్ మరోసారి మ్యారేజ్ బ్రేకప్ పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాను కథాంశంగా ఎంచుకొన్నాడు. సెటైరికల్, చురుకైన డైలాగ్స్‌తో కామెడీని పండించే ఆయన ఈ సినిమాకు కూడా అదే పంథాను కొనసాగించాడు. అయితే 90 దశకంలో ఇలాంటి స్టోరీతో సినిమాలు వచ్చేవి. ఈ తరం ఆడియెన్స్ అభిరుచికి దూరంగా ఉన్నప్పటికీ.. కొత్తదనంతో ఈ సినిమాను మెప్పించే ప్రయత్నం చేశారు. లవ్, రిలేషన్‌షిప్స్, బ్రేకప్ లాంటి అంశాలతో స్లాప్ స్టిక్ కామెడీతో ఆలరించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.
గతంలో ఇలాంటి తరహా కామెడీ చిత్రాల్లో నటించిన అర్జున్ కపూర్‌కు ఈ మూవీలోని అంకుర్ పాత్రలో నటించడం పెద్దగా కష్టమనిపించలేదనే చెప్పాలి. తనదైన శైలిలో పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకొని నటించి మెప్పించాడనే చెప్పాలి. జీవితంలో జరిగిన చేదు అనుభవాల మధ్య తికమక పడే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. భర్తను హింసించే, కాళరాత్రులను చూపించే భార్య పబ్లీన్ పాత్రలో భూమీ పడ్నేకర్ స్వభావ సిద్దంగా నటించింది. ఓ రకంగా గయ్యాళితనంతో కూడిన పాత్రను సునాయసంగానే పోషించిందనే చెప్పాలి. మ్యారేజ్ బ్రేకప్ అయి ఒంటరితనంతో బాధపడే యువతిగా ఎమోషన్స్‌ను చక్కగా పడించింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ అంత్రా ఖన్నా పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్‌ను పండించడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న ఫిజియోథెరపిస్ట్ పాత్రలో మెరిసిందనే చెప్పాలి. అర్జున్ కపూర్‌తో కలిసి కొన్ని సీన్లలో హాట్ హాట్‌గా నటించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీని బాగా పండించింది. అంకుర్ స్నేహితుడిగా స్టాండప్ కమెడియన్ హర్ష్ గుజ్రాల్ కామెడీని పండించాడు. రకుల్‌కు అన్నగా డినో మారియా, ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, శక్తి కపూర్, అనితా రాజ్, కన్వల్జిత్ సింగ్ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ మూవీకి మ్యూజిక్, పాటలు స్పెషల్ ఎట్రాక్షన్. పంజాబీ బ్యాక్ డ్రాప్‌తో పాటలు ఆకట్టుకోవడమే కాకుండా మంచి జోష్‌ను పుట్టిస్తాయి. డైలాగ్స్ మంచి హాస్యాన్ని అందిస్తాయి. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. ఎడిటింగ్ విభాగం పనితీరు ఇంకా బెటర్‌గా ఉంటే ఫస్టాఫ్‌లో ల్యాగ్ తగ్గి ఫీల్ గుడ్‌గా మారి ఉండేదనిపిస్తుంది. భగ్నానీ ఫ్యామిలీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
మేరే హస్పండ్ కి బీవీ సినిమా విషయానికి వస్తే.. కొత్త సీసాలో పాత సారా లాంటి కథ. 90 దశకంలో వచ్చిన కథలా ఉండే ఈ సినిమా ఫస్టాఫ్ చాలా బోరింగ్‌గా ఉంటుంది. కథలోకి వెళ్లడానికి దర్శకుడు ఎక్కువగా సమయం తీసుకోవడంతో సినిమా సాగదీసినట్టు ఉండటమే కాకుండా కొన్ని సందర్భాల్లో సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. సెకండాఫ్‌లో మూడు పాత్రల మధ్య డ్రామా, లీడ్ యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ కారణంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా, మ్యారేజ్, రిలేషన్‌షిప్స్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అంచనాలు లేకుండా వెళితే.. కామెడి సన్నివేశాలతోపాటు సినిమాను కూడా ఎంజాయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications











